మానవతా స్ఫూర్తి

చిన్న జీయర్‍ స్వామి.. పేరులోనే ‘చిన్న’.. ఆయన మనసు వెన్న. ఆయన హృదయం దైవ సన్నిధి. భగవంతుని సేవలో.. సామాజిక బాటలో ఆయన అడుగులు వేసి అరవై వసంతాలు పూర్తయ్యాయి. 2016 అక్టోబరు 31తో ఆయన జీవితంలో అరవై వసంతాలు పూచాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‍ పరిధిలోని ముచ్చింతల్‍లో గల శ్రీరాంనగర్‍లో 2016 అక్టోబరు 24 నుంచి నవంబర్‍ 6 వరకు ఘనంగా తిరునక్షత్ర మహ•త్సవాలు నిర్వహించారు. స్వామివారి షష్ఠి పూర్తి సందర్భంగా ఆ మానవతా స్ఫూర్తి.. సమతామూర్తి గురించి స్వల్ప పరిచయం..
1956, దీపావళి పర్వదినం వేళ తూర్పు గోదావరి జిల్లా ఆరమూరు గ్రామంలో శ్రీమన్నారాయణాచార్య జన్మించారు. చిలకమర్రి అలుమేలు మంగతాయారు, డాక్టర్‍ కృష్ణమాచార్యులు తల్లిదండ్రులు. శ్రీమన్నారాయణాచార్య విద్యాభ్యాసమంతా రాజమండ్రిలోనే కొనసాగింది. తండ్రి వైద్యులు కావడంతో ఇంట్లో ఆంగ్ల పుస్తకాలు ఎక్కువగా ఉండేవి. వీటిని బాగా చదవడంతో శ్రీమన్నారాయణాచార్య తన చిన్ననాటే ఆంగ్లంలో ప్రావీణ్యాన్ని సంపాదించారు. మనందరి జీవితాలకు సంబంధించిన దేవుడి వద్ద ప్రణాళిక ఉంటుందట! ఈ విధంగా చూస్తే శ్రీమన్నారాయణాచార్య జీవితానికి సంబంధించి భగవంతుడు ఆయన చిన్ననాటే పెద్ద ప్రణాళిక రచించాడు. శ్రీమన్నారాయణాచార్య అడుగులన్నీ దైవ సంకల్పానుసారమే పడ్డాయి. అందుకు అంకురార్పణగా నిలిచిందీ ఘటన.. 1974-75 మధ్య కాలంలో గుంటూరు జిల్లా నడిగడ్డపాలెంలోని ఉభయవేదాంతాచార్య పీఠానికి శ్రీమన్నారాయణాచార్య పెద్దల మాటపై వెళ్లాల్సి వచ్చింది. ఈ పీఠాధిపతి శ్రీమన్నారాయణాచార్య తాత గారైన శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్ద జీయర్‍ స్వామి. పెద్ద స్వామి శ్రీమన్నారాయణాచార్యను చూడగానే ఆ ముఖంలో ఓ వర్చస్సు కనిపించింది. ‘ఈ కుర్రవాడిని సమాజసేవకు వినియోగించుకోవాలి’ అని ఆయన మనసులోనే అనుకున్నారు. శ్రీవిశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారం కోసం తన వారసుడిగా ఆనాడే శ్రీమన్నారాయణాచార్యను మనసులోనే ఆయన ప్రకటించేశారు. ఈ క్రమంలోనే పెద్ద స్వామి సూచనతో శ్రీమన్నారాయణాచార్య వేదాంతం, ద్రవిడ సాహిత్యం, సంస్క•తం, శ్రీభాష్యం, భగవిద్విషయం, దివ్యప్రబంధాలను కంఠోపాసన చేశారు. ఎనిమిదేళ్ల చదువును రెండేళ్లలోనే పూర్తి చేయడంతో అబ్బురపడిన పెద్ద స్వామి.. తిరుపతి వేంకటేశ్వరుని సన్నిధిలో శ్రీమన్నారాయణాచార్యకు కాషాయాన్ని అందించారు. 1980, ఫిబ్రవరిలో శ్రీమన్నారాయణాచార్య సన్యాసాశ్రమం స్వీకరించారు. నడిగడ్డపాలెం పీఠానికి ఉత్తరాధికారిగా నియమితులయ్యారు. 1980లో పెద్ద స్వామి పరమపదించడంతో.. ఆయన చేపట్టిన కార్యక్రమాలన్నిటినీ దిగ్విజయంగా పూర్తి చేయడానికి శ్రీమన్నారాయణాచార్య.. చిన్నజీయర్‍ స్వామిగా అవతరించారు. అప్పటి నుంచి దైవకార్యాన్ని సామాజిక సేవను మిళితం చేసి చిన్నజీయర్‍ తన ఆధ్యాత్మిక జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. వేద పాఠశాలలను, వేద విశ్వవిద్యాలయాలను స్థాపించడం, సామాజిక సేవలో భాగంగా విద్యవైద్యం వంటి సేవలను సామాన్యులకు అందించడం వంటి కార్యక్రమాలను మహ•న్నత స్థాయిలో చేపడుతున్నారు. ప్రస్తుతం శంషాబాద్‍ సమీపంలోని శ్రీరాంనగర్‍లో 45 ఎకరాల విస్తీర్ణంలో రామానుజుల వారి సహస్రాబ్ధి సందర్భంగా 216 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేసే బృహత్తర బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. తన సేవా కార్యక్రమాలకు చిన్న జీయర్‍ స్వామి తెలంగాణ రాష్ట్రంలోని శ్రీరాంనగరం, ఆంధప్రదేశ్‍లోని సీతానగరం (విజయవాడ), నడిగడ్డపాలెం (విశాఖపట్నం) ప్రాంతాలను వేదికగా చేసుకున్నారు. ‘స్వీయ ఆరాధన.. సర్వ ఆదరణ’ అనేది చిన్న జీయర్‍ స్వామి వారి నినాదం. మానవ సేవే మాధవ సేవగా ప్రచారం చేస్తూ, ఆచరణలో నిరూపిస్తూ ఆధునిక ఆధ్యాత్మికతను కొత్త పుంతలు తొక్కిస్తున్న చిన్నజీయర్‍ స్వామి అందరికీ ఆరాధ్యులు.

Review మానవతా స్ఫూర్తి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top