ధర్మసందేహం గోరింటాకు ఆ మూడుసార్లేనా?

గోరింటాకును ఏడాదిలో ఆషాఢ, భాద్రపద, ఆశ్వయుజ మాసాల్లోన పెట్టుకోవాలని అంటారు. మిగతా సమయాల్లో పెట్టుకోకూడదా? గోరింటాకులో ఏమైనా ఔషధ విలువలు ఉన్నాయా?
సాధారణంగా గోరింటాకును ఆషాఢ మాసంలో ఒకసారి, భాద్రపద మాసంలోని ఉండ్రాళ్ల ్లతద్దికి ఒకసారి, ఆశ్వయుజ మాసంలోని అట్లతద్దికి ఒకసారి చేతులకు, కాళ్లకు మహిళలు అలంకరించుకుంటారు. కానీ, గోరింటాకును ఎప్పుడైనా వాడొచ్చు. ఇది నిజానికి మన ఇంటి పెరటి మొక్క. దీనిని ఎంత విరివిగా వాడితే అంత మంచిది. ప్రధానంగా గోళ్లకు పెట్టుకునేది కావడం వలన దీనికి గోరింటాకు (గోరు G అంటు) అనే పేరు స్థిరపడిరది. గోరింటాకును సంస్కృతంలో ‘నఖరంజని’ అని అంటారు. అంటే, గోళ్లకు రంగు కల్పించేదని అర్థం. ఇక, గోరింటాకులో ఉన్న ఔషధ విలువలు అన్నీఇన్నీ కావు. గోళ్లలో చేరేమట్టి, రోగకారక క్రిములు, కాళ్ల వేళ్ల సందున పాచిపోవడం వంటి సమస్యలకు గోరింటాకే ఔషధం. ఎక్కువ సేపు గోరింటాకు చేతికి అంటిపెట్టుకుని ఉండటం వల్ల దాని ఔషధ లక్షణాలు శరీరంలోకి చేరతాయి. గోరింటాకు త్రిగుణాల కలయిక. ఔషధ మూలికగా, చర్మ సంరక్షణిగా, నొప్పుల నివారిణిగా ఉపయోగపడుతుంది. దీనిలోని ఔషధ గుణాలేమిటంటే..
గోరింట నిస్సందేహంగా గొప్ప ఔషధ మూలిక. ఆయుర్వేదం దీనినీ ఔషధకారిగా గుర్తించింది. గోళ్లకు పెట్టుకోవడం విషయంలోనే కాక జుత్తు పోషణ, చర్మసంరక్షణ, చర్మానికి మంచి నిగారింపు ఇచ్చే విషయాలలోనూ ఇది హితకారిణి.
గోరింటాకు ఆకులు, పట్ట, పూవులు, గింజలు అన్నీ కూడా మంచి ఓషధ గుణం కలిగి ఉన్నాయి.
గోరింటలో ఒక విధమైన చిరు విషం ఉంటుంది. దాన్ని ‘హెన్నాటానిస్‌ యాసిడ్‌’ అంటారు. ఇదే దీని ఆకులకు చేదు గుణాన్ని ఇస్తుంది. ఈ విష గుణం మనుషులకు ఎటువంటి హాని చేయదు.
గోరింట పువ్వులతో అత్తరు, ఇతర వాసన వచ్చే నూనెలను తయారు చేస్తారు. ఈ పువ్వుల నుంచి బట్టీ పట్టిన నీటిని యూదులు స్నానానికి ఉపయోగించే వారని చరిత్ర చెబుతోంది.
గోరింట పువ్వులతో నింపిన గుడ్డ సంచిని తలగడగా పెట్టుకుంటే మంచి నిద్రను కలిగిస్తుందని అంటారు.

మొత్తం గోరింటాకు చెట్టులో ఆకులే ప్రధానమైనవి. వీటిని మెత్తగా దంచి అందులో కాచు, కాకిబొడ్డు, పోకచెక్క, చిల్లపెంకు తదితర వాటిలో అన్నీ కానీ, కొన్ని కానీ వేసి మెత్తగా నూరి తలకు పెట్టుకుంటే ఎర్రని రంగు హత్తుకుంటుంది.
గోరింట ఆకులు నూరిన ముద్దలో నిమ్మరసం కలిపి అరికాళ్లకు పట్టిస్తే మంటలు, నొప్పులు తగ్గుతాయి.
గోరింటాకులు నూరిన ముద్దలో నూనె, తెల్ల గుగ్గిలం కలిపి నుదుటికి పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది.
గోరింట నూరిన గుజ్జులో నీలి మందు వేసి వెంట్రుకలకు పట్టిస్తే వర్ణకారిగా ఉంటుంది. జుత్తుకు పోషణను ఇస్తుంది.
గోరింటాకుల రసం కొబ్బరినూనెలో కలిపి తలకు మర్దన చేస్తే జుత్తు రాలదు.
గోరింటాకుల నుంచి తయారు చేసిన ‘మలామా’ గాయాలను, కురుపులను మాన్పుతుంది.
గోరింటాకు కషాయంతో కాపడం పెడితే బెణుకు నొప్పులు, వాపులు తగ్గుతాయి.
గోరింటాకు ముద్దను గోళ్లకు పెట్టుకోవడం వల్ల వాటికి చక్కని రంగు పట్టడమే కాక, గోళ్లకు పిప్పి మున్నగు వ్యాధులు రాకుండా కాపుదలగా ఉంటుంది.

Review ధర్మసందేహం గోరింటాకు ఆ మూడుసార్లేనా?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top