ఫాల్గుణ మాసం విశిష్టతలేమిటి?

మార్చి 1, ఆదివారం, ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుంచి మార్చి 18, బుధవారం, ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు మార్చి నెలలో ఫాల్గుణ మాస తిథులు కొనసాగుతున్నాయి. తదుపరి మార్చి 19, చైత్ర శుద్ధ పాడ్యమితో చైత్ర మాసం ఆరంభమవుతుంది. ఆనాడే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం. ఇక మార్చి నెలలో 1 నుంచి 18వ తేదీ వరకు కొనసాగే ఫాల్గుణ మాసంలో ఆచరించాల్సిన ఆధ్యాత్మిక విధులేమిటో తెలుసుకుందాం.
ఫాల్గుణం విష్ణు భగవానుడికి ప్రీతికరమైనదని భాగవతం చెబుతోంది. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి 12 రోజుల పాటు పయో వ్రతం ఆచరించి విష్ణువుకు క్షీరాన్నం (పరమాన్నం) నివేదిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది. పురాణాల్లో దితి, అదితిలలో అదితి ఫాల్గుణ మాసంలో ఈ పయో వ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందినట్టు పురాణాలు చెబుతున్నాయి.
మహావిష్ణువుకు ఇష్టమైన ఈ మాసంలో గోదానం, వస్త్రదానం, అన్నదానం వంటివి చేయడం మంచిది. దీనివల్ల గోవిందుడికి ప్రీతి కలుగుతుందని శాస్త్ర వచనం.
ఫాల్గుణ బహుళ పాడ్యమి రోజున రావణుడితో యుద్ధం కోసం శ్రీరాముడు లంకకు బయల్దేరాడని రామాయణం చెబుతోంది.

ఫాల్గుణ బహుళ ఏకాదశి నాడు రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు, లక్ష్మణుడి మధ్య సమరం ప్రారంభమైందట.

హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి, పాల కడలి నుంచి లక్ష్మీదేవి ఈ మాసంలోనే జన్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.

అర్జునుడి జన్మ నక్షత్రంలో ఫల్గుణి అనే పేరు ఉండటం ఫాల్గుణ మాసం విశేషాన్ని వెల్లడిస్తోంది.

మహా భారతంలో ఫాల్గుణ బహుళ అష్టమి నాడు ధర్మరాజు, శుద్ధ త్రయోదశి రోజు భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు జన్మించారని పురాణాల్లో ఉంది.

ఈ మాసంలో గోవింద వ్రతాలు విరివిగా చేయాలి. విష్ణు పూజకు ప్రాధాన్యం ఇవ్వాలి.

ఫాల్గుణ మాసంలో శుద్ధ తదియ, చవితి నాడు దుండి గణపతిని పూజిస్తారు. కాశీ ద్రాక్షారంలో వెలసిన దుండి గణపతికి సంబంధించిన పూజ ఇది.

ఫాల్గుణ శుద్ధ ద్వాదశి నాడు పయో వ్రతాన్ని ఆచరించి వామనుడిని పూజిస్తారు.

ఫాల్గుణంలో వచ్చిన ఉత్తర నక్షత్రం రోజున ఫాల్గొణోత్తరిగా భావించి లక్ష్మీదేవిని పూజిస్తారు.

ఫాల్గుణ ఏకాదశి రోజు ఉసిరిచెట్టును పూజించడం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తారు. దీనివల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం. ఈ ఏకాదశిని అమృత ఏకాదశిగా పరిగణిస్తారు.

ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైనది ఫాల్గుణ పూర్ణిమ. దీన్ని హోలీ పూర్ణిమ, మదన పూర్ణిమ, వసంతోత్సవంగా వ్యవహరిస్తారు. హోలీ రోజున శివుడితో పాటు మన్మధుడు, కృష్ణుడు, లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు.
ఇంకా ఈ మాసంలో హోళీ పూజ, దుండి వినాయక పూజ, వామన, లక్ష్మీనరసింహస్వామి పూజ, లక్ష్మీపూజ చేయడం వల్ల శుభ ఫలితాలు కలగుతాయి.

Review ఫాల్గుణ మాసం విశిష్టతలేమిటి?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top