మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
చలువ వెన్నెల
కష్టకాలము దాపురిస్తే
కన్ను కాచే రెప్ప రీతిగ
కాచు వాడే` బ్రోచువాడే
అచ్చమగు స్నేహితుడు, మిత్రుడు
కలిమి ఉంటే బంధుజనములు
లేమి కలుగగ ఎవరి కెవరో?
కాని మిత్రుడు ఎల్లవేళల
చేరదీసే చలువ వెన్నెల
సొంత లాభము కొరకు ప్రీతిగ
మాటలాడుచు దరికి చేరే
అదను దొరికిన కాలువేసే
ఖలుల మెరుగులు నమ్మ మోసమె!
చెలిమి నిచ్చిన చెలిమి కలుగును
హృదయమిచ్చిన హృదయమందును
బ్రతుకు రక్షణ కవచమే కద
ఇరుల మింటను వెలుగు బింబము
మేక వన్నెల మెకము రీతిగ
చెంత చెంతల తిరగి కితవులు
వెనుక వెనుకనే మ్రింగజూతురు
తెలివి ఒకటే బ్రోచు కవచము
బంధు వర్గము కన్న మిన్నగ
కలిమి లేములు సరకు సేయక
అంటి పెట్టుక తిరుగు నేస్తమే
కొంగు బంగరు, కోటి లాభము
చల్లచల్లని నీడనిచ్చే
వెచ్చ వెచ్చని వెలుగులిచ్చే
పరమ మిత్రోదయమే భాగ్యము
సర్వదా సహకార భూజము
జాబిల్లి
వచ్చాడమ్మా.. వచ్చాడమ్మా
వచ్చాడమ్మా జాబిల్లి
పడమటి కొండకు నిండంటమ్మా
పార్వతి ముక్కుకు
నత్తంటా
వచ్చాడమ్మా వచ్చాడమ్మా
వచ్చాడమ్మా నెలవంక
పడమటి కొండను
ఆడే నటేశు
జిలిబిలి తలలో
మల్లెల చెండై
వచ్చాడమ్మా వచ్చాడమ్మా
వచ్చాడమ్మా నెలవంకా
తోటొపెట్టీ
పండుగ కోసం
వచ్చారంటా పేరంటం
చుక్కల రాణుల పేరంటం
వచ్చాడమ్మా వచ్చాడమ్మా
వచ్చాడమ్మా జాబిల్లి
పాటలు పాడే
ఆటలు ఆడే
సోగసులు చూపే పేరంటం
చుక్కల రాణుల పేరంటం
టం.. టం.. టం.. టం..
చుక్కల రాణుల పేరంటం
వచ్చాడమ్మా వచ్చాడమ్మా
వచ్చాడమ్మా జాబిలి
నందికేశునీ కొమ్ములవాడీ
ఈశునిముమ్మెన వాలుల వేడీ
గంగాభవానీ చల్లని తరగల
తేలియాడు శుభరాజ హంసగా
వచ్చాడమ్మా వచ్చాడమ్మా
వచ్చాడమ్మా జాబిల్లి
Review పిల్లల ఆటపాటలు.