సాధారణంగా 70లలో పడితే జీవితం అయిపోయినట్టేననేది చాలామంది భావన. అంతెందుకు వయసులో ఉండగానే రెండు మూడు ఎదురుదెబ్బలు తగిలితే చాలు కుదేలైపోతుంటారు. కానీ, ఆయన జీవితం మొత్తం ఒడిదుడుకుల బాటే. అడుగడుగునా పరీక్షలు.. మరిచిపోదామన్నా మరిచిపోలేని గుండెల్ని పిండేసేంత విషాదాలు.. మామూలుగానైనే 77 సంవత్సరాల వ్యక్తి అటువంటి పరిణామాలతో కూలబడిపోయే పరిస్థితే.. కానీ, ఆయన జో బైడెన్. చూడ్డానికి ముసలి తాతలా కనిపించినా.. నవతరం యువతకు ఏమాత్రం తీసిపోని దృక్పథం ఆయనది. ఎదురుదెబ్బ తగిలిన ప్రతిసారీ ఆయన లేచి నిలుచుని విధికి సవాల్ విసిరారు. విషాదం ఎదురైనపుడు గుండె దిటవు చేసుకుని ముందుకు సాగారు.
చిన్నప్పుడు అందరూ ‘నత్తోడు’ అని ఎగతాళి చేశారు. కాస్త పెరిగి పెద్దయి, రాజకీయాల్లో నిలదొక్కుకున్నాక.. ‘నువ్వేంటి.. అధ్యక్ష పదవేంటి?’ అంటూ వెక్కింరించారు. పెళ్లయిన కొన్నాళ్లకే భార్యను, ఏడాది వయసున్న కుమార్తెను కోల్పోయిన జీవితం ఆయనది. అంతలోనే చేతికంది వచ్చిన చెట్టంత కొడుకు ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయాడు. ఒకటా.. రెండా.. ఎన్నో ఆటుపోట్లు.. మరెన్నో ఎదురుదెబ్బలు.. అయినా ఆయన జీవితాన్ని నిలబెట్టుకున్నారు. జీవిత చరమాంకంలో అగ్రరాజ్యానికి 46వ అధ్యక్షునిగా ఎన్నికై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన జీవితంలో ఎన్నో ఆదర్శాలున్నాయి.. అవమానాలున్నాయి.. ఆనందాలున్నాయి.. అనుబంధాలున్నాయి.. అంతకుమించిన విషాదాలున్నాయి.. అయితేనేం.. తన సంకల్పబలంతో, మనో నిబ్బరంతో ఆయన సాధించిన విజయాన్ని నేడు ప్రపంచమంతా అబ్బురంగా చూస్తోంది.
ఐర్లాండ్ నేపథ్యం ఉన్న ఐరిష్ క్యాథలిక్ కుటుంబంలో 1942, నవంబర్ 20న పెన్సిల్వేనియా రాష్ట్రంలోని స్క్రాంటన్‍లో జో బైడెన్ జన్మించారు. ఆయన పూర్తి పేరు.. జోసెఫ్ రోబినెట్ బైడెన్ జూనియర్. ఆయనకు ముగ్గురు తోబుట్టువులు. మొదట్లో ఆయన కుటుంబం ఆర్థికంగా బాగానే ఉన్నా.. బైడెన్ పుట్టే సమయానికి ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. దీంతో అమ్మానాన్నను వదిలి తాతమ్మల వద్దకు ఆయన చేరారు. తండ్రి తరువాత ఆయన కొనసాగించిన సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల వ్యాపకాన్ని బైడెన్ కొనసాగించారు. బైడెన్ పెద్ద చదువరి కాదు. అంతంతగానే ఆయన చదువులు సాగేవి. అయితే, తన చలాకీతనంతో క్లాస్ లీడర్‍గా ఉండేవారు. ఫుట్‍బాల్, బేస్‍బాల్ ఆడేవారు. బైడెన్ మొదట యూనివర్సిటీ ఆఫ్ డెలావర్‍లో, తరువాత సిరక్యూస్ యూనివర్సిటీ లా స్కూల్‍లో ఉన్నత విద్యను అభ్యసించారు. సిరక్యూస్ వర్సిటీ నుంచి 1968లో న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు.
మాట్లాడితే లక్ష డాలర్లు..
మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన బైడెన్ తన స్వయంకృషితో అనతికాలంలోనే అమెరికాలోని మిలియనీర్ల జాబితాలో చేరారు. పుస్తకాలు రాయడం, ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా చాలా సంపాదించారు. విచిత్రంగా, ఆయన చిన్నప్పుడు నత్తిగా మాట్లాడతారని అందరి ఎగతాళికి గురైన ఆయనే తన ఉపన్యాసాల ద్వారా కోట్ల డాలర్లు ఆర్జించడం గొప్ప విజయం. 2019లో విడుదల చేసిన లెక్కల ప్రకారం జో బైడెన్, ఆయన భార్య జిల్.. వీరిద్దరూ పుస్తకాలు,
ఉపన్యాసాల ద్వారా 15 లక్షల డాలర్లు సంపాదించారు. 2017లో తన కుమారుడు బ్యూ క్యాన్సర్‍పై రాసిన పుస్తకం కొద్దికాలం పాటు అత్యధిక ప్రాచుర్యం కలిగిన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. విదేశాంగ నిపుణుడైన బైడెన్ వివిధ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అనర్ఘల ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఒక్కో ఉపన్యాసానికి సుమారు లక్ష డాలర్లను ఫీజు కింద తీసుకుంటారు. న్యూజెర్సీ యూనివర్సిటీలో ఇచ్చిన ఒక ఉపన్యాసానికి అయితే దాదాపు రెండు లక్షల డాలర్లు వచ్చిందని అంటారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని పెన్ బైడెన్ సెంటర్ ఫర్ డిప్లమసీ అండ్ గ్లోబల్ ఎంగేజ్‍మెంట్‍లో విజిటింగ్ ప్రొఫెసర్‍గా పనిచేసిన బైడెన్ దాదాపు 5.5 లక్షల డాలర్లు సంపాదించారు. మోత్తానికి దంపతులు ఇద్దరూ కలిసి 2019లో దాదాపు 10 లక్షల డాలర్లు అమెరికా ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించారు.
అంతులేని విషాదాలు
బైడెన్ జీవితంలో పలు విషాదాలు చీకట్లు నింపాయి. అయితే, తరగని ఆత్మవిశ్వాసంతో ఆ చీకట్లను చీల్చుకుని ఆయన వెలుగులోకి వచ్చారు. 1072లో తన తొలి భార్య నెలియా, ఏడాది పాప.. క్రిస్మస్ షాపింగ్ నుంచి వస్తూ కారు ప్రమాదంలో మరణించారు. ఇద్దరు కుమారులు గాయపడ్డారు. ఆ సమయంలో బైడెన్ సెనేటర్‍గా తొలిసారి ఎన్నికై ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఒకపక్క భార్య, కుమార్తెను పోగొట్టుకున్న పరిస్థితి.. మరోపక్క తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో మంచానపడ్డ ఇద్దరు కొడుకులు.. చివరకు ఆస్పత్రిలో కొడుకుల పక్కనే నిల్చుని ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. బైడెన్ కుమారుడు బ్యూ.. తండ్రి బాటలోనే పయనించి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. డెలావర్ రాష్ట్రానికి అటార్నీ జనరల్ అయ్యాడు. బ్యూ రాజకీయాల్లో తన తండ్రికి వారసుడిగా కొనసాగుతాడని అందరూ భావించారు. 2016లో బ్యూ డెలావర్ రాష్ట్ర గవర్నర్‍గా పోటీ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే, తండ్రికి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టే సమయంలో.. 2015లో 46 సంవత్సరాల వయసులో బ్యూ బ్రెయిన్ క్యాన్సర్‍తో మరణించాడు. ఇది బైడెన్‍కు మరో అతిపెద్ద షాక్
ఆమె రాకతో జీవితం మారింది.
1975లో జిల్.. బైడెన్‍ను కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారి.. అనంతరం రెండు సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నారు. అప్పటికే జిల్ తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ 1981లో ఆష్లే జన్మించింది. ఆష్లే బైడెన్ ఫ్యాషన్ డిజైనర్. యాక్టివిస్ట్ కూడా. ప్రస్తుతం జిల్ – బైడెన్‍లకు ఐదుగురు మనవలు, మనవరాళ్లు ఉన్నారు. జిల్ తన జీవితంలోకి ప్రవేశించాక బైడెన్ తనకెదురైన ఎదురుదెబ్బల్ని తట్టుకోగలిగే మనోధైరాన్ని సంపాదించుకున్నారు. ఆమె ప్రోత్సాహంతో రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొనే వారు. రాజకీయంగా ఆయన వేసిన ప్రతి అడుగు వెనుక జిల్ జాడ ఉంటుందని అంటారు. బైడెన్ విల్మింగ్టన్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
నిజంగా ‘పెద్దన్నే’..
దాదాపు యాభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా.. ఆయనకు ఉన్నత పదవులు అంత తేలిగ్గా లభించలేదు. రెండుసార్లు ఆయన అమెరికాకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. అయితే, ఈ పదవి ద్వారా ఆయన ఎంత పేరు సంపాదించారో తెలియదు కానీ, ట్రంప్‍ను ఎదురొడ్డి 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా మాత్రం మొత్తం ప్రపంచం దృష్టిలో పడ్డారు. డెబ్బై ఏడు సంవత్సరాల బైడెన్ అమెరికాకు అత్యంత పెద్ద వయస్కుడైన అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు. అమెరికా అధ్యక్షుడిని ‘పెద్దన్న’గా వ్యవహరించడం రివాజు. బైడెన్ ఇప్పుడు తన వయసు రీత్యా కూడా అమెరికాకు ‘పెద్దన్న’ అయ్యారు.
మూడోసారి పనైంది.
అమెరికా రాజకీయాల్లో ఉన్న వారికి.. ఆ దేశపు అత్యున్నత పదవైన అధ్యక్ష పదవి అందుకోవాలని తప్ప వేరే ఇతర లక్ష్యాలేమి ఉంటాయి? బైడెన్‍కూ అంతే. ఎప్పటికై అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలనేది ఆయన చిరకాల వాంఛ. అయితే ఆ కల అంత తేలిగ్గా నెరవేరలేదు. ఇప్పుడు ఆయన అధ్యక్షుడు కావడానికి ముందు రెండుసార్లు ఆ పదవిని ఆశించారు. అయితే, తొలి రెండు ప్రయత్నాల్లో ఆయన అవమానాలు ఎదుర్కొన్నారు. 1988లో తొలిసారి నలభై ఏళ్ల వయసులో ఆయన అధ్యక్షుడు కావాలని అనుకున్నారు. కానీ, అప్పటి బ్రిటిష్ లేబర్ పార్టీ లీడర్ నీల్ కినోక్ ఉపన్యాసాలను కాపీ కొట్టినట్టు ఆరోపణలు రావడంతో పోటీ చేసే అర్హత కోల్పోయారు. 2008లో మరోసారి అధ్యక్ష పదవి బరిలోకి దిగాలని ప్రయత్నించారు. అయితే, ఈసారి సొంత పార్టీ డెమోక్రాట్ల నుంచే పెద్దగా మద్దతు లభించలేదు. అదే సమయంలో డెమొక్రటిక్ పార్టీ నుంచే బరాక్ ఒబామా బలమైన అభ్యర్థిగా నిలవడంతో అధ్యక్ష పదవి బరిలో బైడెన్ నిలవలేకపోయారు. అలాగే, ప్రజలను తన వైపు తిప్పుకునే విషయంలోనూ, ర్యాలీలకు జన సమీకరణలోనూ, నిధుల సేకరణలోనూ వెనుకబడటంతో బిడ్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. కానీ, అదే సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఒబామా అధ్యక్షుడిగా విజయం సాధించగా, బైడెన్‍ను ఉపాధ్యక్షుడిగా తీసుకున్నారు. అటు తరువాత రెండోసారి కూడా ఒబామా ఉపాధ్యక్షుడిగా బైడెన్‍ను కొనసాగించారు. విదేశాంగ వ్యవహారాల్లో ఒబామాకు పరిష్కారకర్తగా, సలహాదారుగా బైడెన్ వ్యవహరించారు.
ఈ ఎన్నికల్లో విజయానికి బాటలు వేసినవివే..
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెబ్బయిలలో ఉన్న ఇద్దరు వృద్ధులు పోటీ పడ్డారు. ఈ ఎన్నిక ఆది నుంచీ అందరి దృష్టినీ ఆకర్షించింది. ట్రంప్‍పై పోటీ చేసి గెలవడానికి బైడెన్‍కు ఏయే అంశాలు కలిసి వచ్చాయంటే..
బైడెన్‍కు డెమొక్రాట్లలో మితవాదిగా మంచి పేరు ఉంది. ఒబామా హయాంలో రెండుసార్లు ఎనిమిది సంవత్సరాల పాటు ఉపాధ్యక్షుడిగా పనిచేయడం కూడా అమెరికన్లకు ఆయన పూర్వ పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత సమర్థుడైన ఉపాధ్యక్షుడు బైడెన్ అంటూ ఒబామా ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పడం అమెరికన్లను తాకింది. ఇక, అందరికీ అందుబాటులోకి ఆరోగ్యం అనేది బైడెన్ నినాదం. వ్యక్తిగతంగా పిల్లల్ని కోల్పోయిన బాధ ఆయనను ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చేలా చేసింది. అలాగే, ఎన్నికల సమయంలో ఎలా ఉన్నా.. కీలక అంశాల్లో రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలు కలిసి పని చేయాలనేది బైడెన్ విశ్వాసం. అందుకే రిపబ్లికన్ పార్టీలోని మితవాదులు కూడా ఆయనను ఇష్టపడతారు. ఈ క్రమంలో ఆయన పాలన పగ్గాలు చేపట్టగానే రిపబ్లికన్ పార్టీలోని ఈ మితవాదులంతా ఆయనకు మద్దతుగా నిలుస్తారని అనుకుంటున్నారు. అలాగే, కరోనాను బైడెన్ సమర్థవంతంగా కట్టడి చేస్తారనే విశ్వాసం అమెరికన్లలో వ్యక్తమైంది. ఈ మేరకు ప్రతి పది మంది ఓటర్లలో నలుగురు ఇదే విషయంలో ఆయనను నమ్మి ఆయనకు ఓటేశార. జాతి వివక్షను తావులేకుండా పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు తెస్తానన్న హామీ అందరికీ చేరింది. ఇక, భారత సంతతికి చెందిన కమలా హారిస్‍ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసిన సందర్భంలోనూ ఆయనపై అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగానూ ఒక సానుకూల భావం కలిగింది. పారిస్ ఒప్పందంలో తిరిగి చేరతామని ప్రకటించడం, ఇరాన్‍తో అణు ఒప్పంద పునరుద్ధరణపై పునరాలోచన చేస్తామని చెప్పడం వంటివి ఈ ఎన్నికల్లో ఆయన గెలుపునకు దోహదపడ్డాయి.
అలాగే, ఒబామా అధ్యక్షుడిగా ఉన్న ఎనిమిదేళ్ల కాలంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్.. తమ హయాంలో అమలు చేసిన అఫర్డబుల్ కేర్ యాక్ట్ వంటి పథకాల్లో చాలా భాగం తన కృషి ఫలితమేనని చెప్పుకోవడానికి వీలైంది. ఒబామాతో ఉన్న స్నేహం వల్ల ఆఫ్రో అమెరికన్ ఓటర్ల నుంచి కూడా బైడెన్‍కు మంచి మద్దతు లభించింది.
Review మిడిల్‍క్లాస్ జో.. సూపర్‍మ్యాన్ ‘జై’డె.