తెలుగు నాట చాలా ప్రాచీనమైన లక్ష్మీదేవి ఆలయాలు ఉన్నాయి. అయితే, వీటి గురించి చాలా మందికి తెలియదు. అటువంటి ఆలయాల పరిచయం..
• వేములవాడలో మహాలక్ష్మీ దేవాలయం ఉంది. మధ్యయుగం ఆరంభంలో గుజరాత్, రాజస్తాన్ (అప్పట్లో ఈ రెండు ప్రాంతాలను కలిపి ఘూర్జర దేశంగా వ్యవహరించేవారు) నుంచి వచ్చిన జైన సాధువు ఈ ఆలయాన్ని నెలకొల్పాడు. ఇప్పటికీ బౌద్ధులు, జైనులు ఈ ఆలయాన్ని పెద్దసంఖ్యలో సందర్శిస్తుంటారు.
• నేటి మంథని నాడు మంత్రపురి. కాకతీయుల కాలం నాటి ఇక్కడి మహాలక్ష్మీ ఆలయం చాలా ప్రసిద్ధి. మంథనిలో మూడు మహాలక్ష్మీ ఆలయాలు ఉన్నాయి. అన్నీ ప్రాచీనమైనవే.
• బాసర సరస్వతీ క్షేత్రంగానే అంతా భావిస్తారు. అయితే, ఆలయ ప్రధాన గర్భగుడిలో సరస్వతితో పాటు లక్ష్మీదేవి కూడా ప్రధాన దేవతగా ఇక్కడ దర్శనమిస్తుంది.
• అతి ప్రాచీన లక్ష్మీనారాయణుల ఆలయం ఒకటి మంచిర్యాలలో ఉంది. ఇది చాళుక్యుల కాలానికి చెందినది కాగా, కాకతీయులు దీనిని పునర్నిర్మించారు.
• ధర్మపురిలో కూడా ఎన్నో ప్రత్యేక లక్ష్మీ ఆలయాలు ఉన్నాయి.
• నారాయణపేటలోని లోకాయపల్లిలో కుతుబ్‍షాహీల కాలంలో మరాఠీహ వంశానికి చెందిన చండీరాణి ఇక్కడ లక్ష్మీదేవి ఆలయాన్ని, కోనేటిని నిర్మించారు.
• చెన్నూరులో లక్ష్మీనారాయణ ఆలయం కూడా ప్రసిద్ధి చెందినది.
• హనుమకొండ నడిబొడ్డున సిద్ధులగుట్టపై సిద్ధిభైరవ ఆలయంలోనే ఆయన చెల్లెలుగా ధనలక్ష్మీ దేవి వెలిశారు.
• వరంగల్ నగరంలో కాకతీయుల కాలం నాటి గోపాలస్వామి గుడిలో గల ఉపాలయంలో ధైర్యలక్ష్మీదేవి కొలువైంది.
• కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో గ్రామ దేవతగా ఎక్కువగా లక్ష్మీ ఆలయాలే ఉంటాయి. అందుకే కరీంనగర్‍ను సిరుల నేల అని అంటారు. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలోని చాలా ఊళ్లకు సిరిసిల్ల, సిరివంచ, సిరిపురం, సిరికొండ అనే పేర్లు వచ్చాయి.
మంచికి ప్రతిరూపం మండోదరి
రామాయణంలోని కొన్ని పాత్రలు మానవత్వాన్ని మరిచిపోయి వ్రవర్తిస్తే మరికొన్ని పాత్రలు దానవ కులానికి చెందినప్పటికీ మానవత్వానికి ప్రతీకలై నిలిచాయి. అటువంటి పాత్రల్లో విశిష్టమైనది- మండోదరి. ఈమె లంకాధీశుడైన రావణాసురుడి భార్య. మిక్కిలి సౌందర్యవతి. కేవలం బాహ్య సౌందర్యరాశి మాత్రమే కాదు.. ఆమె అంత:సౌందర్యం అంచనాలకు అందనిది. నీతిని, ధర్మాన్ని, కర్తవ్యాన్ని ప్రబోధించగల మనస్తత్వం గలది మండోదరి. ఈమె విశ్వకర్మ కుమారుడైన మయబ్రహ్మ కుమార్తె. మండోదరి అంటే ‘మండనం యస్యస ఉదరం’.. అంటే సన్నని నడుము గలది అని అర్థం. తెలుగులో మండోదరి అంటే భూమి వంటి పొట్టగలది అని భావం. భూమి వంటి ఉదరము అంటే సంతాన సాఫల్యత గల ఉదరము అని అర్థం. అహల్య, తార, సీత, ద్రౌపది, మండోదరి.. వీరు ఐదుగురు పంచకన్యలుగా ప్రసిద్ధి చెందారు. విచిత్రంగా వీరంతా ఏదో విధంగా తమ భర్తలతో సంబంధాలు చెడిన వారే. కానీ తమ సంతానాన్ని మాత్రం భారతీయ సంప్రదాయంలో స్థిరస్థాయిగా నిలిచిపోయే స్థాయిలో పెంచారు. భర్త రావణాసురుడి అరాచకాలను మండోదరి ఎప్పటికప్పుడు సుతిమెత్తగా ఎత్తిచూపుతూనే ఉన్నంతలో కుమారులకు మంచి బుద్ధులు నేర్పడానికి ప్రయత్నించింది. ఈమె కుమారుడు ఇంద్రజిత్తు. తల్లిగా అతడిని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించినా.. తండ్రి మాటలు విని పెడదారి పట్టిన వాడు ఇంద్రజిత్తు. ఒకసారి మండోదరి వల్ల జన్మించిన సంతానంతో తనకు ప్రాణహాని ఉందని రావణుడికి తెలుస్తుంది. ఒకరోజు మండోదరి నీళ్లనుకుని కుండలోని రక్తాన్ని తాగుతుంది. అది రావణుడు వధించిన రుషుల రుధిరం. ఆ కారణంగా ఆమె గర్భం దాల్చి కుమార్తెకు జన్మనిస్తుంది. అయితే, జోస్యం కారణంగా తన భర్త బిడ్డను బతకనివ్వడని పెట్టెలో పెట్టి శిశువును సముద్రంలో విడుస్తుంది. అది జనకుడికి చేరుతుంది. ఆ పెట్టెలోని శిశువే సీత. ఆమే రావణుడి వినాశనానికి కారణమైంది.
Review సిరిదేవతల నేల.