భక్తేశ్వర వ్రత కథేమిటి?

కార్తీక మాసంలో భక్తేశ్వర వ్రతం ఆచరించాలని చెబుతారు. ప్రత్యేకించి కార్తీక• పూర్ణిమ నాడు ఆచరించాల్సిన ఈ వ్రత విధులేమిటి?.
కార్తీక పూర్ణిమ నాడు ఈశ్వరుడిని ఉద్దేశిస్తూ చేసే ఓ వ్రతం కూడా ఉంది. దీనినే భక్తేశ్వర వ్రతం అంటారు. ఈ వ్రతాచరణ వెనుక కథను గురించి పురాణాలు ఇలా చెబుతున్నాయి. పూర్వం మథురను చంద్రపాండ్యుడు అనే రాజు పరిపాలిస్తుండే వాడు. అతడికి కుముద్వతి అనే అనుకూలవతి అయిన భార్య ఉండేది. ఆ రాజుకు చాలా కాలం వరకూ సంతానం కలగలేదు. సంతానం కోసమని శివుడి గురించి ఆ రాజ దంపతులు చాలాకాలం పాటు తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరాలు కోరుకొమ్మనాడు. వారు సంతాన భాగ్యాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు.
అంతట శివుడు- ‘అల్పాయుష్కుడైన కొడుకు కావాలా? ఆయుష్షు ఉండీ విధవరాలుగా ఉండబోయే కుమార్తె కావాలా?’ అని అడిగాడు.
వారు కొడుకే కావాలని కోరుకున్నారు.
వారిని అనుగ్రహించి ఈశ్వరుడు అంతర్థానమయ్యాడు.
రాణి కుముద్వతి కొంతకాలానికి గర్భం దాల్చింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లవాడు బాగా పెరిగి పెద్దవాడయ్యాడు. అదే రోజుల్లో అలకాపురిని ఏలుతున్న మహారాజు మిత్రసహుడికి ఒక కుమార్తె ఉండేది. ఆమె చిన్న వయసు నుంచే ఈశ్వరుడిని గొప్పగా ఆరాధిస్తూ ఉండేది. భక్తేశ్వరలింగాన్ని ఆమె నిత్యం పూజిస్తూ ఉండేది. మథుర రాజుకు మిత్రసహుడి కుమార్తె గురించి తెలిసింది. తన కుమారుడికి మరణకాలం సమీపిస్తున్నదని గ్రహించిన మథుర రాజు.. ఆ ఆపద నుంచి తన కుమారుడిని కాపాడుకోవడానికి మిత్రసహుడి కుమార్తెనిచ్చి వివాహం చేయించాలని అనుకున్నాడు. అప్పుడు మిత్రసహుడి కుమార్తె తన భక్తితోనూ, ప్రాతివత్యంతోనూ తన కుమారుడిని రక్షించుకోగలదన్నది మథుర రాజు ఆలోచన.
అలా మథుర రాజు మిత్రసహుడిని ఎలాగో ఒప్పించి ఆయన కుమార్తెను తన కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లయిన కొద్ది రోజులకే ఆయుష్షు తీరిపోవడంతో మథుర రాజు కుమారుడి కోసం యమధర్మరాజు వచ్చాడు. ఆ విషయాన్ని గమనించిన మిత్రసహుడి కుమార్తె వెంటనే తన దైవమైన భక్తేశ్వరుడిని స్మరించింది. భక్తేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై యముడితో పోరాడి, జయించి మథుర రాజు కుమారుడి ప్రాణాలను రక్షించి, పూర్ణాయువు ప్రసాదించి అంతర్థానం అయ్యాడు. ఇదీ భక్తేశ్వర వ్రత కథ.
నిష్కల్మష భక్తితో ఏదైనా సాధించవచ్చన్న సత్యాన్ని ఈ వ్రత కథ నిరూపిస్తుంది.
కార్తీక పూర్ణిమనే మహా కార్తీక అని కూడా అంటారు. ఆ రోజు పుణ్య నదులు, సముద్రాల్లో స్నానం చేస్తే మామూలుగా లభించే పుణ్యం కన్నా అధిక పుణ్యం లభిస్తుందని నమ్మకం. మహాఫల, నానాఫల, సౌభాగ్య, మనోరథ పూర్ణిమ, కృత్రిక, గోప్రధాన తదితర వ్రతాలను, వ్రత ఉద్యాపనలను కార్తీక పూర్ణిమ నాడు ఆచరిస్తుంటారు. లక్ష తులసీపూజ, లక్ష దీపార్చన, జ్వాలా తోరణం వంటి పూజలు, ఉత్సవాలు కూడా పూర్ణిమ నాడు నిర్వహిస్తుంటారు.

కార్తీక పూర్ణిమ తేదీ:
నవంబరు 5, బుధవారం, 2025
దినచర్య ఎలా ఉండాలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతారు. అసలు ప్రామాణికంగా దినచర్య అనేది ఎలా ఉండాలి?
ఆరోగ్యవంతులైన మనుషులు తమ ఆయుష్షును కాపాడుకోవడం కోసం తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి. లేచిన వెంటనే భగవంతుని స్మరించుకోవడం ద్వారా ఆశావహ దృక్పథంతో రోజును ప్రారంభించాలి. నిద్ర లేవగానే పెరుగు కానీ, నెయ్యి కానీ, అద్దం కానీ, తెల్ల ఆవాలు కానీ, మారేడు ఆకు కానీ, గోరోజనాన్ని కానీ, పూలదండను కానీ చూడటం మంచిది. సాధారణంగా ఆ రోజు ఏదైనా దుస్సంఘటన జరిగితే లేచిన వెంటనే ఫలానా వాళ్ల ముఖం చూశాను అని నెపం నెట్టేయడం చాలామందిలో ఉంటుంది. అందుకే ఇలాంటి బాధ లేకుండా ఎవరి ముఖం వాళ్లే ఉదయాన్నే చూసుకోవడం ఉత్తమం. నిద్రలేవగానే మలాదులను విసర్జించాలి. ఐదు రోజులకు ఒకసారి క్షురకర్మ చేసుకోవాలి.
తలకు తరచూ తైలాన్ని పట్టించాలి.
పట్టుబట్టలు, రకరకాల రంగులున్న బట్టలు, ఎర్రని బట్టలు.. ఇవి వాత, శ్లేష్మ వ్యాధులతో బాధపడే వారికి మేలు చేస్తాయి. శీతాకాలంలో కట్టుకోవడానికి ఇవి అనుకూలంగా ఉంటాయి. కాషాయ రంగు బట్టలు కొవ్వును తగ్గిస్తాయి. శీతగుణం కలిగి ఉండి, వేడిని తగ్గిస్తాయి. పిత్త దోషాన్ని పోగొడతాయి. తెల్లని బట్టలు
శుభప్రదం. సమశీతోష్ణంగా ఉంటాయి. ఇవి అన్ని కాలాల్లోనూ మంచివి. చలిని, ఎండనూ నివారిస్తాయి. వర్షాకాలంలో మేలు చేసేవిగా ఉంటాయి.
భోజనం చేసేటపుడు చదవడం, టీవీ చూడటం వంటివి చేయకూడదు. కేవలం మంగళకరమైన విషయాలను గురించి ఆలోచిస్తూ భోజనం చేస్తే ఆయువు, ధర్మం వృద్ధి చెందుతాయని యోగ రత్నాకరం అనే వైద్య గ్రంథంలో రాశారు.
మనిషికి నిద్ర, దప్పిక, ఆకలి, మైధునం.. ఈ నాలుగు కోర్కెలు సహజసిద్ధమైనవి. కాబట్టి వీటిని ఆపుకోవడానికి ప్రయత్నించకూడదు. అవసరం మేరకు పరిమితంగా ఆచరించాలి.
ఆహారం, మలమూత్ర విసర్జన, సంభోగం.. వీటిని ఏకాంతంలోనే చేయాలి. ఇలా ఎవరికి వారు ఆరోగ్యకరమైన దినచర్యను రూపొందించుకోవచ్చు.

కార్తీకమాసంలో ఆచరించే సోమవార వ్రత మహిమ గురించి చెబుతారా?. ఈ వ్రతంతో ముడిపడిన కథ ఏమిటి?
కార్తీక సోమవార వ్రతం ఎంతటి పుణ్యాన్ని కలిగిస్తుందో తెలియచెప్పే కథ ఇది. పూర్వం కాశ్మీర దేశానికి చెందిన స్వాతంత్య్ర నిష్ఠురి అనే ఒకామె ఉండేది. ఆమె అత్యంత హేయంగా, కర్కశంగా ప్రవర్తిస్తుండేది. దీంతో ఆమెను అందరూ కర్కశ అని పిలుస్తుండే వారు. ఈ కశ్మీర కన్య సౌరాష్ట్ర దేశానికి చెందిన మిత్రశర్మ అనే మంచి వేద పండితుడిని పెళ్లి చేసుకుంది. అయితే, కర్కశ తన దుర్మార్గ ప్రవర్తనతో సుగుణశీలుడైన భర్తను నానావిధాలుగా హింసించేది. జారిణిగా జీవితం గడిపేది. చివరకు వృద్ధాప్యంలో భయంకరమైన వ్యాధి బారినపడి, ఎవరూ ఆదరించే వారు లేక దీనస్థితిలో మరణించింది. ఆమె చేసుకున్న పాప ఫలితంగా మరుసటి జన్మలో కుక్కగా జన్మించింది. ఆ కుక్కకు ఓ కార్తీక సోమవారం నాడు పగటిపూట ఎక్కడా ఆహారమే లభించలేదు. చివరకు సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవారం వ్రతంలో భాగంగా ఉపవాసం ఉండి సాయంకాలం వేళ వ్రతం ముగించే విధానంలో భాగంగా ఆచారం ప్రకారం బలి (అన్నం ముద్ద)ను తన ఇంటి ముంగిట ఉంచాడు. ఆహారం కోసం అన్వేషిస్తున్న శునకం ఆ అన్నం ముద్దను తిన్నది. వెంటనే దానికి పూర్వజన్మ స్మ•తి కలిగింది. దాంతో మానవ భాషలో తన గతాన్నంతటినీ ఆ శునకం వేదపండితుడికి చెప్పింది.
అది చెప్పిందంతా విన్న వేద పండితుడు- కార్తీక సోమవారం నాడు పగటి పూట ఏమీ తినకుండా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ మాత్రమే శివుడి ప్రసాదంలాంటి బలిని తిన్న కారణంగానే శునకానికి పూర్వజన్మంతా గుర్తుకు వచ్చిందని గ్రహించాడు. అదే విషయాన్ని కుక్కకు చెప్పాడాయన. దాంతో తనకెలాగైనా పుణ్యం లభించేలా చేయాలని ఆ శునకం వేడుకుంది. దీంతో ఎన్నో సోమవార వ్రతాలు చేసి, పుణ్యం సంపాదించుకున్న ఆ వేద పండితుడు పరోపకార దృష్టితో ఒక సోమవార వ్రతఫలాన్ని ఆ శునకానికి ధారపోశాడు. వెంటనే శునక దేహం విడిచి కర్కశ దివ్య శరీరం దాల్చింది. నేరుగా కైలాసానికి చేరుకుంది.
ఇది స్కంద పురాణంలో ఉన్న సోమవార వ్రత కథ. ఈ వ్రత కథలో అంతర్గతంగా ఎన్నో సందేశాలు ఉన్నాయి. జీవితంలో ఎవరూ చెడు తిరుగుళ్లు తిరగకూడదని, అలా చేస్తే జీవిత చరమాంకంలోనైనా కష్టాలు తప్పవని, అలాగే మరుసటి జన్మలో శునకంలాగానో, మరో నీచ జంతువు లాగానో జన్మించాల్సి వస్తుందనే హెచ్చరిక కనిపిస్తుంది. అలాగే, పండితుడు సోమవార వ్రత పుణ్యఫలాన్ని దయార్ద్ర హృదయంతో, పరోపకార బుద్ధితో ధారపోయడాన్ని మనుషులంతా ఆదర్శంగా తీసుకోవాలన్న ఓ సూచన కూడా ఈ కథలో ఉంది. దైవభక్తి మాటున సామాజిక హితోక్తి కూడా ఇమిడి ఉండటం మన పురాణ కథల ప్రత్యేకత.

Review భక్తేశ్వర వ్రత కథేమిటి?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top