
హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యమైనా దీపారాధనతోనే ఆరంభం అవుతుంది. అలాగే పూజా కార్యక్రమం కూడా ముందుగా దీపారాధనతోనే ప్రారంభమవుతుంది. దీపారాధన అంటే ప్రమిదలో నూనె, వత్తి వేసి వెలిగించేదని అర్థం.
దీపం వెలిగించాలంటే అగ్ని కావాలి. అగ్ని ఘర్షణ ద్వారానే పుడుతుంది. పూర్వకాలంలో యాగాది క్రతువులలో హోమాగ్నిని జ్వలింప చేయడానికి ‘ఆరణి’ అనే ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించే వారు.
ఈ ఆరణిలో రెండు చెక్క గిన్నెలాంటివి పొడవాటి కొయ్యకు అనుసంధానించి ఉంటాయి.
మధ్య కొయ్యను తాడు సహాయంతో వేగంగా ముందుకు, వెనుకకు తిప్పినపుడు (మజ్జిగ చిలికినట్టు) కొయ్యకు, గిన్నెకు మధ్య ఘర్షణ పుట్టి తద్వారా నిప్పురవ్వలు పుడతాయి. ఈ రవ్వలను దూది ద్వారా రగిలించి హోమగుండంలో వేసి సమిధలను వెలిగిస్తారు.
కొయ్యకు కింది భాగంలో ఉన్న చెక్క కప్పును అథరారణి అనీ, పై భాగంలో ఉన్న చెక్క కప్పును ఉత్తరారణి అనీ అంటారు.
ఇంత ప్రయాసతో అగ్నిని ప్రజ్వలింప చేయడంలో అంతర్గతంగా ఒక సందేశం ఇమిడి ఉంది.
ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిమ్ ।
జ్ఞాన నిర్మథనాభ్యాసాత్ దీపం ప్రజ్వాలయామ్యహమ్ ।।
‘తనను (ఆత్మానాం) అంటే జీవ భావాన్ని కిందనున్న ఆరణి గానూ, ప్రణవమును (భగవత్ తత్త్వానికి ప్రతీక ఓంకారం) పైన ఉన్న ఆరణిగానూ చేసి జ్ఞాన నిర్మథనమనే అభ్యాసంతో దీపాన్ని నేను వెలిగిస్తున్నాను’ అని పై శ్లోకానికి అర్థం.
మనలోని అల్పమైన జీవ భాగాన్ని పరమాత్మ భావంతో నిరంతరం అనుసంధానం చేయగా, జ్ఞానాగ్ని ఉద్భవించి, అజ్ఞానమనే ఇంధనమును దహించి వేస్తుంది.
జన్మజన్మాంతరాలుగా మనలో పేరుకుని ఉన్న వాసనలే నూనె.
పలు సంకల్పాలతో కూడి వత్తియే మనసు.
ప్రమిదలోని వత్తి నూనెను పీల్చుకుంటూ వెలుగుతుంటుంది.
చివరకు నూనె అయిపోగా వత్తి కూడా కాలిపోతుంది.
అలాగే జ్ఞానాగ్ని సహాయంతో మనలోని వాసనలనే నూనె, సంకల్పాలనే వత్తులు ఈ రెండూ హరిస్తాయి.
సాధనకునిలో జరిగే అంతర్మథనానికి దీపారాధన ఒక బాహ్య ప్రతీక.
భగవంతుని ముందు వెలిగించే దీపం.. అది విరజిమ్మే కాంతి మనలో ఒక విధమైన ప్రశాంతతను కలిగిస్తాయి. అలాంటి ప్రశాంతతే ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తుంది.
దైవం వైపు నడుద్దాం!
ఒక ఊరిలో ఉన్న గుడిలో జరగబోయే
పురాణ ప్రవచనానికి, పురాణ శ్రవణానికి రావాల్సిందిగా ఆ దేవాలయ అర్చకుడు ఒక ధనవండుతుడిని ఆహ్వానించాడు.
అందుకా ధనవంతుడు, ‘వచ్చి సాధించేది ఏముంది? గత ముప్పది ఏళ్లుగా పురాణ శ్రవణాలు, పురాణ ప్రవచనాలు వింటూనే ఉన్నాను. ఒక్కటైనా గుర్తుందా? అందుకే దేవస్థానానికి వచ్చి అవన్నీ వినడం వల్ల సమయం వృథా అవుతుంది తప్ప ఒరిగేదేమీ లేదు’.
అందుకు ఆ అర్చకుడు చిరునవ్వు నవ్వి, ‘అయ్యా! నాకు పెళ్లి అయి ముప్పై ఏళ్లు అయింది. నా భార్య ఇప్పటి దాకా కనీసం సుమారుగా ముప్పది రెండు వేల సార్లు భోజనం వడ్డించి ఉంటుంది. నేను తిన్న ఆ రకరకాల భోజన పదార్థాలలో నాకు ఒక్కటైనా గుర్తుందా? కానీ నాకు ఒక్కటి మాత్రం బాగా తెలుసు. అదేమంటే, ఆవిడ వండిన భోజనం నుంచి నేను శక్తిని పొందగలిగాను. ఆమె గనుక నాకు ఆ పదార్థాలు పెట్టకపోయి ఉంటే నాకు ఆ శక్తి ఎక్కడిది? ఈపాటికి చనిపోయి ఉండేవాడిని’.
అర్చకుడి సమాధానంతో ధనవంతుడు ఆలోచనలో పడ్డాడు.
అందుకే శరీరానికి భోజనం (ఆహారం) ఎలాగో మనసుకు దైవ ధ్యానం, దైవ నామ స్మరణ అవసరం. ఈ రెండూ నిరంతరం చేస్తూనే ఉండాలి. మనిషి జన్మకు గల ఒక్కటే లక్ష్యం దైవ సాక్షాత్కారం మాత్రమే అంటోంది భగవద్గీత. అందుకే దైవం వైపు నడుద్దాం.
రోజువారీ పనులెన్నయినా ఉండనీ.. కొద్దిసేపు దైవనామ స్మరణకు సమయం కేటాయించాలి.
Review దీపారాధన..అంతరార్థం.