వ్యాధులు-బాధలు

అమావాస్య వల్లనే పౌర్ణమికి విలువ
అనారోగ్యం వల్లనే ఆరోగ్యానికి విలువ

ఈ వ్యాధులెందుకో? ఇన్ని అనారోగ్యాలేమిటో? రోగాలు కూడా ప్రకృతి వరప్రసాదాలేనా! అవును, నూటికి నూరుపాళ్ళు. ప్రకృతి అడగకుండా ఆరోగ్యాన్నిస్తుంది. అందుకే, అడగకుండా వ్యాధిని కూడా ఇస్తుంది. ఆరోగ్యాన్ని ఆనందంతో అనుభవించినట్లే అనారోగ్యాన్ని కూడా సంతోషంతో అంగీకరించాలి. ఎందుకంటే., జబ్బు కూడా తప్పించుకోవడం కుదరని జీవితావసరం. అనారోగ్యం కలిగినపుడు, నేనేం పాపం చేశానో అని బాధపడుతుంటాం. కానీ ఇప్పటిదాకా నేను అనుభవిస్తున్న ఆరోగ్యభాగ్యాన్ని పొందటానికి నేను చేసిన పుణ్యమేమిటని ప్రశ్నించుకోం.
మన జీవితం చావుపుట్టుకల ద్వంద్వాల మధ్య ఉండే రహదారి ప్రయాణం. కాబట్టి మన జీవన ప్రయాణంలో ప్రతి అడుగునా ద్వంద్వాలుంటాయి. మంచీ-చెడు, చావు-పుట్టుక, పగలు-రాత్రి ఇలాంటి ద్వంద్వాలన్నీ మనకు అవసరమే. సరిగ్గా అర్థం చేసుకుంటే మనల్ని ఆనందమయం చేసేవే.
అనారోగ్యం అసహజమైనదని అనుకుంటాం. ఆరోగ్యం, వ్యాధి, రెండినీ పక్కన నిలబెడితే ఆరోగ్యమే కోరతాం. ప్రకృతికి ఇలా తేడాగా చూడటం అసాధ్యం. రెండు శిఖరాలు కావాలని మీరు దేవుణ్ణి కోరితే, మధ్యలో లోయ లేకుండా శిఖరాలివ్వగలడా? రెండు సూర్యోదయాల నడుమ అస్తమయం ఉండదా? లోయ శిఖరానికి దారి చూపుతుందే కాని, శిఖరం శిరస్సును ఖండించదు. రాత్రి పగటిని ప్రసవిస్తుంది. వేసవి వర్షశిశువును ప్రసాదిస్తుంది. ద్వంద్వాలను వదలి దూరంగా పరుగెత్తక ద్వంద్వాలు విసిరే దుఃఖాల వలను తప్పించుకుని, సంతోష సాగరంలో తేలుతూ, వనమాలి కౌగిలిలో కృతజ్ఞతతో కరిగిపోవాలి.
రెండు పుట్టినరోజు కొవ్వొత్తుల జ్యోతుల మధ్యన ఒక అంతిమ సంస్కారజ్వాల తప్పదు. రెండు చిరునవ్వుల విరామంలో కన్నీటిచుక్క అనివార్యం. రెండు ఆరోగ్యపు రహదారుల సంధిలో అనారోగ్యం అత్యంత సహజం. నీ వ్యాధి రోగక్రిముల ఆరోగ్యం. ఈ బ్రహ్మాండమండలంలో నీవు ఒక భాగానివి. ఏ ఇతర వ్యక్తి నుండి, జీవి నుండి ప్రత్యేకంగా విడిగా లేవు. అన్ని ప్రాణులకు అధికుణ్ణి అనే భ్రమలో మనిషి ఉన్నాడు. నీ ఆరోగ్యం పట్ల ప్రకృతి ఎంత శ్రద్ధ వహిస్తుందో.. రోగక్రిముల ఆరోగ్యం పట్ల కూడా అంతే శ్రద్ధ తీసుకుంటుంది. ఇది సృష్టి సమదృష్టి ఈ రకమైన అవగాహన లేనందువలన ఆరోగ్యాన్ని సహజస్థితిగానూ, వ్యాధిని అసహజస్థితిగానూ పొరబడతాం. కానీ రెండూ సమాన ప్రాముఖ్యత కలిగినవే.
నిజానికి, నిర్మూలించవలసిన అసలైన వ్యాధి ‘‘మృత్యుభయం’’. చావు పేరు వింటేనే ఎందరో భయపడతారు. మరణం జీవితానికి గొప్పవరం. మృత్యువు కారణంగానే జీవితాన్ని ప్రేమించగలుగుతున్నాం. మరణమంటే కాదు ‘అంతం’. మరణముంటేనే ఆద్యంతం జీవితం ‘రసవంతం’. మృత్యువు ‘బూచి’ కాదు, దివ్య ప్రయాణపు ‘దిక్సూచి’. చావును ‘మృత్యుకూపం’గా భావించకండి. అది అనంత జీవనసాగరంలో అందమైన ‘మణిద్వీపం’. జీవచైతన్యపు గమనానికి మృత్యువు కాదు ‘ముగింపు’, ఒక వయ్యారపు ‘వంపు’. మరణం లేకపోతే జీవితం నిస్సారం. జీవితానికి విలువనిచ్చి, ప్రతిక్షణాన్నీ అమూల్యం చేసిన అద్భుతమైన ఆభరణం మరణం. తిరిగి శిశువుగా పుట్టి, మళ్లీ మమతల మాధుర్యాన్ని పొందటానికి మహత్తరమైన అవకాశం మరణం. మృత్యువును సరిగ్గా అవగాహన చేసుకోండి, చనిపోయి, అమరత్వాన్ని కౌగలించుకుని ముద్దాడుతున్న వారిని తలచుకుంటే చాలు, ఎంత అసూయ కలుగుతుందో! జీవితాన్ని జీవితంలా జీవించగలిగితే మరణం మధురంగా ఉంటుంది. మరులు గొలుపుతుంది.
దారుణంగా శరీరంలో మేకులు దించబడి, భయంకర హింసకు గురికాబడి, శిలువ వేయబడిన క్రీస్తు దుర్భరక్షోభ, పునరుజ్జీవనపు శోభగా పరిణమించింది. శిలువపై మరణించిన తరువాతనే జీసస్‍ దివ్యజీవితం పొందాడు. తననుతాను శిలువకు సమర్పణ చేసుకున్నాడు. రక్తతర్పణం చేశాడు. అందుకే ఆయనకు మనల్ని మనం సమర్పణ చేసుకుంటున్నాం. మన కన్నీటితో తర్పణం విడుస్తున్నాం. కనుక, ఒక మరణం మరో పునరుజ్జీవన కారణం. భౌతికశాస్త్రవేత్త న్యూటన్‍, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త క్రీస్తు. ఇద్దరూ డిసెంబర్‍ ఇరవై అయిదునాడే జన్మించారు. ఒక వృక్షం కింద కూర్చుని, పండు నేలపై ఎందుకు పడిందని న్యూటన్‍ ప్రశ్నించుకున్నాడు. జీవన బోధివృక్షం క్రింద కూర్చుని మనిషి ఎందుకు పాపంలో పడుతున్నాడని జీసస్‍ పరిశోధించాడు.
సూర్యునికీ, గ్రహానికీ మధ్య ‘గురుత్వాకర్షణ’ ఆవిష్కరించాడు న్యూటన్‍. దేవునికీ, జీవునికీ మధ్య ‘ప్రేమాకర్షణ’ అనుసంధించాడు జీసస్‍. తన రక్తకణాలను ఇటుకలుగా పేర్చి పుణ్యానికి సేతువును నిర్మించాడు క్రీస్తు. మానవాళి పట్ల ఉన్న ప్రేమ, అతని పునరుజ్జీవనానికి హేతువయింది. కన్నీరు-పన్నీరు, కష్టం-సుఖం, శిలువ-పునరుజ్జీవనం ఇవన్నీ దైవం అనే మారుపేరు గల ‘ప్రేమ’ యొక్క హృదయ స్పందనలు. దివ్యసంగీతపు శృతిలయలు.
కేశవుని ఉనికి, క్లేశాలలోనే గాఢంగా, నిగూఢంగా ప్రకటితమవుతుంది. పరిష్కారంలో పలచనైపోతుంది. జబ్బు పడినప్పుడు రోదిస్తూ కూర్చోకుండా, ఆరోగ్యపు విలువను గుర్తించడంలో విజ్ఞత ఉంది. తిరిగి వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త వహించడంలోనే ప్రజ్ఞ ఉంది. ద్వంద్వాల ఊయలలో కూర్చుని ఉల్లాసంగా ఊగుతూ, ద్వంద్వాతీత రాధికామానసవిహారిని స్మరించటమే నిజమైన ధ్యానం. అదే నిజమైన జీవనధ్యేయం.

Review వ్యాధులు-బాధలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top