పలుకు‘బడి’

రోగం వస్తే దాచుకోకూడదు!
మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం.

నీరు లేని పైరు
నూనె లేని జుట్టు
కొన్ని జాతీయాలు ఆరోగ్య సూత్రాలను కూడా నేర్పేవిగా ఉంటాయి. అటువంటి జాతీయాల్లో ఇది ఒకటి. పైరు చక్కగా ఏపుగా పెరిగి పంట పండాలంటే నీరు బాగా ఉండాలి. అలాగే మనిషికి అలంకారంగా ఉండే నెత్తి మీది జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే దానికి తరచూ నూనె రాస్తుండాలి. అలా అని పెద్దలు పిల్లలకు చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

నరం లేని నాలుక
నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుందన్నది జాతీయం. అంటే మాట నిలుపుకోలేకపోవడం, ఇప్పుడు చెప్పింది మరికాసేపటికి కాదనడం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు. నాలుక అనేది మాటకు ప్రతీకగా, నరం అనే దాన్ని పటుత్వానికి గుర్తుగానూ చెబుతారు. ఈ భావంతోనే మాట మీద పట్టులేకపోవడం, మాట నిలుపుకోలేకపోవడం అనే అర్థాలు పుట్టుకొచ్చాయి. ఎందుకంటే నాలుకకు నరం ఉండదు. ‘వాడిది నరం లేని నాలుక. వాడి మాటను నమ్మి మోసపోవద్దు’ అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

ధనమొస్తే దాచుకోవాలి
రోగం వస్తే చెప్పుకోవాలి
సమాజంలో మనిషి ఎప్పుడు, ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని తెలియచెప్పేందుకు ఈ జాతీయం ఉపకరిస్తుంది. ధనం ఉంది కదా అని ముందూ వెనుకా చూడకుండా ఖర్చుపెట్టేయకూడదు. అలాగే, రోగం వస్తే వైద్యుడికి చూపించుకోకుండా, చెప్పకుండా ఉండకూడదు. తగిన వైద్యుడికి చూపించుకుని, తగిన మందు తీసుకుని రోగాన్ని తగ్గించుకోవాలి అనే విషయ సూచనకు ఈ జాతీయం ఉపకరిస్తుంది.

దరిలేని బావి..దాపులేని కొంప
అవసరమైనవి దగ్గరలో లేని విషయంలో ఈ జాతీయం వాడతారు. మనిషి ప్రధాన అవసరాల్లో నీరు, గూడు ముఖ్యమైనవి. ఇవి ఎంత దగ్గరలో ఉంటే మనిషి అంత సౌకర్యవంతంగా ఉంటాడు. తాగడానికి నీరు, ఉండటానికి ఇల్లు ముఖ్యం కదా? బావి దగ్గరగా ఉంటే నీటి సౌకర్యం బాగుంటుంది. చేసే ఉద్యోగానికో, లేదా పనికో ఇల్లు అనువుగా, దగ్గరగా ఉంటే అదో సౌకర్యం. అలా కాకపోతే అన్నీ కష్టాలే. అలా ఏ పనిలోనైనా అసౌకర్యాలను అనుభవిస్తున్నపుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

Review పలుకు‘బడి’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top