పుణ్యకార్యం

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘రాజా! నువ్వు ఉదారవంతుడివే కాక పుణ్యకార్యాల పట్ల ఆసక్తి గలవాడిలా కూడా కనిపిస్తున్నావు. పుణ్యకార్యాలనేవి చేసిన వాళ్లకే కాక, సమాజానికి కూడా మేలు చేస్తాయి. కానీ ఏ పుణ్యకార్యాలూ చేయని వాళ్లు కూడా ఒక్కోసారి దేవుడి దయకు పాత్రులు కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక ధన లోభి, రాటుతేలిన దొంగ కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను’ అంటూ ఇలా చెప్పసాగాడు.
పాటలీపుత్ర నగరంలోని లోభచంద్రుడనే ధనికుడికి ఏదో తెలియని జబ్బు చేసింది. వైద్యులెవరూ ఆయన జబ్బును నయం చేయలేకపోయారు.
ఒకరోజున ఆయన ఇంటికి ఒక సాధువు వచ్చి, లోభచంద్రుడిని చూసి, ‘నువ్వు ధన వ్యామోహంతో పుణ్యకార్యాలు చేయలేదు సరికదా, ఎన్నో పాపకార్యాలు చేశావు. ఆ పాపాలే నిన్నిప్పుడు వ్యాధి రూపంలో పట్టి పీడిస్తున్నాయి. పుణ్యం తప్ప ఏ మందూ నీ వ్యాధిని కుదర్చలేవు. ఇక మీదటనైనా పుణ్యకార్యాలు చెయ్యి’ అని చెప్పాడు.
‘పుణ్యకార్యాలంటే ఏమిటో, తమరే సెలవివ్వండి స్వామీ’ అని అడిగాడు లోభచంద్రుడు.
‘మనస్ఫూర్తిగా నువ్వు చేయగల ఏ మంచిపనైనా పుణ్యకార్యమే అవుతుంది’ అని చెప్పి సాధువు వెళ్లిపోయాడు.
అప్పుడు లోభచంద్రుడి కుటుంబసభ్యులందరూ ఆయన దగ్గరకు చేరారు. ఆయనకు ఇద్దరు కొడుకులూ, ఇద్దరు కూతుళ్లూ ఉన్నారు.
‘అన్నదానం చేద్దాం’ అన్నది లోభచంద్రుడి భార్య చంద్రావతి.
‘అన్నదానం అంటే అవతలి మనిషికి తృప్తిగా భోజనం పెట్టాలి. మనింట్లో మనమే తృప్తిగా భోజనం చేయడం లేదు. అలాంటప్పుడు మనస్ఫూర్తిగా ఇతరులకు భోజనం పెట్టలేం కదా! ఇంకేదైనా పుణ్యకార్యం గురించి ఆలోచించండి’ అన్నాడు లోభచంద్రుడు.
అందరూ తలా ఒక సూచనా ఇవ్వసాగారు.

ఒకరు వస్త్రదానం అన్నారు.
ఇంకొకరు విద్యాదానం చాలా ఉత్తమమైనదని అన్నారు.
మరొకరు కన్యాదాతలకు సాయం చేయాలన్నారు.
వేరొకరు డబ్బునే దానం చేయాలని సూచించారు.

ఆఖరుకు లోభచంద్రుడి భార్య చంద్రావతి- ‘పోనీ తీర్థయాత్రలు చేసి రావడం బాగుంటుందేమో! అందరు దేవుళ్లను చూడటానికి మించిన పుణ్యకార్యం వేరే ఎక్కడుంటుంది?’ అన్నది.
ఇది వింటూనే లోభచంద్రుడు, ‘దేవుడిని చూడటానికి తీర్థయాత్రలు చేయనవసరం లేదు. ఎన్ని రూపాలున్నా దేవుడు ఒక్కడే అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మీరందరూ ప్రతి రోజూ మన ఊరి ఆలయంలోని రాముడిని నా జబ్బు కుదర్చవలసిందిగా ప్రార్థించండి. ఆ పుణ్యం చాలు మనకు’ అన్నాడు.
దేనికీ డబ్బు ఖర్చు కావడం ఇష్టం లేక లోభచంద్రుడు ఇలాంటి సలహా ఇచ్చాడని అక్కడున్న వారందరికీ అర్థమైంది. అతడి మాట కాదనలేక అందరూ సరేనన్నారు. అయితే, లోభచంద్రుడి అనారోగ్యంలో మాత్రం ఏ మార్పూ రావడం లేదు.
‘ఆ సాధువు చెప్పింది అబద్ధం. వ్యాపారపు గొడవల్లో పడి నేనేనాడూ దేవుడిని తలచలేదు. అదే నేను చేసిన పాపం. ఇప్పుడు రోజూ నేను దేవుడిని తలచుకుంటున్నాను. మీరంతా ప్రార్థనలు చేస్తున్నారు. ఇంతకంటే పుణ్యకార్యం ఏం ఉంటుంది? నా జబ్బుకు కారణం నా పాపాలు కాదు. నా దురదృష్టం’ అని లోభచంద్రుడు రోజూ తన వాళ్లకు చెబుతుండే వాడు.
లోభచంద్రుడి ఇంట్లో తరగని సంపద ఉన్నదనే విషయం తెలిసిన ఓ దొంగ ఒకడున్నాడు. లోభచంద్రుడి ఆరోగ్యం బాగున్నప్పుడు ఆ ఇంట్లోకి చొరబడే అవకాశం లేదు. ఇప్పుడు కొంచెం తెలివి ఉపయోగిస్తే, తేలికగా దొంగతనం చేయవచ్చని ఆ దొంగ ఆలోచించి ఒక పథకం వేశాడు.
ఆ ప్రకారం వాడు రెండు రాత్రులు వరుసగా లోభచంద్రుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ వాడే వస్తువులు దొంగిలించకుండా, తాను వచ్చిపోయిన జాడలు మాత్రం ఇంట్లో వాళ్లు గుర్తించేలా చేశాడు.
తమ ఇంటికి ఎవడో దొంగ వచ్చి వెళుతున్నాడని లోభచంద్రుడి భార్య చంద్రావతి గ్రహించింది. ఆ సంగతి పిల్లలకు చెప్పి ‘ఈ విషయం మీ నాన్నకు తెలియనివ్వకండి. ఇప్పుడున్న అనారోగ్య స్థితిలో ఈ విషయం ఆయనకు తెలియడం మంచిది కాదు’ అని హెచ్చరించింది.
అయితే, మూడో రోజున ఆ దొంగ సాధువు వేషంలో లోభచంద్రుడి ఇంటికి వెళ్లాడు.

అతడితో, ‘నువ్వూ, నీ కుటుంబం గొప్ప ప్రమాదంలో ఉన్నారు. అందుకోసమే నిన్ను హెచ్చరించి పోదామని వచ్చాను’ అన్నాడు.

‘ఏం జరిగింది స్వామీ!’ అని గాభరాపడుతూ అడిగాడు లోభచంద్రుడు.

‘లక్ష్మి చంచల స్వభావం గలది. చాలా కాలంగా నీ ఇంట్లో ఉంటూ వచ్చింది. ఇప్పుడామె స్థలం మార్పు కోరుతున్నది. అందుకు రెండు ప్రయత్నాలు చేసి మనసొప్పక ఆగిపోయింది. గత రెండు దినాల్లోనూ నీ ఇంట దొంగతనానికి ప్రయత్నాలు జరిగాయి. నీకు తెలుసా?’ అని అడిగాడు దొంగ సాధువు.
లోభచంద్రుడు ఈ విషయమై తన ఇంట్లోని వారిని ఆరా తీశాడు. వాళ్లు సాధువు చెప్పింది నిజమేనని అన్నారు.

లోభచంద్రుడు భయపడిపోయి, దొంగ సాధువుతో- ‘స్వామీ! లక్ష్మిని మా ఇంట శాశ్వతంగా నిలిపే మార్గం లేదా?’ అని అడిగాడు.

‘లేకేం. ఉన్నది. పంచభక్ష్య పరమాన్నాలతో నాకు విందు భోజనం పెట్టాలి. ఆ తరువాత నేను లక్ష్మీదేనివి ఉపాసిస్తాను. అది ముగిసిన తరువాత నేను ఇచ్చే తీర్థం మీరంతా పుచ్చుకోవాలి. అప్పుడు లక్ష్మి శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉండిపోతుంది’ అన్నాడు దొంగ సాధువు.
లోభచంద్రుడు అందుకు ఒప్పుకున్నాడు. ఆ రాత్రి చంద్రావతి చక్కని విందు భోజనం తయారు చేసి దొంగకు పెట్టింది. తరువాత వాడు కొంతసేపు లక్ష్మీపూజ చేసి, ఇంట్లో వాళ్లందరికీ తీర్థం ఇచ్చాడు. అందులో వాడు మత్తు మందు కలపడంతో వాళ్లందరూ క్షణాల మీద స్ప•హ తప్పి పడిపోయారు.
దొంగ అప్పుడు లోభచంద్రుడి తలదిండు కింద ఉన్న ఇనప పెట్టె తాళపు చెవులు తీసుకుని దాన్ని తెరిచాడు. అందులో ఉన్న నగలూ, ఇతర సామగ్రిని చూసి వాడి కళ్లు చెదిరాయి. తానిచ్చిన మత్తుమందు సరిగా పనిచేయక ఎవరైనా మెలకువగా ఉన్నారేమో అని వాడు అందరికేసీ పరీక్షగా చూశాడు.
ఆ సమయంలో వాడు చంద్రావతి ముఖం చూస్తూనే గతుక్కుమన్నాడు. ఆమె తనను కన్నతల్లిలా ఆదరించి భోజనం పెట్టడం వాడికి గుర్తుకువచ్చింది.

‘కడుపు నిండుగా అన్నం పెట్టిన ఈ అమ్మ ఇంట్లో నేను దొంగతనం చేయలేను’ అనుకున్నాడు దొంగ.

వాడు ఇనప్పెట్టె తలుపులు మూసి తాళం వేసి తాళపు చెవులను లోభచంద్రుడి తలదిండు కింద పెట్టాడు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకున్నాడు కానీ, ఇంటిల్లిపాదీ స్ప•హలో లేరని గుర్తొచ్చి అక్కడే ఆగిపోయాడు. ఆ సమయంలో మరో దొంగ ఎవరైనా ఇంట ప్రవేశించి దోచుకుపోవచ్చనే ఆలోచనతో వాడు రాత్రంతా నిద్రపోకుండా ఇంటికి కాపలా కాశాడు.
తెల్లారగానే చంద్రావతి మొదట మేల్కొంది. దొంగ సాధువును చూసి నమస్కరించబోయింది. అప్పుడు దొంగ తన కథంతా చెప్పి, ‘నాలో మార్పు వచ్చింది. ఎక్కడైనా పని దొరికితే దొంగతనాలు మానేస్తాను’ అన్నాడు.
చంద్రావతి వాడి నిజాయితీకి ఆశ్చర్యపడి, ‘ఈ సంగతి నా భర్తకు చెప్పకు. ఆయన నిన్ను క్షమించడు. ఏమైనా నువ్వు చేసిన లక్ష్మీపూజ నీ నుంచే ఈ ఇంటిని కాపాడింది కదా! అందువల్ల నువ్వు నిజమైన సాధువు కాదన్న విషయం నా భర్తకు తెలియనవసరం లేదు’ అంది.
కొంతసేపటికి లోభచంద్రుడికి మెలకువ వచ్చింది. లేచి మునుపటిలాగే తిరగసాగాడు.

‘నేనిప్పుడు మామూలుగానే లేచి తిరగగలుగుతున్నాను. లక్ష్మీపూజ వల్ల నా జబ్బు కూడా నయమైంది’ అన్నాడు ఉత్సాహంగా.

ఆ మాటలు వింటూనే దొంగ అసలు సంగతిని చెప్పేశాడు.

బేతాళుడు ఈ కథ చెప్పి, ‘రాజా! లోభచంద్రుడు వ్యాధిపీడితుడై ఉండగా చూడవచ్చిన సాధువు మనస్ఫూర్తిగా మంచి పనిచేసి పుణ్యం సంపాదించుకో, అప్పుడు వ్యాధి నయమవుతుందని చెప్పాడు. అది వినక దొంగ సాధువు చెప్పినట్టుగా లక్ష్మి తనింట్లోనే ఉండిపోవాలనే స్వార్థంతో పూజ చేయించాడు. కానీ అది పుణ్యకార్యం అనిపించుకోదు. అయినప్పటికీ అతడి వ్యాధి నయమైంది. ఇందుకు కారణమేంటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది’ అన్నాడు.
దానికి విక్రమార్కుడు- ‘అమృతాన్ని తెలిసి సేవించినా, తెలియక సేవించినా అమరత్వం సిద్ధిస్తుంది. అలాగే పరహితం కోరి చేసే పని స్వార్థంతో కూడినదైనా తప్పక పుణ్యకార్యం అవుతుంది. లోభచంద్రుడు మనస్ఫూర్తిగా దొంగకు పంచభక్ష్య పరమాన్నాలతో పెట్టిన భోజనం, అతడికి పుణ్యం సంపాదించి వ్యాధి నివారణ చేయడమే కాక దొంగను కూడా సన్మార్గంలో పెట్టింది. అందువల్ల లోభచంద్రుడు పుణ్యకార్యం చేయలేదని అనడం సరికాదు’ అని బదులిచ్చాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.

Review పుణ్యకార్యం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top