నీవు ప్రకృతికి నిలువుటద్దానివి… పరికించు, శోధించు నీవే ప్రకృతి.
ద్వందాల ఇటుకలతో పేర్చిన ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా, ఏ కార్యమైనా సుఖాన్ని, దుఃఖాన్ని కలి గిస్తుంది కదా అని ఆ వస్తువు నుండి, ఆ పని నుండి దూరంగా పరుగెత్తరాదు. దుఃఖానికి దూరమవుతూ, సుఖానికి దగ్గరయ్యేలా పని చేసే నైపుణ్యాన్ని సంపాదించాలి. ప్రకృతిలో ఉండే ప్రతి లక్షణానికీ దేని అవసరం, కారణం దానికుంటుంది.
ఉదాహరణకు మన మనస్సుకు బాహ్య విషయాల పైకి పరుగులు తీసే లక్షణముంది. ఈ స్వభావం మనకు ప్రకృతి ప్రసాదించిందంటే ఆ స్వభావపు అవసరం మనకుండి తీరాలి. లేకపోతే ఆ లక్షణాన్ని ప్రకృతి మనకు ఇచ్చి ఉండేది కాదు. ద్వంద్వాలతో నిండి ఉండే ఈ ప్రపంచం నుండి మన మనస్సు ఆనందంతోబాటు అంతులేని దుఃఖాన్ని కూడా మోసుకొస్తుంది. ఈ కారణం వల్ల మనస్సును కట్టి పడేసి, అది కలిగించే ఆనందాన్ని కూడా కోల్పోరాదు.
మనస్సుకు బాహ్య ప్రపంచంలో విహరించి కేవలం ఆనందాన్ని మాత్రమే ఆస్వాదించగల నైపు ణ్యాన్ని అందజేయాలి. అప్రయత్నంగా దృష్టి బాహ్యప్రపంచం వైపు లాగబడుతున్నదంటే దైవం బయట కూడా సమానంగా ఉన్నడని ఋజు వవుతున్నది. మనోవిహంగాన్ని వివిధవిధాలుగా విహరించనీ, విధాత ఉనికిని విస్త•తంగా కనుగొననీ. ఈ విశాలసృష్టిని నిలువుటద్దంగా చేసుకొని నీ ప్రతిరూపాన్ని చూసుకో. ఇది చాలా సులభమైనది. నీ మనసును లోకమంతా తిరగనీ. దానికి కుశాగ్రదృష్టిని జత చెయ్యి. మస్తిష్కానికి మరింత శక్తినివ్వు. అంతే, విశ్వదర్పణంలో వినూత్నంగా నీ దర్శనం నీకే లభిస్తుంది.
మన మనసనే అల్లరి పిల్లవాణ్ణి కాళ్ళు చేతులు కట్టి కూర్చోపెట్టరాదు. స్వేచ్ఛగా పరుగులు తీస్తే ఆపకూడదు. రోటికి బంధించరాదు. పిల్లవాడు చేసే పనిని మాన్పించకుండా, వాడు చేసే ఏ పనీ దుఃఖం కలగజేయకుండా, కేవలం సంతోషం కలిగేలా జాగ్రత్త పడాలి. మన దగ్గరుండే కుక్కకు కరిచే లక్షణముందని దాన్ని చంపివేశామనుకోండి, మన ఇంటికి కాపలా కాసేదెవరు? మనం చేయవలసిందల్లా కుక్కను మచ్చిక చేసుకుని, మనల్ని కరవనట్లు జాగ్రత్త తీసుకుని, దాని కరిచే లక్షణాన్ని మన ఇంటిని కాపలా కాయటానికి వాడుకోవాలి. ద్వంద్వాల మధ్య జ్ఞానవారధిని నిర్మించాలి. రెంటినీ మన జీవితమనే వంతెనకు మూలస్తంభాలుగా వాడుకోవాలి.
ద్వంద్వత్వం సృష్టికి పునాది. ప్రతి కార్యానికీ ఆధారం ద్వంద్వత్వమే. మంచి-చెడు, నాయకుడు-ప్రతినాయకుడు, పగలు-రాత్రి, ఆరోగ్యం-అనారోగ్యం, పేదరికం -ఐశ్వర్యం ఇలా ఎన్నెన్నో. ఇది తప్పించలేని ప్రకృతి సహజ స్వభావం.
ఆనందమనే చిత్రానికి అద్దిన రంగు, విషాదం. అప్పుడప్పుడు దుఃఖ స్పర్శ కలిగితేనే సుఖం మరింత ఎక్కువగా రుచిస్తుంది. విత్తనాన్ని చేతిలో పెట్టుకొని కూర్చుంటే ఎన్నిరోజులైనా మొలకెత్తుతుందా? గోదాములో దాచి భద్రంగా ఉంచితే మొక్కవుతుందా? నేల లోపలి చీకటిలో పాతి పెట్టినప్పుడే కదా మొక్కగా రూపుదిద్దుకునేది! చీకటిలో పుట్టి, వెలుగులో పెరుగుతుంది. అంటే, పుట్టటానికి చీకటి, పెరగటానికి వెలుగు…. రెండూ అవసరమే. వేసవి నాకు వద్దు, వర్షాకాలమే కావాలంటే కుదురుతుందా? వేసవితో మాత్రమే వర్షఋతువు సాధ్యపడుతుంది. కన్నీటిచుక్కతో మాత్రమే చిరునవ్వు సాధ్యపడుతుంది.
మీ అబ్బాయిని తాళం కొని తెమ్మని చెప్పా రనుకోండి. అతడు తాళం చెవి విడిచిపెట్టి తాళం మాత్రమే తెచ్చాడనుకోండి. ఏమైనా ప్రయోజనం ఉంటుందా ? సుఖం దుఃఖం విడదీస్తే కూడా అలానే ఉంటుంది. చిరునవ్వు అనే తాళం తెరిచే తాళపుచెవి కన్నీరు. ఒకటిలేక మరొకటి అసంపూర్ణం. పుట్టుకకు పునాది మరణం, సూర్యోదయానికి మూలం సూర్యాస్తమయం. వీటన్నిటికీ అంతస్సంబంధం ఉంది. ఈ రహస్యం తెలియక, పేదరికమెందుకు? రోగాలెందుకు? బాధలెందుకు? అని ప్రశ్నిస్తుంటాం. అవయవా లకు తోబుట్టువులుగా వ్యాధులు కూడా పుట్టాయి. చేతికి గాయం అవుతుంది. కళ్ళకు కలక వస్తుంది. పన్ను పోటు పెడుతుంది. చెవి నుండి చీము కారుతుంది. ముక్కుకు జలుబు చేస్తుంది. జబ్బు పడని ఒక్క అవయవం చూపించండి.! కడుపుకి అజీర్ణం, నడుముకి నొప్పి, చర్మానికి దురదలు, దద్దుర్లు…. ఎన్నని చెప్పాలి? ప్రాణం లేని వస్తువులకు కూడా మినహాయింపు లేదు. ఇనుము, రాగి వంటివి తుప్పు పడతాయి. ఆరోగ్యం ఉన్నంత కాలం అనారోగ్యమూ ఉంటుంది. ఇది మూలసూత్రం ఫొటోను వెలుగులో తీస్తారు. కానీ చీకటిగదిలో డెవలప్ చేస్తారు. ప్రశ్నకు, జవాబుకు మధ్యన గురువు ఉంటాడు. వ్యాధికీ, ఆరోగ్యానికీ నడుమ వైద్యుడుంటాడు. కన్నీటికీ, చిరునవుకి మధ్యన దేవుడు లభ్యమౌతాడు. జీవనక్రమంలో పరస్పర వైరుధ్యాల మధ్యన సేతువును నిర్మించడమే ఆధ్యాత్మికత.
Review ప్రకృతి ఒడి బడిలో….