రైభ్య మహర్షి

రైభ్యుడు చిన్నతనం నుంచే వేదాధ్యయనం ప్రారంభించాడు. ఆయనకు గురుభక్తి చాలా ఎక్కువ. గురువు గారి కంటే చాలా ముందే నిద్ర లేచి ఆయన తిరిగి పడుకునే వరకు ఆయనకు కావాల్సిన సేవలు, సపర్యలు చేసి అనంతరం మిగిలిన సమయంలో చదువుకునే వాడు.
గురువు గారు కూడా ఇతని గురుభక్తికి సంతోషించి అన్ని వేద శాస్త్రాలు రైభ్యుడికి బాగా వంటబట్టేటట్టు నేర్పించారు. మొత్తం అన్నీ నేర్చుకున్నాక గురువు గారి ఆజ్ఞ తీసుకుని బృహస్పతి వద్దకు వెళ్లాడు రైభ్యుడు.
రైభ్యుడు తనకు సందేహాలు తలెత్తినప్పుడు బృహస్పతిని అడిగి వివరంగా తెలుసుకునేవాడు.

ఒకసారి వసు మహారాజును తీసుకుని రైభ్యుడు బృహస్పతి వద్దకు వెళ్లి, ‘దేవా! మోక్షం కర్మలు చేయడం వల్ల కలుగుతుందా? లేక జ్ఞానాన్ని సంపాదించడం వల్ల లభిస్తుందా?’ అని అడిగాడు.
‘మునీంద్రా! తామరాకు మీద నీరు ఎలా అయితే అంటుకుని ఉండదో అదేవిధంగా చేసిన కర్మలను పరమేశ్వరార్పణమస్తు అని భగవంతుడికి అర్పిస్తే మనలను ఏ కర్మా కూడా అంటుకోదు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను’ అంటూ బృహస్పతి ఇలా చెప్పసాగాడు.
పూర్వం సంయముడనే మహారాజు భగీరథీ తీరంలో తిరుగుతుండగా ఒక బోయవాడు లేళ్ల గుంపును వేటాడుతూ కనిపించాడు. మహారాజు అతడిని ఆపి, ‘పాపం! అవేం చేశాయి? వాటిని చంపకు’ అని వారించాడు.
‘చంపడానికి, మానడానికి నేనెవరిని? అంతా ఈశ్వరేచ్ఛ’ అని బదులిచ్చాడు బోయవాడు.

‘ఎందుకలా మాట్లాడుతున్నావు?’ అని అడిగాడు సంయముడు.

బోయవాడు తన వీపు మీదున్న ఇనుప వలను కింద పడవేసి దీంట్లోంచి అగ్ని పుట్టించు అన్నాడు సంయముడితో.

సంయముడు ఎంత ప్రయత్నించినా ఆ పని చేయలేకపోయాడు.

కానీ, బోయవాడు తన సంకల్పంతో ఇనుప వల నుంచి అగ్నిని పుట్టించి.. దానిని తిరిగి ఆర్పివేసి ఇలా అన్నాడు- ‘ఈ మంటలు ఎలా అయితే వెలిగి ఆరిపోతున్నాయో, అలాగే భగవంతుడు ప్రకృతి స్థితుడైనపుడు జీవులు నశించి వికృతడై మళ్లీ పుట్టిస్తాడు. ఇంక శరీర ధర్మాల విషయానికి వస్తే ఎవరికి ఏది ఇష్టమో అది చేసి పరమాత్మకు అర్పించాలి. అంటే మనం ఏదైనా తింటున్నా, తాగుతున్నా, ఎవరికైనా ఏమన్నా ఇస్తున్నా, ఏ పని చేస్తున్నా ‘పరమేశ్వరార్పణం’ అని మననం చేసుకుంటుండాలి. అలా చేయడం వల్ల మనం చేసే ప్రతి పని, ప్రతి కర్మ భగవంతుడికే చెందుతుంది’ అని బోయవాడు చెప్పడం ఆపగానే అతనిపై దేవతలు పూలవర్షం కురిపించారు.
అనంతరం దేవతలు బోయవాడిని సంయముడు చూస్తుండగానే విమానంలో తీసుకుపోయారు’ అని బృహస్పతి చెప్పిన కథ విని రైభ్యుడు, ఇతర మహర్షులు ఆనందంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కొంతకాలానికి రైభ్యుడు పెళ్లి చేసుకున్నాడు. అతడికి అర్వావసువు, పరావసువు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. పిల్లలిద్దరికీ వేదవిద్యలు నేర్పించి వాళ్లతో పాటు రైభ్యుడు చదువుతుంటే మిగిలిన మహర్షులు ఆనందంగా చూసి ఆశీర్వదించి వెళ్లేవారు.
రైభ్య మహర్షి కొడుకులను, వారి ప్రతిభను చూసి భరద్వాజుడి కొడుకు అవక్రీతుడు అసూయ పడేవాడు. రైభ్యుడు, భరద్వాజుడు మాత్రం అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉంటూ తపస్సు చేసుకునే వారు.
తనకు అన్ని వేదాలు వంటబట్టాలంటూ అవక్రీతుడు ఇంద్రుడి గురించి తపస్సు చేశాడు. వేదాలు గురువు ద్వారా నేర్చుకోవాలి కానీ తపస్సు ద్వారా కాదని ఇంద్రుడు వారించాడు.

అవక్రీతుడు వినకపోతే ఇంద్రుడు సరేనంటూ, ‘వరమైతే ఇస్తాను కానీ అలా వచ్చిన వేదాలు నీకు ఎంతవరకు ఉపయోగపడతాయో మాత్రం చెప్పలేను’ అన్నాడు.

అవక్రీతుడికి వేదాలు నేర్చుకున్నానన్న గర్వం పెరిగిపోయింది. బృహస్పతి గర్వం వీడాలని ఎంత చెప్పినా అతడు వినలేదు.

ఒకరోజు అవక్రీతుడు రైభ్యుడి కోడలిని అవమానించాడు.

దీంతో రైభ్య మహర్షి ఒక రాక్షసిని, ఒక రాక్షసుడిని పుట్టించి వాళ్ల ద్వారా అవక్రీతుడిని చంపించాడు.

భరద్వాజుడు కొడుకును పోగొట్టుకుని బాధలో ఉన్నా కూడా.. తన కొడుకు చేసిన తప్పునకు తగిన శిక్షే పడిందని, అది న్యాయమేనని భావించి దహనక్రియలు జరిపించాడు. కొడుకు ఎడబాటును భరించలేక అనంతరం శరీర త్యాగం చేశాడు.
ఒకనాడు రైభ్యుడి కుమారుడు అర్వావసువు రాత్రి వేళ ఇంటికి వస్తుండగా, అతడిపై ఒక మృగం దాడిచేసింది. దాన్ని కొట్టడానికి అతడు కర్ర విసరగా, అది గురితప్పి ఆ సమీపంలో నిద్రిస్తున్న తండ్రి రైభ్యుడి తలకు తగిలి అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
రైభ్యుడి కొడుకు అర్వావసువు మిక్కిలి బాధపడి తపస్సు చేయసాగాడు. అతడి తపస్సుకు మెచ్చుకున్న దేవతలు వరాలు కోరుకొమ్మన్నారు. రైభ్యుడిని, భరద్వాజుడిని, అవక్రీతుడిని బతికించాలని కోరాడు అర్వావసువు.
అప్పటి నుంచి అవక్రీతుడు గర్వం వదిలి అందరితో సఖ్యంగా ఉండేవాడు.

రైభ్యుడు తీర్థయాత్రలు చేస్తూ అనంతశాయిని, రంగధాముడిని, కంచి వరదరాజుని, వేంకటేశ్వరస్వామిని, అహోబలేంద్రుడిని, సింహాచల నాయకుడిని, శ్రీకూర్మపతిని, పురుషోత్తముడిని దర్శించి ప్రయాగ వెళ్లి గయలో పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి ఒకచోట తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు.
అలా తపస్సు చేసుకుంటుండగా సనత్కుమారుడు వచ్చి అతని తపోదీక్షను మెచ్చుకున్నాడు. ఆ తపస్సును మెచ్చి, ఏం కావాలని విష్ణువు అడిగాడు. సనకాదులు ఉండే చోటుకు తననూ పంపాలని రైభ్యుడు కోరగా, విష్ణువు ఆయనకు మోక్షాన్ని ప్రసాదించాడు.

Review రైభ్య మహర్షి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top