
శ్రీగర్గ భాగవతంలోని కథ.
ఒకనాడు ముద్దుకృష్ణుడిని ఒడిలో కూర్చుండబెట్టుకుని ఆడిస్తోంది మహాభాగ్యశాలి అయిన యశోదాదేవి. అప్పుడు తృణావర్తుడనే రాక్షసుడు పెద్ద సుడిగాలి రూపంలో అక్కడకు వచ్చి చుట్టుముట్టాడు. ఉన్నట్టుండి కొండంత బరువెక్కిన చిన్ని కృష్ణుడి భారం భరించలేక యశోద అతడిని నేలపైకి దించింది. జంతువులు, ప్రజలు, ఇంటి పై కప్పులు సైతం ఆ పెనుగాలికి ఎగిరిపోసాగాయి. ధూళి రేగగా, శ్రీకృష్ణుడు యశోదకు, గోపికలకు కనిపించలేదు. ఆందోళనతో వారు ఆ పరమాత్ముని కోసం వెదకసాగారు.
చిన్నికృష్ణుడు తృణావర్తుని వెంట మింటికెగసి, అతడి వీపుపైకి ఎక్కాడు. అండపిండబ్రహ్మాండాదులను తన బొజ్జలో దాచుకుని ఉన్న స్వామి భారాన్ని మోయలేక తృణావర్తుడు కృష్ణుడిని కిందికి విసిరికొట్టబోయాడు. అంతలోనే పాపం పండిన ఆ దానవుడి గొంతు నులిమి శ్రీకృష్ణుడు భూభారాన్ని తగ్గించాడు.
ఇంతకీ తృణావర్తుడు ఎవరు?
పూర్వం పాడు దేశాన్ని సహస్రాక్షుడనే మహారాజు పరిపాలిస్తుండే వాడు. చాలా జనరంజకంగా పరిపాలిస్తుండే వాడు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆదుకునే వాడు. అయితేనేం.. ఎంత మంచివాడని పేరున్నా, ఆయన మిక్కిలి భగవద్భక్తుడే అయినా అతనికి ఓ దుర్వ్యసనం ఉంది. సహస్రాక్షుడు మిక్కిలి స్త్రీలోలుడు. ఎవడైతే వ్యసనాలకు దూరంగా ఉంటాడో వాడే ధర్మమార్గాన నడవగలడు. కామాంధుడైన ఆ సహస్రాక్షుడు ఒకనాడు దూర్వాస మహర్షి వచ్చాడని తెలిసి కూడా ఆయనకు నమస్కరించలేదు. వ్యసరపరుడై, పూజ్య పూజావ్యతిక్రమ దోషం చేసిన సహస్రాక్షుడిని రాక్షసుడివి కావాలని దూర్వాస మహర్షి శపించాడు. తన తప్పు తెలుసుకుని సహస్రాక్షుడు దూర్వాస మహర్షిని శరణువేడాడు.
దీంతో మహర్షి మహారాజును మన్నించాడు.
‘రాజా! ఈ దుష్కార్యమునకు ఫలితం అనుభవించక తప్పదు. చేసిన కర్మ చెడని పదార్థము కదా! కానీ భక్తుడవైన నీకు పరమాత్ముడైన శ్రీకృష్ణుడి పాదస్పర్శతో కైవల్యం ప్రాప్తిస్తుంది’ అని దూర్వాసుడు సహస్రాక్షుడికి తరుణోపాయం ఉపదేశించాడు.
అలా, సహస్రాక్షుడు మరుసటి జన్మలో తృణావర్తునిగా జన్మించి, సుడిగాలి రూపంలో గోకులాన్ని చుట్టిముట్టి, చివరకు కృష్ణుడి చేతిలో కైవల్యం పొందాడు.
ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే.. మనిషి అన్ని వ్యసనాలను నుంచి ఎల్లవేళలా దూరంగా ఉండాలి. పరమ భక్తుడైనా, రాజుగా ధర్మ పరిపాలనతో మంచి పేరు తెచ్చుకున్నా.. కేవలం స్త్రీ లోలత్వం అనే ఒక్క చెడ్డ గుణం వల్ల సహస్రాక్షుడి పుణ్యమంతా చెడింది. మహర్షి రాకను గుర్తించి కూడా, తన లోలత్వంలో మునిగిపోయాడు. ఇది అతని వ్యసనాల ప్రభావం వల్ల కనుమరుగైపోయిన అతని మంచితనానికి, ఉచితానుచితాలను కోల్పోయిన ఫలితం. పైగా దారుణమైన శాపానికి గురయ్యాడు. కాబట్టి ఏ సమయంలోనూ వ్యసనాల బారిన పడకూడదు. పెద్దలను గౌరవించాలి.
Review తృణావర్తుడు.