దుర్వ్యసనాల ఫలితం

ఇది శ్రీమద్భాగవతంలోని కథ.
అల్లరి నల్లనయ్య చిన్ని కృష్ణుడు అమ్మ మీద కినుకబూని దధిభాండము (పెరుగు కుండ)ను పగులగొట్టాడు. పొరుగింట్లో దూరి రోలు తిరగవేసి దానిమీదకెక్కి ఉట్టి మీదునున్న వెన్నను తీసి ఒక కోతికి ఇచ్చాడు. ఇటువంటి అల్లరి పనులు చేస్తున్న బాలకృష్ణుడిని చూసి యశోద, ‘కన్నయ్యా! నువ్వింత వరకూ ఎవరికీ చిక్కలేదని, ఎవరూ నీ ముద్దుమోము చూసి నిన్ను శిక్షించలేదని బొత్తిగా అదురు బెదురూ లేకుండా అల్లరి పనులు చేస్తున్నావు. ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను’ అని అంది. బెత్తం తెచ్చి బాలకృష్ణుడిని బెదిరించడానికి వచ్చిన యశోద మనసులో ఇలా అనుకుంది-
‘ఇతడు పసివాడు అనుకుందామంటే కనీవినీ ఎరుగని అత్యబ్ధుత కార్యాలు చేస్తున్నాడు. బెదిరించి బుద్ధులు నేర్పుదామనుకుంటే తనంతట తానే బుద్ధిగా ఉంటున్నాడు. అలాగని వీడు చూడని చోటు లేదు. ఎరుగని విషయం లేదు. భయం అంటూ ఒకటి ఉంటుందని వీడికి తెలీనే తెలియదు. నాన్నా! సాహసాలు మానరా! ప్రమాదమురా! అని చెప్పినా వినడు’.. ఇలా పరిపరి విధాల తలచిన యశోద చివరకు ‘అతి గారాబం చేస్తే పిల్లలు బాగా చెడిపోతారు. అప్పుడప్పుడూ నయానా భయానా మంచి గుణాలు అలవాటు చేయాలి. దుడుకు గల పిల్లలకు దండోపాయమే మంచిది’ అనుకుని బాలకృష్ణుడిని తన చేతిలో గల బెత్తముతో బెదిరించింది.
చిన్ని కృష్ణుడు భయపడినట్టు నటించి, రోలు మీద నుంచి అందెలు ఘల్లుఘల్లుమని మోగుతుండగా, అతి వేగంగా పారిపోయాడు. యశోద బాలకృష్ణుడి వెంటపడింది. కృష్ణుడు ఎంతకీ తల్లి చేతికి చిక్కలేదు. చివరకు తనను పట్టుకోలేక అలసిపోయిన తల్లిని చూసి జాలిపడి ఆ పరమాత్మ తల్లికి తనకు తానుగా దొరికిపోయాడు. పరమ యోగీశ్వరులకు సంయములకు, మునులకు దొరకని ఆ భగవంతుడు భక్తురాలైన యశోదకు దొరికిపోయాడు. కన్నతండ్రిని పట్టుకున్నదే కానీ, కొట్టడానికి ఆ తల్లికి చేతులు రాలేదు. యశోదాదేవి శరీరము, స్వభావము కూడా పువ్వు వలే మెత్తనివి. బిడ్డ మీద జాలితో దండించలేక, ఒక తాటితో రోకటికి (ఉలూఖలమునకు) కట్టివేయాలని అనుకున్నది. ఒక పెద్ద తాడు తీసుకుని వచ్చి ఆ బాలకృష్ణుడిని గట్టిగా కట్టబోయింది. కానీ ఆ తాడు రెండు అంగుళాలు తక్కువయింది. మరొక తాడు తీసుకువచ్చి ఆ బాలకృష్ణుడిని గట్టిగా కట్టబోయింది. కానీ, ఆ తాడు కూడా రెండు అంగుళాలు తక్కువైంది. మరొక తాడును దానికి జత చేసినా, మళ్లీ రెండు అంగుళాలు తక్కువైంది. యశోద ఇంటిలో ఉన్న తాళ్లన్నీ జతచేసినా కూడా ఆ నల్లనయ్య సన్నటి నడుమును చుట్టలేకపోయకింది. ముజ్జగాలు దాగి ఉన్న ఆ చిరు బొజ్జను కట్టుట ఎవరి తరం? అలసిపోయిన తల్లిపై జాలిపడిన నందకిశోరుడు చివరకు తల్లి చేతిలోని తాడుకు కట్టుబడిపోయాడు. భక్తులకు పట్టుబడినట్టుగా భగవంతుడు జ్ఞానులకు కానీ, మౌనులకు కానీ, దానపరులకు కానీ, యోగీశ్వరులకు కానీ పట్టుబడడు కదా!.
యశోదా దేవి శ్రీకృష్ణుడిని ఇలా రోటికి కట్టివేసి తాను ఇంటి పనుల్లో నిమగ్నమైపోయింది. బాలకృష్ణుడు ఆ రోలు ఈడ్చుకుంటూ పెరట్లో చాలా కాలంగా శాపగ్రస్తులై మద్దిచెట్లుగా పడి ఉన్న నలకూబర, మణిగ్రీవుల వద్దకు వెళ్లి వారిని కరుణించదలిచి, ఆ రెండు చెట్ల మధ్య నుంచి రోటిని లాక్కుంటూ వెళ్లాడు. దానితో ఆ యమళ అర్జున వృక్షాలు నిట్టనిలువునా కూలిపోయాయి. అందులో నుంచి దిజ్మండలం ప్రకాశింపచేసే ఇద్దరు అగ్నితుల్యులైన దివ్యపురుషులు వచ్చి స్వామిని స్తుతించి అతని అనుజ్ఞ తీసుకుని కర్తవ్యోన్ముఖులై వెళ్లిపోయారు.

యమళార్జునుల వృత్తాంతం ఇదీ..
నలకూబర మణిగ్రీవులు పరమశివుని ప్రియసఖుడైన కుబేరుని పుత్రులు. వారు చాలా ధనగర్వంతో ఉండేవారు. రుద్రానుచరులై ఉండి కూడా ఒకసారి వారు అతి పవిత్రమైన కైలాస పర్వతంలోని ఒక సుందర ఉద్యానవనంలో స్త్రీలతో కూడి విహారం చేశారు. మదోమత్తులై వారుణి అనే మదిరను పావనం చేశారు. వారు పద్మవనంలో ఉన్న గంగలో జలక్రీడలు ఆడసాగారు. అప్పుడు పరమ పూజ్యుడైన నారద మహర్షి వారి పురాకృత సుకృతం వలన అక్కడికి వచ్చాడు. నారదుడిని చూసి నలకూబర, మణిగ్రీవుల వెంట ఉన్న దేవతా స్త్రీలు సిగ్గుపడి వెంటనే వస్త్రాలు చుట్టుకుని శరీరాన్ని దాచుకున్నారు. కానీ, మదిర (మద్యం) ప్రభావంతో ఒళ్లు మరిచిపోయిన ఆ కుబేరపుత్రులు మాత్రం వస్త్రాలను ధరించలేదు. ఆ దేవకుమారుల అజ్ఞానాన్ని చూసి నారదుడు ఇలా అన్నాడు-
‘ధన గర్వం ఎంతటి గొప్పవారినైనా నాశనం చేస్తుంది. ధన గర్వితులైన వారు మద్యపానం, జూదం, స్త్రీ సంభోగం వంటి దుర్వ్యసనాలకు లోబడి అనేక పాపాలను చేస్తారు. నిర్దయులై మనో వినోదం కోసం పశువులను వధిస్తారు. నశ్వరమైన దేహాన్ని శాశ్వతమైనదని నమ్మి దేహ సౌఖ్యమే పరమానందమని అనుకుంటారు. మద్యపాన మత్తులై నగ్నంగా ఉండి హోరాపరాధం చేసిన వీరు స్థావరత్వమును పొందుటకు తగి ఉన్నారు. మళ్లీ వీరెన్నడూ ఇటువంటి అకార్యములు చేయకుండా ఉండటానికి నా అనుగ్రహం వలన వీరికి పూర్వజన్మ స్మ•తి ఉంటుంది. నూరు దివ్య వర్షములు (సంవత్సరాలు) చేసిన తప్పునకు పశ్చాత్తాపం పొంది పునీతులై నా అనుగ్రహంతో కృష్ణ భక్తులై దైవత్వాన్ని తిరిగి సంతరించుకోగలరు’ అని శపిస్తాడు. అలా మయళార్జునులే బాలకృష్ణుడి ఇంటి పెరటిలో మద్దిచెట్లుగా పెట్టారు. చివరకు బాలకృష్ణుడి కారణంగా శాప విముక్తులు అయ్యారు.

ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే.. వస్త్రధారణ యొక్క ప్రాముఖ్యత మనకు ఈ కథ ద్వారా తెలిసి వస్తుంది. ఎప్పుడూ సరిగా వస్త్రం లేకుండా ఉండరాదని నారద మహర్షి మనకు ఈ కథలో బోధిస్తున్నారు. వారుణి అనే మదిర (మద్యం) ప్రభావంలో ఉండి, తప్పని తెలిసి కూడా నలకూబర, మణగ్రీవులు వస్త్రధారణ చేయలేదు. మదిరాపానం వలన మనిషి తెలియకనే అనేక పాపాలు చేస్తాడు. పంచ మహా పాతకాలలో మొదటిది ఈ మదిరాపానమే. అందుకుని ఇటువంటి దుర్వ్యసనాలకు మనం ఎప్పుడూ దూరంగా ఉండాలి.

అలాగే, ధన గర్వం పనికిరాదని కూడా ఈ కథలో నారద మహర్షి బోధిస్తున్నారు. శివుడి యొక్క అనుచరులై ఉండి కూడా వీరిద్దరూ కేవలం ధనగర్వం వలన తమ దైవత్వాన్ని కోల్పోయారు. చివరకు చెట్లుగా పుట్టారు. తీర్థాలు, పుణ్యక్షేత్రాలు, సిద్ధ ప్రదేశాలలో ఎప్పుడూ విహార దృష్టితో సందర్శించరాదనే నీతి కూడా ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.

Review దుర్వ్యసనాల ఫలితం.

Your email address will not be published. Required fields are marked *

Top