ఈ శివుడు.. రోగనాశకుడు

సాక్షాత్తూ శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఆ లింగాన్ని తాకితే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నంత పుణ్యమట. అంతేకాదు ఇక్కడి శివుడిని రోగనాశకుడిగానూ కొలుస్తారు. అక్కడి వేడినీళ్ల కుంటలో స్నానం చేస్తే శరీరం ఆరోగ్యవంతం అవుతుందట. ఆ సుప్రసిద్ధ క్షేత్రమే తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్రలో గల ఉన్కేశ్వర్‍ ఆలయం.

శ్రీరాముడు వనవాస కాలంలో ఉన్కేశ్వర్‍ ప్రాంతంలో సీతా సమేతంగా నివాసం ఉన్నాడట. ఆ సమయంలోనే భక్తుడి వ్యాధుల్ని నయం చేసేందుకు ఆయనే ఈ క్షేత్రాన్ని సృష్టించాడట. తన భక్తుడి మీద అపార కరుణా వాత్సల్యాలు కలిగి ఉండే దశరథనందనుడు ప్రతిష్ఠించిన ఈ ఆలయంలోని శివుడూ విశేష మహిమాన్వితుడే. అందుకే నాటి త్రేతాయుగం నుంచి నేటి వరకూ భక్తులు అక్కడికి బారులు తీరుతున్నారు. ఉన్కేశ్వర్‍ శివాలయం మహారాష్ట్రలోని నాందేడ్‍ జిల్లా కిన్వట్‍ తాలూకా మాండ్వి దండకారణ్యం పరిసరాల్లో ఉంది. ఇది మహారాష్ట్ర.. మన తెలంగాణలోని ఆదిలాబాద్‍ సరిహద్దులో ఉన్న దేవాలయం. ఇక్కడ భక్తులకు ఉచిత ప్రకృతి వైద్యమూ అందిస్తుండటం విశేషం.
ఉన్కేశ్వర్‍ దండకారణ్యంలో శ్రీరాముడు కాలుమోపడంతో పరిసర ప్రాంతమంతా పవిత్రమైందని చెబుతారు. వాల్మీకి రామాయణంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. పూర్వం శర్భంగుడు అనే రుషి ఇక్కడి పరిసరాల్లోని దట్టమైన అరణ్యంలో రామజపం చేస్తుండేవాడట. అతనికి చర్మవ్యాధులు సోకడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయినా క్షణం విరామం లేకుండా రామనామాన్ని స్మరిస్తూనే ఉండటాన్ని రాముడు గ్రహించాడట. అందుకే ఆయన వనవాస కాలంలో ఉన్కేశ్వర్‍ దండకారణ్యంలోకి వచ్చి శర్భంగుడిని కలవాలని అనుకున్నాడట. అయితే రాముడిని దర్శించుకోవడానికి శర్భంగుడు తన రూపాన్ని అడ్డంకిగా భావించాడు. ఈ విషయాన్ని లక్ష్మణుడు పసిగట్టాడు. ఇది తెలిసి చలించిపోయిన రాముడు ఉన్కేశ్వర్‍ వైపు రెండు బాణాలు సంధించాడట. అందులో ఒకటి వ్యాధులను మటుమాయం చేసే సరోవర స్థాపనకు, మరొకటి మహా శివలింగ ప్రతిష్ఠాపనకు కారణమయ్యాయి. అనంతరం శర్భంగ రుషికి దర్శనమిచ్చిన రాముడు తొలుత వేడినీటి సరోవరంలో స్నానమాచరించి, మహా శివలింగాన్ని పూజించాలని చెప్పాడట. అలాచేసిన రుషికి చర్మవ్యాధులన్నీ మటుమాయం అయ్యాయట. అనంతరం అటవీ పరిసరాల్లోని ఎందరికో ప్రకృతి వైద్యాన్ని అందించిన శర్భంగుడు అక్కడే జీవసమాధి అయ్యాడట. ప్రస్తుతం ఉన్న దేవాలయాన్ని ఆయన సమాధి దగ్గరే నిర్మించారట.
18వ శతాబ్దంలో మాల్వ రాజ్యాన్ని ఏలిన అహల్యాబాయి సాహిబా హోల్కర్‍ తన హయాంలో దేశవ్యాప్తంగా ప్రజల సౌకర్యార్థం నీటికుంటూ, బావులూ, పుష్కరఘాట్లూ, విశ్రాంతి భవనాలతో పాటు దేవాలయాలనూ నిర్మించారు. వీటితో పాటు దేవతలు కొలువైన కాశి, గయ, అయోధ్య, ద్వారక, మధుర, జగన్నాథపురి తదితర చోట్ల పలు ఆలయాల నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగానే ఆమె ఉన్కేశ్వర్‍ ఆలయాన్ని నిర్మించారట.
ఇక్కడ శైవ సంప్రదాయం ప్రకారం నిత్య పూజలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో హారతితో పూజ మొదలవుతుంది. అనంతరం గాయత్రి మంత్రజపంతో ఆలయం మార్మోగుతుంది. రోజూ భజనలు జరుగుతాయి. ఈ ఆలయంలో దత్తాత్రేయుడి ప్రతిమా ఉంది. మహా శివరాత్రి, దత్త జయంతి, రామనవమి, వినాయక చవితి పండుగలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మహా శివరాత్రి, దత్త జయంతిలకు జాతర కూడా చేస్తారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడం వల్ల మరాఠీలతో పాటు తెలుగు వారు పెద్దసంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
నాందేడ్‍ నుంచి 124 కి.మీ., ఆదిలాబాద్‍ నుంచి 56 కి.మీ. దూరంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడకు వెళ్లడానికి బస్సు, రైలు సౌకర్యాలున్నాయి. ఆదిలాబాద్‍ నుంచి ఉదయం పూట నిరంతరం బస్సులు, ఇతర వాహనాలూ తిరుగుతుంటాయి. మాహోర్‍ వెళ్లే ప్రతి బస్సూ ఉన్కేశ్వర్‍ మీదుగానే వెళ్తుంది. నాందేడ్‍ నుంచి గంట గంటకూ బస్సులు ఉంటాయి.

Review ఈ శివుడు.. రోగనాశకుడు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top