మన పురాణాలు, ఇతిహాసాలలో ఎన్నెన్నో పాత్రలు ఉన్నాయి. అన్నిటికీ ఒక్కో లక్షణం.. ఒక్కో స్వభావం.. ఒక్కో వ్యక్తిత్వం.. కొన్ని పాత్రల పేర్లను బట్టే ఆ పాత్ర వ్యక్తిత్వం ప్రస్ఫుటమవుతుంది. మరికొన్ని పాత్రల పేర్ల వెనుక ఎంతో విశిష్టమైన, విశేషమైన అర్థం ఉంటుంది. మన పురాణాల్లో పేరొందిన ఆయా పాత్రలు.. వాటి లక్షణాలు, ఆయా పాత్రల స్వభావ స్వరూపాల గురించి తెలుసుకుందాం.
అనసూయ: అసూయ లేనిది.
అర్జునుడు: స్వచ్ఛమైన ఛాయ గలవాడు.
అశ్వత్థామ: గుర్రము వలే సామర్థ్యం, బలము గలవాడు. ఇతను పుట్టగానే అశ్వం (గుర్రం) వలే పెద్ద ధ్వని పుట్టిందట. ఈ కారణంగానే ఈయన అశ్వత్థామ అయ్యాడు.
ఆంజనేయుడు: ‘అంజన’ అనే మహిళకు పుట్టిన వాడు కాబట్టి ఆంజనేయుడు అయ్యాడు. అంజనీసుతుడు అని కూడా అంటారు.
ఇంద్రజిత్తు: ఇంద్రుడిని జయించిన వాడు (జితమనగా విజయం). ఇతడు రావణాసురుడి కుమారుడు.
ఊర్వశి: నారాయణుడి ఊరువు (తొడ) నుంచి ఉద్భవించినది.
కర్ణుడు: పుట్టుకతోనే కర్ణ, కవచ కుండలాలు గలవాడు.
కుంభకర్ణుడు: ఏనుగు యొక్క ‘కుంభస్థల’ ప్రమాణము గల కర్ణములు (చెవులు) గలవాడు.
కుబేరుడు: నికృష్టమైన శరీరము గలవాడు (బేరమనగా శరీరం)
కుచేలుడు: చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు (చేలము అనగా వస్త్రం).
గంగ: గమన శీలము కలది. భగీరథుడికి పుత్రికగా ప్రసిద్ధి పొందినది కాబట్టి బాగీరథి అనీ, జహ్నుమునికి పుత్రికగా ప్రసిద్ధి చెందినది కాబట్టి జాహ్నవి అనీ గంగను పిలుస్తారు. గరుత్మంతుడు: విశిష్టమైన రెక్కలు గలవాడు.
ఘటోత్కచుడు: కుండవలే గుబురైన జుట్టు గలవాడు. ఘటము అంటే కుండ అని అర్థం.
జరాసంధుడు: ‘జర’ అనే రాక్షసి చేత శరీర భాగాలు సంధించబడిన (అతికించబడిన) వాడు.
తుంబురుడు: తుంబుర (వాద్య విశేషం) కలవాడు.
దశరథుడు: దశ (పది) దిశలలో రథ గమనము గలవాడు.
దృతరాష్ట్రుడు: రాష్ట్రమునంతటినీ అదుపులో ఉంచుకొనువాడు.
త్రిశంకుడు: 1. తండ్రిని ఎదిరించుట, 2. పరభార్యను అపహరించుట, 3. గోమాంసము తినుట.. ఈ మూడు శంకువులు (పాపాలు) చేసిన వాడు.
దమయంతి: ‘దమనుడు’ అనే ముని వరంతో జన్మించినది.
2. తన అందంతో ఇతరులను రమించునది (అణచునది).
దుర్వాసుడు: దుష్టమైన వస్త్రము గలవాడు (వాసము అనగా వస్త్రము అని అర్థం).
దుర్యోధనుడు: (దుర్ + యోధుడు) ఇతరులు సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడని వాడు.
దుశ్శాసనుడు: సుఖముగా శాసింప (అదుపు చేయ) సాధ్యము కానివాడు.
ద్రోణుడు: ద్రోణము (కుండ) నుంచి పుట్టిన వాడు.
ధర్మరాజు: సత్యము, అహింస మొదలైన ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త పాండురాజు అనుమతి పొంది ధర్ముని (యమ ధర్మరాజు) వలన కన్న సంతానము కావడం వల్ల ధర్మజుడని, యుద్ధము నందు స్థిరమైన పరాక్రమము ప్రదర్శించు వాడు కనుక యుధిష్టిరుడనే పేర్లు కూడా ఉన్నాయి
నారదుడు: 1. జ్ఞానమును ఇచ్చువాడు (నారమనగా జ్ఞానము). 2. కలహప్రియుడు కావడం వల్ల నరసంధమును భేదించువాడు.
•ప్రద్యుమ్నుడు: ప్రకృష్ట (అధికమైన)మైన బలము గలవాడు (ద్యుమ్నము అంటే బలము అని అర్థం).
ప్రభావతి: ప్రభ (వెలుగు) గలది.
•ప్రహ్లాదుడు: భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదమును పొందువాడు.
బలరాముడు: బలముచే జనులను రమింప చేయువాడు.
బృహస్పతి: బృహత్తులకు (వేద మంత్రాలకు) ప్రభువు కాబట్టి బృహస్పతి అయ్యాడు. ఈయన దేవతలకు గురువు.
భరతుడు: అశేషమైన భూమిని భరించిన (పోషించిన) వాడు.
భీముడు: భయమును కలిగించు వాడు.
భీష్ముడు: తండ్రి సుఖము కోసం తను రాజ్య సుఖములను వదులుకోవడమే కాక వివాహం చేసుకోబోనని ప్రతినబూనిన వాడు. ఈ ప్రతిజ్ఞను నిలుపుకోవడం వల్లనే ‘భీష్మ ప్రతిజ్ఞ’ లేదా ‘భీషణ ప్రతిజ్ఞ’ అనే ఉపమానాలు పుట్టాయి. భీష్మమైన అంటే భయంకరమైన అని అర్థం.
•మండోదరి: పలుచని ఉదరం (నడుము) కలది. మండ అంటే పలుచని అని అర్థం.
మన్మథుడు: మనసును కలత పెట్టేవాడు.
మహిషాసురుడు: 1. రంభుడు మహిషం (గేదె)తో రమించగా పుట్టిన వాడు. 2. ‘మహిష్మతి’ అనే ఆమె శాపం వలన మహిషమై (గేదె).. సింధు ద్వీపుడనే రాజు రేతస్సును మింగి గర్భాన్ని ధరించి ఇతనికి జన్మనిస్తుంది.
యముడు: యమము (లయ)ను పొందించువాడు.
యశోద: యశస్సును (కీర్తి) కలిగించునది.
రాముడు: రమంతే యోగిన: అస్మెన్ = రామ (రమ్ అంటే క్రీడించుట). యోగులంతా ఈ పరమాత్ముని యందు విహరించెదరు లేదా ఆనందించెదరు.
రావణాసురుడు: కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు బొటన వేలితో నొక్కినపుడు గొప్ప రవము (ధ్వని) చేసిన వాడు. కాబట్టి ఈయనకు రావణుడనే పేరు వచ్చింది.
రుక్మిణి: రుక్మము (బంగారము) గలది.
వాల్మీకి: ఆయన నిరాహారుడై తపస్సు చేయగా, ఆయన శరీరంపై వల్మీకములు (పుట్టలు) మొలుచుట వలన వాల్మీకి అయ్యాడు.
వ్యాసుడు: వేదాలను వ్యాసం (విభజించి వ్యాప్తి చేయడం) చేసిన వాడు.
విభీషణుడు: దుష్టులకు విశేష భీతిని కలిగించే వాడు.
విదురుడు: బుద్ధిమంతుడు. తెలివి గలవాడు.
శంతనుడు: శం= సుఖము, శుభము. తను= విస్తరింపచేయుట. సుఖమును, శుభమును విస్తరింప చేయువాడని అర్థము.
శల్యుడు: ములుకులతో (బాణములతో) బాధించువాడు. శల్యమనగా బాణమని అర్థం.
శకుంతల: శకుంతలముచే (పక్షులచే) రక్షింపబడినది.
శూర్పణఖ: చేటల వంటి గోరులు కలది (శూర్పమనగా చేట, నఖమనగా గోరు).
సగరుడు: విషముతో పుట్టిన వాడు (గర/గరళ శబ్దాలకు విషమని అర్థం. గర్భంలో ఉండగా విష ప్రయోగానికి గురై ఆ విషంతోనే పుట్టిన వాడు కాబట్టి సగరుడు అయ్యాడు.
సత్యభామ: నిజమైన కోపం గలది. భామ అంటే క్రోధమని అర్థం.
సీత: నాగటి చాలులో శిశువుగా లభించింది కాబట్టి సీత అయ్యింది. నాగటి చాలుకు సీత అని పేరు.
Review పేరులో ‘నేముంది!.