సామెత కథ

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం..

అన్నవస్త్రాల కోసం పోతే
ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట
లేని దాని కోసం కక్కుర్తి పడితే ఈ సామెతను ప్రయోగిస్తుంటారు. ఒక జంట పక్క ఊరు వెళ్లేందుకు బట్టలు సర్దుకుని ప్రయాణం అవుతుంది. దారిలో మరో జంట వీరిని కలుస్తుంది.
‘ఇప్పుడే వస్తాం. మా సామాను చూస్తుండండి’ అని చెప్పిన రెండో జంట.. పాత బట్టలు ధరించి, కొత్త బట్టలు మూటగట్టి ఆ మూటను చూస్తూ ఉండాలని చెప్పి వెళ్లిపోతుంది.
అలా వెళ్లిన రెండో జంట కొత్త బట్టలు తీసుకుని వస్తారు.
ఇది చూసి ఆశ్చర్యపోయిన మొదటి జంట ‘విషయం ఏమిటి?’ అని రెండో జంటను అడుగుతుంది.
‘ఫలానా జమీందారు పేద వారికి అన్న వస్త్రాలు దానం చేస్తున్నాడు. అందుకనే మేం కొత్త బట్టలు విడిచి, పాత బట్టలు కట్టుకుని పేదవారిలా వెళ్లి అతను ఇచ్చిన కొత్త బట్టలు తెచ్చుకున్నాం’ అని చెబుతుంది రెండో జంట. దీంతో మొదటి జంటకు మనసులో ఆశ పుడుతుంది. ఒంటికి ధరించిన మంచి బట్టలను విడిచి, వాటిని మూటకట్టి రెండో జంటను చూస్తుండమని చెప్పి, తాము పాత బట్టలు ధరించి జమీందారు వద్దకు బయల్దేరుతారు.
తీరా వెళ్లేసరికి అక్కడ జమీందారూ ఉండడు. కొత్త బట్టలూ ఉండవు. ఊసురోమంటూ మొదటి జంట తిరిగి వస్తుంది.
అక్కడకు వచ్చి చూసే సరికి తమ బట్టల మూటా ఉండదు. తమకు పరిచయమైన జంటా ఉండదు. వాళ్ల మంచి బట్టలు తీసుకుని ఆ జంట ఎప్పుడో ఉడాయించిందన్న మాట. లాభం కలుగుతుందని ఆశపడి వెళ్తే అనుకున్న లాభం జరగకపోగా, మరింత నష్టం కలిగిన సందర్భాలలో ఈ సామెతను వాడుతుంటారు.
ఒక వ్యక్తి దారిద్య్రంతో బాధపడుతూ తనకు కావాల్సిన అన్నం, వస్త్రాలు ఎవరో దానం చేస్తానంటే వెళ్లాడట. కానీ, అక్కడి పరిస్థితి మారిపోయి ఆ ప్రదేశంలో ఎదురైన కొంతమంది అతని ఒంటికి ఉన్న వస్త్రాన్ని కూడా లాక్కున్నారట. ఇది కూడా ఈ సామెతకు మరో కథగా చెబుతారు.
లాభం వస్తుందనుకున్నప్పుడు ఆశించిన లాభం రాకపోగా అనుకోని నష్టం ప్రాప్తించడాన్ని ఈ సామెతతో పోలుస్తారు.
ఉన్నదాంతో తృప్తి పడాలి తప్ప, లేనిపోని ఆశలకు పోరాదనే సత్యాన్ని ఈ సామెత చాటుతుంది.

తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక.. మన తెలుగు పత్రిక
చదవండి. మీ ఇంట ‘తెలుగు పత్రిక’ ఉంటే.. ఆ ఇల్లు ఆనందాల పూదోటే. చదివించండి..

Review సామెత కథ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top