మాయలో పుట్టిన ఒక శిశువు పూర్వజన్మ వాసనలు వీడక తాను పెరుగుతున్న కొద్దీ తనలో తాను ఆధ్యాత్మిక ధోరణితో ఆలోచిస్తూ, యుక్త వయసులో కూడా తన బాధ్యత గ్రహించక ఆధ్యాత్మిక చింతనలోనే గడపసాగాడు. ఇది గమనించిన అతని తల్లిదండ్రులు
ఆ పిల్లవాడికి పెళ్లి చేస్తే అయినా దారిలో పడతాడని సన్నాహాలు చేయసాగారు. అది గమనించిన ఆ యువకుడు ఒక ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్న గురువు గారికి ఇలా అడిగాడట.
‘గురువు గారూ! నాకు మంత్రోపదేశం చెయ్యండి’.
ఇంకా అతను గురువు గారితో ఇలా అన్నాడు.
‘నాకు ఈ సంసారం, ఈతిబాధలు వద్దు. వాటిని నేను పడలేను. నేను ఎందరి జీవితాలనో చూస్తున్నాను. వారి బాధలు ప్రత్యక్షంగా గమ నించాను. ఆ బాధలను అధిగమించేందుకు వారు చేసే ప్రయత్నాలు, అందుకు వారనుభవిస్తున్న క్షోభ నేను గమనించాను. కాబట్టి తెలిసి తెలిసీ నేను సంసారం అనే ఊబిలోకి ఎలా దిగను? దయచేసి నాకు తగిన తరుణోపాయం సూచించండి. నన్ను బంధ విముక్తుడిని చేసి ముక్తిని ప్రసాదించండి’ అని గురువు గారి పాదాలపై భక్తితో ప్రణమిల్లాడు.
ఆ యువకుడి మాటలు విన్న గురువు గారు అతనిపై మంత్రించిన జలాన్ని చల్లి ఇలా అన్నారు.
‘చూడు నాయనా! నీవు బంధవిముక్తుడవు కావాలన్నా, నువ్వు పరమేశ్వరుడి అనుగ్రహం పొంది మోక్షం పొందాలన్నా నీ మనసుకు స్థిరత్వం ఉండాలి. అందుకు భక్తి ఒక్కటే సరైన మార్గం. అటువంటి భక్తి నీలో జనించాలంటే దానిపై నీకు గురి కుదరాలి. అటువంటి గురి నీకు సాధ్యపడా లంటే అందుకు నువ్వు ఎంతో సాధన చేయాల్సి ఉంటుంది. ఇదంతా నీకు అనుభవంలోకి రావాలంటే సంసారం ఒక్కటే సరైన మార్గం’.
గురువు గారు చెప్పింది విన్న శిష్యుడు ఆశ్చర్యపోయాడు. ఆపై ఇలా అన్నాడు-
‘అదేమిటి గురువు గారూ! సంసారం ఒక చిక్కుముడి అనీ, దానిలో పడితే ముక్తి, మోక్షం కలగవని ఎందరో అడవులకు వెళ్లి తపాలు ఆచరిస్తుంటే మీరు నన్ను సంసారం చేయమంటున్నారేమిటి?’ అని ప్రశ్నించాడు.
అందుకు గురువు గారు-
‘అదెలాగో చెబుతాను విను. నువ్వు బాధలు, బాధ్యతలు లేని జీవితం నుంచి తప్పించుకోకూడదు. సంసారం అతిపెద్ద జీవిత సాగరం. ఇందులో మొదటగా తల్లిదండ్రులు, తరువాత అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, ఆ తరువాత భార్యాపిల్లలు, ఆ తరువాత మనవళ్లూ, మనవరాళ్లూ.. ఇలా ఎన్నో బంధాలు అల్లుకుని వాటిని సరైన మార్గంలో నడిపించడానికి నీవు పడే బాధల వలన సమస్యలతో రాజీ పడుతూ, ఒక్కో కోరికనూ నీలో నువ్వు చంపుకుంటూ నీ ముందు వారు ఒక్కొక్కరుగా దూరమైపోతున్న వేళ, వారిపై నీకు గల ప్రేమను చంపుకుంటూ, నీ పిల్లలకు పెళ్లిళ్లు చేసి వారి కాపురాలను వారు సరిదిద్దుకునే వేళ, నిన్ను మరిచి వారు దూరమవుతూ, ఎన్నో సమస్యలతో నీవు అలసి, సొలసి, విసిగి వేసారి పోయిన వేళ.. ఇక ఇక్కడ ఏదీ నాకు శాశ్వతం కాదని తెలిసివస్తుంది. నీలోని కోరికలు, వాంఛలు అన్నీ నశించిపోతాయి. అప్పుడు నువ్వు దేవుడే దిక్కు అని పరిపూర్ణమైన భక్తితో, పూర్తి ఏకాగ్రతతో ఆరాధిస్తావు. అప్పుడు నిజానిజాలేమిటో నీకు తెలిసివస్తాయి. అటువంటి సమయంలో నువ్వు సంపూర్ణమైన భక్తితో భగవంతుడిని ప్రార్థిస్తావు. అప్పుడు కలిగేదే నీకు ముక్తి, మోక్షం’ అని గురువు గారు అతనికి వివరించారు.
సంసారం అనేది వదిలేసి పోవాల్సింది కాదు. సరైన మోక్షం పొందాలంటే సంసారమే చక్కని మార్గం. ఒక్క సంసారి వంద మంది సన్యాసులతో సమానమని సామెత. అది నిజమే. సంసారంలో కలిగే ఈతిబాధలు, రాగద్వేషాలు, కష్టనష్టాలే మనల్ని భవసాగరం ఈదేలా చేస్తాయి. వైరాగ్యాన్ని కలిగిస్తాయి. ఆ వైరాగ్య భావన నుంచే భగవంతుని కోసం అన్వేషణ మొదలవుతుంది. మనసు పరిపక్వత సాధించడంలో సంసారం అనుభవాల మార్గదర్శిగా ఉపయోగపడుతుంది. సంసారం నిజమైన భవబంధాలు కలిగిన సాగరం. దీనిని సమర్థవంతంగా ఈదగలిగిన వారికి మోక్షం దానంతట అదే లభిస్తుంది.
Review సంసారం భవసాగరం.