ధ్యానం… చేస్తే జన్మ ధన్యం

మనపై మనకు నియంత్రణ, మనో నిగ్రహం లేకపోవడం వల్లే నేడు ఇంటా బయటా అనేక సమస్యలు పుట్టుకొస్తున్నాయి. స్వీయ నియంత్రణ అనేది ప్రతి వ్యక్తికీ అవసరం. దాన్ని పొందడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. వాటిలో ‘పూజ’ అనేది ఒకటి. అంటే, ఆధ్యాత్మిక సాధన. దీని ద్వారా మనపై మనం పట్టు సాధించవచ్చు.

అన్ని జన్మలలోకి మానవ జన్మ ఉత్త మోత్తమమైనది. అటువంటి జన్మను పొందిన మనం అదృష్టవంతులం. ఈ జన్మను సార్థకం చేసుకోవాలి కదా! ప్రతి వ్యక్తికీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఎటువంటి చికాకులు లేకుండా సక్రమమైన జీవితం గడపాలన్నా, ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించాలన్నా కొన్ని ధర్మాలను ఆచరించడం తప్పనిసరి. అలాగే దైవభక్తి అనేది కూడా మనిషికి అవసరం.
ప్రతి రోజూ కొంత సమయం దేవుడికి పూజించడానికి కేటాయిస్తే మంచిది. దైవంపై దృష్టి సారించడం ద్వారా మనస్సు ప్రశాంతత పొందుతుంది. దైవ ధ్యానం అనేది ఆరోగ్య రీత్యా కూడా ఉత్తమం. పూర్వకాలం మహ ర్షులు, మునులు విపరీతమైన ధ్యానం చేసే వారు. వారు ఏ విధమైన చింతలు లేకుండ కోరికలు అనేవి లేకుండా ప్రశాంతంగా జీవించే వారు.
మనిషికి మనో నిగ్రహం అవసరం. దాన్ని పొందాలంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా ధ్యానం చేయడం అవసరం. కళ్లు, చెవులు, ముక్కు, నోరు, జ్ఞానేంద్రియాలు.. ఇవి మాన వునికి ప్రపంచం అంటే ఏమిటో తెలుసు కోవడానికి ఉపయోగపడే సాధనాలు. అలాగే, కాళ్లు, చేతులు, కర్మేంద్రియాలు.. ఇవి మనం కోరుకున్నవి పొందడానికి పనిచేసే పరికరాలు. ప్రకృతిలో అందమైన దృశ్యాలను చూడటానికి కళ్లు ఆరాటపడతాయి. శుభవార్తలను, మంచి మాటలను వినడానికే మనం ఇష్టపడతాం. అలాగే, సువాసనలను, స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి ముక్కు ఉపయోగపడుతుంది. నాలుకకు రుచులంటే అత్యంత ప్రీతి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనకు ఎల్ల ప్పుడూ లోబడి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం అవసరం. మనం ఇంద్రి యాలకు లోబడి ఉండకూడదు. ఇంద్రియాలు మన అధీనంలోనే ఉండాలంటే మనసును ముందుగా మన అదుపులో ఉంచుకోవాలి. మనసును నిలకడగా ఉంచడం సాధ్యం కాదు. అది చూసిన ప్రతి దానినీ పొందాలని తాప త్రయ పడుతుంది. ఇంద్రియాల మీద ఒత్తిడి తెస్తుంది. దాంతో అనేక రకాల ఇబ్బందులు పడటం మామూలే. అలా కాకుండా మనో నిగ్రహం పొందాలంటే మనసును దైవ ధ్యానం మీద లగ్నం చేయాలి. అర్థం లేని ఆలోచనలు మనసును చుట్టుముడితే ఇష్టదైవ నామాన్ని జపించాలి. అస్టమాటూ గుడికి వెళ్లడానికి కుదరకపోయినా బాధపడాల్సిన పనిలేదు. మనసు భగవంతుడి మీద నిమగ్నం చేయ గలిగితే చాలు.
మనసు ఎంత నిర్మలంగా ఉంటే అంత జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వల్ల మనో నిగ్రహం వస్తుంది. అంతే కాకుండా బాహ్య ప్రపంచంలో తిరగడం వల్ల, మంచి పుస్తకాలు చదవడం వల్ల, మంచి మాటలు వినడం వల్ల, మంచి వ్యక్తులతో మాట్లాడటం వల్ల మనకు తెలియని అనేక విషయాలు తెలిసి వస్తాయి. తద్వారా జ్ఞానం పెరుగుతుంది. తెలివైన వాళ్లు దేనికీ భయపడరు. ఎలాంటి పనైనా సరే దిగ్విజయంగా చేయగలుగుతారు. అంతేకాక ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించగలుగుతారు. నోరు మంచిదైతే ఊరు మంచిదనే సామెత కూడా ఉంది. దీన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టే వారు చాలా తక్కువ మంది ఉఏంటారు. ఇంటికి వచ్చిన అతిథులను, స్నేహితులను ఆదరించి వారితో ఏ విధమైన పరుష వాక్యాలు పలకకుండా మంచిగా మాట్లాడాలి. అంతే కానీ చీటికీమాటికీ అబద్ధాలు, లేనిపోని గొప్పలు చెప్పుకోకూడదు. అటువంటివి మాట్లాడకూడదు. ఎదుటి వారితో మనం ఆత్మీ యంగా మాట్లాడితే అందరూ మనమంటే ఇష్ట పడతారు. గౌరవిస్తారు. మన మాటకు విలువ నిస్తారు.
అలాగే కోరికలు అనంతాలు. ప్రతి ఒక్కరికీ కోరికలు ఉంటాయి. కొన్ని కోర్కెలు తీర్చు కోవచ్చు. మరికొన్ని తీర్చుకోవడానికి వీలు కాదు. ఆ కోరికలు ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తే పరిష్కారం లభించకపోగా కుటుం బంలో లేనిపోని గొడవలు రావచ్చు. మన సులో అలజడి చెలరేగవచ్చు. మనసు చెదిరితే భార్యాభర్తలు, పిల్లలతో ఆనందాన్ని పంచు కోలేం. స్నేహితులతో మనస్ఫూర్తిగా మాట్లా డలేం. ఏ పనీ చేయబుద్ధి కాదు. ఆకలి వేయదు. నిద్ర పట్టదు. ఇన్ని బాధలు పడుతూ కోరికలను ఇంకా ఇంకా పెంచుకోవడం అనేది అవివేకం. అధికమైన, తీరని కోర్కెలు కలగకుండా మనసును అదుపులో ఉంచుకోవాలి. అందుకు దైవ ధ్యానమే సరైన మార్గం. జపం ఎంత ఎక్కువగా చేస్తే మనసులోని కోర్కెలు అంత త్వరగా తొలగి పోతాయి. మనసు ప్రశాంతంగా, బుద్ధి నిలకడగా ఉంటుంది. రక్త పోటు, మధుమేహం, గుండెజబ్బులు, తల నొప్పులు మొదలైన రోగాలు కూడా దరిచేరవు.
నేటి యాంత్రిక జీవితాలలో రాత్రి చాలా పొద్దు పోయే వరకు మెలకువగా ఉండటం, తెల్లవారాక ఎంత ఆలస్యంగా నిద్రలేస్తే అంత శ్రమపడ్డాం, అంత గొప్పవారం అనుకునే వారు చాలామంది ఉన్నారు. ఆలస్యంగా నిద్రలేస్తే ఎంత నష్టమో గమనించాలి. పిల్లలైనా, పెద్దలైనా ఎవరైనా సరే తెల్లవారుజామునే నిద్రలేవడం ఆరోగ్యదాయకం. తెల్లవారుజామునే నిద్రలేచి బయట తిరుగుతూ పనులు చేసుకోవడం వల్ల నక్షత్రాల కాంతి శరీరానికి మెరుపునిస్తుంది. ఆ సమయంలో వీచే చల్లని గాలి శ్వాసకోశా లను శుభ్రపరచడమే కాక రోజంతా ఆహ్లాదాన్ని ఇచ్చే మానసిక ఆనందాన్ని కలుగచేస్తుంది. ఉదయించే సూర్య కిరణాలు శరీరంపై పడటం వల్ల ఎటువంటి చర్మవ్యాధులు రావు. తెల్లవారుజామునే లేవలేం.. పని చేయలేం అంటుంటారు చాలామంది. కానీ మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదు. మనసు ఉంటే మార్గం ప్రతి దానికీ ఉంటుంది. వారం రోజులు క్రమం తప్పకుండా తెల్లవారుజామునే లేస్తే అదే అలవాటు అవుతుంది. చీకటితోనే లేస్తే దైవధ్యానం ప్రశాంతంగా చేసుకోవచ్చు. పనులు చేసుకుని, పిల్లలను చదివించవచ్చు. హడావుడి లేకుండా వారిని స్కూళ్లకు పంపించి ఆరాముగా ఆఫీసుకు వెళ్లవచ్చు. నేడు పల్లె ల్లోనూ, పట్టణాల్లోనూ ధ్యానం (మెడిటేషన్‍) నేర్పడానికి అనేక కేంద్రాలు ఉన్నాయి. ఇంట్లో దైవ ధ్యానం చేయడానికి కుదరని వారు రోజూ ఏదో ఒక సమయంలో మెడిటేషన్‍ సెంటర్లకు కానీ, గుడికి కానీ, ఖాళీ ప్రదేశాలకు కానీ వెళ్లి ధ్యానం చేయవచ్చు. తద్వారా ఆరోగ్యానికి, మనసుకు స్వాంతన చేకూరుతుంది. చేస్తున్న పనితో పాటుగా ఇతరత్రా ఏదైనా ఇష్టమైన వ్యాపకం, మరో పని ఏదీ లేకుండా ఇంట్లోనే లేదా ఆఫీసులోనే ఏదో ఒకటే పనితో సతమతం అయ్యేవారు ఈ పేరుతోనైనా బయటకు వస్తే బాహ్య ప్రపంచం గురించి తెలుస్తుంది. నలుగురితో పరిచయాలు పెరిగి అందరితోనూ ధైర్యంగా మాట్లాడగలుగుతారు. యువతరానికి కూడా ధ్యానం అనేది తప్పనిసరి. అందులో నేటి తరం వారికి అన్ని రంగాల్లోనూ పోటీ విపరీతంగా పెరిగి వారి మనసుపై ఒత్తిడి అధికమవుతోంది. కొందరు బలహీనులైన వారు ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. అటువంటి సున్నిత మనస్కులు మానసిక ఆందోళన చెందకుండా నిదానంగా ఆలోచించి పోటీని తట్టుకుని, సరైన మార్గంలో పయనించాలంటే వారికి మనో నిగ్రహం అనేది అవసరం. ధ్యానం, ఆధ్యాత్మిక సాధనలు, మంచి పుస్తకాల అధ్యయనం, పూజా కార్యక్రమాల ద్వారా ఆ నిగ్రహాన్ని సాధించవచ్చు. నిగ్రహం ఉన్న మనిషి ఏదైనా సాధించగలడు. అతను ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తాడు.

Review ధ్యానం… చేస్తే జన్మ ధన్యం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top