మోడీ తీసుకున్న నిర్ణయంతో నల్లకుబేరుల గుండెల్లో రైళ్ళు పరుగులు పెట్టాయి. సర్జికల్ దాడులతో పాక్ నోరు మూయించిన మోడీ.. తాజాగా కరెన్సీ రద్దు నిర్ణయంతో ప్రపంచాన్ని మొత్తం తనవైపునకు తిప్పుకున్నారు.
నవంబర్ 8… యావత్ భారతదేశాన్ని కుదిపేసిన రోజు..నల్లదొరలపై భారత ప్రధాని నరేంద్రమోడీ ఖడ్గమెత్తిన రోజు..బ్లాక్‍మనీ ఆటకట్టించేందుకు ఆరునెలలు పడ్డ కష్టానికి ఓ రూపు వచ్చిన రోజు..500, 1000 నోట్లను రద్దు చేయాలని ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో నల్లకుబేరుల గుండెల్లో రైళ్ళు పరుగులు పెట్టాయి. సర్జికల్ దాడులతో పాక్ నోరు మూయించిన మోడీ.. తాజాగా కరెన్సీ రద్దు నిర్ణయంతో ప్రపంచాన్ని మొత్తం తనవైపునకు తిప్పుకున్నారు.
సరళమైన పాలన కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని మొదటి నుంచీ హెచ్చరిస్తున్న భారత ప్రధాని తన పని తాను చేసుకుపోయారు. ఆరునెలల నుంచి కరెన్సీ రద్దు నిర్ణయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు.. మొత్తం కలిపితే ఓ ఐదుగురికి మాత్రమే కరెన్సీ రద్దు విషయంపై స్పష్టత ఉందంటే మోడీ ఈ ఆపరేషన్‍ను ఎలా అమలు చేశారో అర్థం చేసుకోవచ్చు. నవం•ర్ 8 మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో మోడీ సింగిల్‍గా ప్రెస్‍మీట్‍కు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ, దౌత్య అంశాలపై ప్రస్తావిస్తారనుకున్న మోడీ కరెన్సీ రద్దు చేస్తున్నామని ప్రకటించారు. అది కూడా అదే రోజు అర్థరాత్రి నుంచీ..దీంతో కట్టలు కట్టలుగా ఎన్నో ఏళ్ల నుంచి మూలుగుతున్న నల్లధనం ఒక్కసారిగా చిత్తుకాగితాలుగా మారాయి.. ఎన్నో ఏళ్లుగా అక్రమంగా సంపాదించిన అక్రమార్కుల పాపం పండింది.
దాదాపు గంటపాటు కరెన్సీ రద్దు నిర్ణయంపై మాట్లాడిన మోడీ అర్థరాత్రి నుంచే కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చేలా చేశారు. తర్వాత రోజు బ్యాంకులు, పోస్టాఫీస్‍లు, ఏటీఎంలను మూయించారు. అంటే బ్లాక్‍మనీని ఒక్కసారిగా బ్లాక్ చేసి నల్లకుబేరుల మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశారు. దీపావళి రోజు చెత్తాచెదారాన్ని ఊడ్చినట్లే నల్లధనాన్ని కూడా ఊడ్చేసి భారత్‍ను అవినీతిరహిత భారత్‍గా చేయాలని పిలుపునిచ్చారు. పేదల కష్టాలు, అవినీతి, ఉగ్రవాదానికి నల్లధనమే మూలకారణమని గుర్తించిన మోడీ ఈ ఆపరేషన్‍తో బ్లాక్‍బాబులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
మోడీ నిర్ణయంపై ప్రజలు, రాజకీయ నేతల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరైతే ఇది మూర్ఖత్వమని, మరికొందరైతే భారత్‍ను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు మోడీ సరైన నిర్ణయమే తీసుకున్నారని తమ అభిప్రాయాలు వెల్లిబుచ్చారు. నవంబర్ అర్థరాత్రి నుంచే 500, 1000 నోట్లు పనిచేయవని తెలియడంతో అందరిలోనూ గందరగోళం మొదలైంది. మరుసటి రోజు ఉదయం నుంచే భారత్‍లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. ఓ విధంగా చెప్పాలంటే జనజీవనం స్తంభించిపోయింది. పాలప్యాకెట్‍తో మొదలుపెడితే నిత్యావసరాలు, రవాణా, ప్రజావ్యవస్థలపై కరెన్సీ రద్దు ప్రభావం పడింది. 500, 1000 రూపాయల నోటు చూస్తేనే మరుసటి రోజు నుంచి జనాల గుండెల్లో రైలు పరిగెట్టాయి. ఓ వైపు బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీస్‍ల మూత కూడా కొంత కలవరానికి కారణమైంది. కానీ భారతీయులు ఏ మాత్రం అధైర్య పడవద్దంటూ కేంద్రం నుంచి మాత్రం భరోసా వచ్చింది.
నవంబర్ 10, గురువారం భారతదేశంలో అన్ని నగరాలు, పట్టణాలు, పల్లెల్లో ప్రజలు బ్యాంకులు, పోస్టాఫీస్‍లకు పరుగులు పెట్టారు.తమ వద్ద నున్న నోట్లను అర్జెంట్‍గా మార్చుకునేందుకు పోటీలు పడ్డారు. అయితే ఓ సమయంలో బ్యాంకులు, పోస్టాఫీస్‍ల వద్ద పరిస్థితి కూడా అదుపుతప్పింది. బ్యాంకుల్లో డబ్బులు వేసుకునేందుకు, తమ వద్ద నున్న పాత కరెన్సీని కొత్త కరెన్సీతో మార్చుకునేందుకు జనం గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్నారు. తమ వద్ద నున్న పాత కరెన్సీని మార్చుకునేందుకు కేంద్రం రూ.4 వేలుగా పరిమితి పెట్టింది. ఏటీఎంలలో అయితే గరిష్ఠంగా రోజుకు రూ.2 వేలు తీసుకునేలా ఏర్పాట్లు చేసింది. బ్యాంకుల్లో విత్‍డ్రా చేసుకునేందుకు రోజుకు రూ.10 వేలుగా నిర్ణయించింది. వారంలో గరిష్ఠంగా ఏ వ్యక్తైనా రూ.20 వేల వరకు తీసుకునేలా ప్రణాళికలు రచించింది. దీంతో బ్యాంకులన్నీ రద్దీతో కిక్కిరిసిపోయాయి.. మరో వైపు నల్లకుబేరులు మాత్రం తమ వద్ద నున్న కరెన్సీని మార్చుకోలేక, ఉంచుకోలేక ముప్పతిప్పలు పడ్డారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం టోల్‍గేట్లు, పెట్రోల్ బంకులు, ఎల్పీజీ గ్యాస్, మెడికల్ షాపులు, పాలకేంద్రాలు, ప్రభుత్వ బిల్లులు చెల్లించే కేంద్రాల్లో పాత నోట్లు తీసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఏది ఏమైనా మోడీ నిర్ణయంతో ప్రజలు కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అంటూనే బ్యాంకులు ముందు క్యూలు కట్టారు.
Review నల్లకుబేరులపై మోడీ ఖడ్గం.