అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక జో బైడెన్ ఉద్వేగభరిత ప్రసంగం
తమ అందమైన భవిష్యత్తు కోసం ఓటు వేసిన అమెరికా ప్రజల విశ్వాసాన్ని నిలబెడతానని అమెరికా 46వ అధ్యక్షుడు జో బైడెన్ మాట ఇచ్చారు. దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత బైడెన్ తొలిసారి తన సొంత రాష్ట్రం డెలావర్‍లో ఏర్పాటు చేసిన డెమొక్రాట్ల విజయోత్సవ సభలో ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘నా గెలుపు అమెరికన్ల గెలుపు. ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హారిస్ అద్భుతమైన నాయకురాలు. అధ్యక్ష స్థానం వరకు చేరుకున్న తన జీవితంలో సహకరించిన జీవిత భాగస్వామి జిల్ బైడెన్ సహా ఇతర కుటుంబసభ్యులకు నా అభినందనలు, ఎన్నికల్లో ఓడిన ట్రంప్ నాకేమీ శత్రువు కాదు. అమెరికా అభివృద్ధి కోసం ఆయనతో సహా అందరితోనూ కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటాం. దీని కోసం ఒక ప్రత్యేక కార్యదళాన్ని ప్రకటిస్తాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అమెరికాలోని ప్రతి కుటుంబం యొక్క ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్నాను. దేశంలోని అన్ని వర్గాల ప్రయోజనాల కోసం కృషి చేస్తాను.
దేశాభివృద్ధి కోసం అహర్నిశలు పని చేస్తాను. అమెరికా పురోగతి కోసం రిపబ్లికన్లతో కూడా కలిసి సాగుతాం. తాజాగా ప్రజలు ఇచ్చిన తీర్పు అమెరికా అభివృద్ధి కోసమేనని బలంగా విశ్వసిస్తున్నాను. పరస్పర సహకారంతోనే ముందుకు నడవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అంతా కలిసి సాగితే అమెరికన్లు ఏదైనా సాధించగలరు. రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య తేడా చూపబోం. డెమొక్రటిక్ స్టేట్లు, రిపబ్లికన్ స్టేట్లుగా నేను వర్గీకరించబోను. నా మదిలో ‘యునైటెడ్ స్టేట్స్’ అన్న భావన ఒక్కటే ఉంది’’ అని ఉద్వేగంగా బైడెన్ ప్రసంగించారు.
బైడెన్ ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు
- అమెరికాను వివిధ వర్గాలు, ప్రాంతాలు, జాతులపరంగా విభజించే అధ్యక్షుడిగా కాకుండా ఐక్యం చేసే అధ్యక్షుడిగా ఉంటాను.
- విద్యాసంస్థలో బోధిస్తున్న వారికంతా ఇది గొప్ప రోజు. మీలో ఒకరు ప్రథమ మహిళగా శ్వేతసౌథంలో ఉండబోతున్నారు (బైడెన్ సతీమణి జిల్ బోధన వృత్తిలో ఉన్నారు. ఆమెను ఉద్దేశించిన బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్ ప్రస్తుతం నార్తర్న్ విద్యాసంస్థలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‍గా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే).
- కరోనా విజృంభిస్తున్న ఈ విపత్కాలంలోనూ ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించిన వలంటీర్లు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతల్యుపరస్పర దూషణలను దూరం పెట్టే సమయం ఆసన్నమైంది. ఇకపై ఒకరికొకరు చర్చించుకుంటూ ముందుకు సాగాలి.
- బైబిల్‍లో చెప్పినట్టుగా- ‘ప్రతి కార్యానికి ఒక సమయం వస్తుంది’. అలాగే, అమెరికాను స్వస్థ పరిచే సమయం ఆసన్నమైంది. అది ఇప్పుడే.
- కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చే వరకు మనం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించలేం. మన శక్తిని తిరిగి కూడగట్టుకోలేం లేదా మనవడిని కౌగిలించుకోవడం, పుట్టిన రోజులు, వివాహాలు వంటి జీవితంలో అత్యంత విలువైన క్షణాన్ని ఆనందించలేం.
- ప్రచారం పేలవంగా సాగుతున్న సమయంలో ఆఫ్రికన్ – అమెరికన్ ప్రజలు నాకు మద్దతుగా నిలిచారు. అన్ని వేళలా వారు నాతో ఉంటూ వస్తున్నారు. నేనూ వారికి అండగా ఉంటాను
Review విభజించను.. ఐక్యం చేసా.