దాన మహిమ

పూర్వం ఒక రాజ్యంలో ఓ జూదరి ఉండేవాడు. అతడికి జూదం ఆడటం తప్ప మరో వ్యాపకమంటూ లేదు. చివరకు ఆ వ్యసనాన్నే వృత్తిగా మార్చుకుని జీవితాన్ని గడిపేస్తుండే వాడు. పైగా దేవతలను, బ్రాహ్మణులను నిత్యం నిందిస్తూ ఉండేవాడు. జూదమే కాదు.. లోకంలోని చెడు వ్యసనాలన్నిటికీ అలవాటై తిరుగుతుండే వాడు.
ఇదిలా ఉండగా, ఆ జూదరి ఒకనాడు జూదంలో చాలా ధనాన్ని గెలుచుకున్నాడు. దాంతో అతడి మనసు సంతోషంతో పొంగిపోయింది. ఆ ఆనందంలో తన చేతులతో ఓ కిళ్లీ కట్టి, చందనమూ, పువ్వుల మాలల వంటివి తీసుకుని ఒక వెలయాలి ఇంటి వైపు వేగంగా నడవసాగాడు.
అలా వెళ్తూ, దారిలో కాళ్లు తడబడి కిందపడిపోయాడు. కొద్దిసేపటికి స్ప•హ కోల్పోయాడు. ఇంకొంత సమయం గడిచాక తెలివి తెచ్చుకున్నాడు. అయితే అతనిలో మునుపటి వ్యసనాల జాడలేదు. ఇంతకాలం తాను గడిపిన చెడు జీవితం, వ్యసనాల బారినపడి ఎలా వ్యర్థంగా గడిపేసిందీ గుర్తుకు వచ్చి బాధ కలిగింది. తనలో ఏదో మార్పు కలుగుతోందని గ్రహించాడు.
తాను అంతకాలం గడిపిన చెడు జీవితం గురించి అతడికి చెప్పలేనంత దిగులు కలిగింది. ఫలితంగా అతడి మనసులో వైరాగ్య బీజాలు మొలిచాయి.

చివరకు అతడి మనసులో ఒక స్పష్టత ఏర్పడింది. నిర్మలమైన మనసుతో తన చేతిలోని తాంబూలాన్ని, చందనాన్ని, పూలమాలను సమీపంలోనే ఉన్న ఒక ఆలయంలోని శివలింగానికి అర్పించి ఇంటికి తిరుగుముఖం పట్టాడు. కాలం గడిచిపోతోంది. జూదరికి అంత్యకాలం సమీపించింది. ఆ గడియ సమీపించగానే, యమదూతలు వచ్చి అతడిని యమలోకానికి తీసుకుని వెళ్లిపోయారు. భటులు జూదరిని నేరుగా యముడి ముందు ప్రవేశపెట్టారు. ‘మూర్ఖుడా! నువ్వు చేసిన పాపాలు, అనుభవించిన దుర్వ్యసనాల కారణంగా నరకంలో ఘోరమైన శిక్షలు అనుభవిస్తూ రోదించాల్సి ఉంది’ అని యముడు హూంకరించాడు.జూదరి ఆ మాటలతో గజగజ వణికిపోయాడు. లేని ధైర్యం కూడగట్టుకుని యమధర్మరాజుతో ఇలా అన్నాడు-
‘ప్రభూ! నేను వ్యసనాల పాలై పాపాలు చేసిన మాట నిజమే కావచ్చు. కానీ, తెలిసో తెలియకో ఏదైనా పుణ్యం కూడా కాసింత చేసి ఉండవచ్చు కదా! దయచేసి ఆ పుణ్యకర్మ ఫలాన్ని కూడా పరిగణించి నా విషయంలో తీర్పు ఇవ్వండి’ అని ప్రార్థించాడు. యమధర్మరాజు ఏం చేద్దాం అన్నట్టు చిత్రగుప్తుడి వైపు చూశాడు.
‘ప్రభూ! ఇతగాడు మరణించడానికి కొద్దిరోజుల ముందు కొద్దిగా చందనాన్ని, పూలమాలను శివలింగానికి అర్పించాడు. దాని ఫలితంగా అతడు మూడు గడియల కాలం స్వర్గ సింహాసనం అధిష్టించడానికి అర్హత కలిగి ఉన్నాడు’ అని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పాడు. ఈ మాటలతో జూదరికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్టయింది. వెంటనే యముడితో-
‘యమధర్మరాజా! అలా అయితే, మొదట స్వర్గంలో నేను అనుభవించవలసిన వాటిని అనుభవించడానికి అనుమతి ఇవ్వండి. ఆ తరువాత నరకంలో పడవలసిన బాధలన్నీ పడతాను’ అన్నాడు.
యమధర్మరాజు సరేనన్నాడు.

ఆయన ఆదేశానుసారం యమభటులు అతడిని అక్కడి నుంచి స్వర్గలోకానికి పంపించి వేశారు.
జూదరి తన పుణ్యఫలం ప్రభావంతో స్వర్గ లోకాధిపతి అయిన దేవేంద్రుడు, ఆయన దేవ గురువైన బృహస్పతి ముందు నిలుచున్నాడు.
ఇంద్రుడు ఏమిటి సంగతి? అన్నట్టు జూదరి వైపు చూశాడు.

‘ఇంద్రా! ఇతడు జూదరి. అయితే చివరి రోజుల్లో కొద్దిగా పుణ్యం చేశాడు. దాని ఫలితంగా మూడు గడియల పాటు స్వర్గ సింహాసనాన్ని అధిష్టించే అర్హత పొందాడు. కాబట్టి మూడు గడియల కాలం పాటు అతడికి నీ సింహాసనాన్ని అప్పగించు’ అని చెప్పాడు బృహస్పతి ఇంద్రుడితో. సింహాసనాన్ని ఆ కొద్ది కాలం పాటు వదులుకోవడానికి కూడా ఇంద్రుడికి మనస్కరించలేదు. ఒక జూదరికి తన సింహాసనాన్ని అప్పగించడమా? అనే ఆలోచనలో పడ్డాడు. ఆయన ఆలోచనను గ్రహించిన గురువు బృహస్పతి ఇంద్రుడిని ఒప్పించి, నియమాల ప్రకారం అతడికి సింహాసనాన్ని అప్పగించాల్సిందేనని సూచించాడు. ఆ మూడు గడియల కాలం ముగిసిపోగానే యథావిధిగా తిరిగి నీ సింహాసనాన్ని నువ్వు అధిష్టించవచ్చని చెప్పాడు.
ఇంద్రుడు సరేనన్నాడు. ఇంద్రుడు సింహాసనం నుంచి దిగగానే, జూదరి దేవలోకానికి అధిపతి అయ్యాడు. అతడి చేతిలో మూడు గడియల కాలం మాత్రమే ఉంది. ఆ మూడు గడియల కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా? అని ఆ జూదరి ఆలోచనలో పడ్డాడు.‘మహా శివుడు తప్ప నాకు మరో శరణ్యం లేదు’ అనుకున్న జూదరి మనసులో ఒక సంకల్పానికి వచ్చాడు. వస్తువులు, పదార్థాల పట్ల గల మునుపటి ఆసక్తి అతడిలో పూర్తిగా నశించిపోయింది. వెంటనే తన దేవలోకాధిపతిగా తన ఆధిపత్యంలో ఉన్న వస్తువులు అన్నిటినీ ఒక్కొక్కటిగా దానం చేసేయడం మొదలుపెట్టాడు. శివభక్తుడైన ఆ జూదరి మొదట సుప్రసిద్ధిమైన దేవేంద్రుడి వాహనమైన ఐరావతమనే గజరాజును అగస్త్య మహామునికి దానంగా ఇచ్చేశాడు. ఉచ్ఛైశ్రవమనే శ్రేష్టమైన అశ్వాన్ని (గుర్రం) విశ్వామిత్ర మహర్షికి సమర్పించాడు. కామధేనువును వశిష్ట మహర్షికి అప్పగించాడు.
చింతామణి అనే అమూల్యమైన రత్నాన్ని గాలవ మహర్షికి దానం ఇచ్చాడు.

కల్పవృక్షాన్ని పెకలించి కౌండిన్య మహర్షికి అర్పించాడు. ఈ విధంగా జూదరి తన మూడు గడియల కాలం అయ్యేదాకా దానాలు చేస్తూనే ఉన్నాడు. చివరకు స్వర్గంలోని అమూల్యమైన వస్తువులు అన్నిటినీ అందరికీ దానం చేసేశాడు.
ఇక, స్వర్గంలో విలువైనది, మేలైనది, శ్రేష్టమైనది ఏదీ అంటూ మిగలేదు. అలా అన్నిటినీ దానం చేసేశాక, మూడు గడియల కాలం అయిపోయింది. మారు మాట్లాడకుండా జూదరి ఇంద్ర సింహాసనం నుంచి దిగిపోయాడు.
మరోపక్క జూదరికి ఇచ్చిన గడువు అయిపోవడంతో ఇంద్రుడు, తన గురువైన బృహస్పతిని తీసుకుని దేవలోకానికి వచ్చాడు. చూడగా, అమరావతీ నగరం సర్వసంపదలూ కోల్పోయి కళావిహీనంగా కనిపించింది.
వెంటనే బృహస్పతితో కలిసి దేవేంద్రుడు యముడి వద్దకు వెళ్లాడు. ‘ధర్మదేవా! మీరు నా పదవిని ఒక జూదరికి అప్పగించి తగని పని చేశారు. అతడు అక్కడకు వచ్చి చేయరాని పనులన్నీ చేశాడు. నా అమూల్యమైన రత్నాలను అతడు మునులకు దానంగా ఇచ్చేశాడు. ఒకసారి వచ్చి దేవలోక రాజధాని అయిన అమరావతిని చూడండి. సర్వం కొల్లగొట్టినట్టుపోయి ఉంది. అంతా శూన్యంగా కనిపిస్తోంది. అది కళ్లారా మీరు చూద్దురు గానీ రండి’ అంటూ కోపంగా అన్నాడు ఇంద్రుడు యముడితో. అంతా విన్న యమధర్మరాజు శాంతంగా ఇలా అన్నాడు ఇంద్రుడితో-‘దేవేంద్రా! మీకు వయసు పైబడి వృద్ధులయ్యారు. అయినప్పటికీ మీకు రాజ్యాధికార అనురక్తి ఇంకా పోలేదని ఈ ఉదంతం ద్వారా తెలుస్తోంది. జూదరి చేసిన పనుల వలన అతడికి ఇప్పుడు లభించిన పుణ్యం మీరు చేసిన వందల సంఖ్యలోని యజ్ఞాల వలన కలిగిన పుణ్యం కంటే ఎంతో అధికమైనది.
తనకు కేటాయించినది మూడు గడియల కాలమే అయినా.. దేవలోకపు ఆకర్షణలకు కించిత్తు కూడా వశం కాకుండా అతడు నిస్వార్థ బుద్ధితో దేవలోక ఆణిముత్యాలనదగ్గ కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం వంటివన్నీ దానం చేసేశాడు. ఆ మూడు గడియల కాలానికి ఇంద్ర లోకాధిపతిగా వాటిని దానం చేయడానికి ఆయన పూర్తి అర్హుడు.
తన పుణ్య ఫలంగా కొద్ది సమయమే అతడికి గొప్పదైన అధికారం అప్పగించినప్పటికీ, కించిత్తు కూడా గర్వించకుండా సత్కర్మలు చేయడానికి ఆ మూడు గడియల కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. తనకు పదవి, అధికారం, సంపద ఉన్నప్పటికీ, వాటిని చూసి ఏమాత్రం గర్వించక సత్కర్మలు, దానాలు చేయడంలో ఎవరు తలమునకలై ఉంటారో వారే సర్వోత్క•ష్టులు. ఇక, వెళ్లండి. జరిగిన దానికి బాధపడటం కాక, అతడు ఎవరికైతే ఏయే దానాలు చేశాడో ఆ మునుల వద్దకు వెళ్లి, వారిని బతిమాలి, బామాలి మీరు దేవలోకపు ఆణిముత్యాలుగా భావిస్తున్న వాటిని వెనక్కి తెచ్చుకోండి. అవసరమైతే మీరు పొందిన వాటికి ప్రతిగా వేరొక వస్తువులు ఇస్తానని బతిమలాడుకోండి’. అలా ధర్మం పలికిన యముడి వద్ద నుంచి ఇంద్రుడు సెలవు తీసుకుని తన స్వర్గలోకానికి వచ్చేశాడు. జూదరి గతంలో చేసిన దుష్కర్మల ఫలితంగా కలిగిన నరకవాస బాధల నుంచి విముక్తి పొందాడు.
మరుజన్మలో అతడు విరోచనుడికి మహా తపస్వి, దానశీలి అయిన బలి పేరిట పుత్రుడుగా జన్మించాడు. అతడే తరువాత కాలంలో బలి చక్రవర్తిగా
ఖ్యాతి గడించాడు.

Review దాన మహిమ.

Your email address will not be published. Required fields are marked *

Top