ద్రోణాచార్యుడు

భరధ్వాజుడు, ఘృతాచికి పుట్టిన వాడు ద్రోణుడు. ఈయన కౌరవులకు, పాండవులకు కూడా ఆచార్యుడు. ఈయనకు కృపాచార్యుడి సోదరి కృపితో వివాహమైంది. వీరికి పుట్టిన వాడే అశ్వత్థామ. భరద్వాజుడు అగ్నికు కొడుకైన అగ్నివేశుడికి ఆగ్నేయాస్త్రం గురించి చెప్పాడు. ఆ అగ్నివేశుడు తిరిగి ఆ అస్త్రాన్ని భరద్వాజుడైన ద్రోణుడికి చెప్పి గురువు రుణం తీర్చుకున్నాడు. భరద్వాజుడికి వృషతుడనే రాజు స్నేహితుడు. వృషతుడికి ద్రుపదుడనే కొడుకు ఉన్నాడు. ద్రుపదుడికీ, ద్రోణుడికీ అగ్నివేశుడే గురువు. ద్రుపదుడు రోజూ భరద్వాజుడి ఆశ్రమానికి వచ్చి, ద్రోణుడితో కలిసి ఆడుకుంటూ ఉండేవాడు. ఆ విధంగా ఇద్దరూ సహాధ్యాయులయ్యారు. వృషతుడు చనిపోగానే, పార్శతుడు (ద్రుపదుడు) పాంచాల దేశానికి రాజయ్యాడు. భరద్వాజుడు కూడా చనిపోయిన తరువాత ద్రోణుడు ఆయన ఆశ్రమంలోనే ఉంటూ తపస్సు చేసుకునే వాడు. మొదట వేదాన్ని, అనంతరం ధనుర్వేదాన్ని అభ్యసించాడు. అయితే, పిల్లవాడికి పాలను కొనడానికి కూడా డబ్బులేని దారిద్య్రం అతడిది. ఒకసారి అశ్వత్థామ పాలు కావాలని ఏడ్చాడు. ఎంత ప్రయత్నించినా ఆవు దొరకలేదు ద్రోణుడికి. బియ్యపు పిండిలో నీళ్లు కలిపి, అవే పాలని చెప్పి అశ్వత్థామతో తాగించి ఊరుకోబెట్టారు తల్లిదండ్రులు. మహేంద్ర పర్వతం మీద ఉండే పరశురాముడు దానాలు చేస్తున్నాడని విని ద్రోణుడు అక్కడకు వెళ్లాడు. కానీ, ద్రోణుడు వెళ్లేసరికి పరశురాముడి వద్ద ఏమీ మిగల్లేదు. అస్త్రధనం మాత్రమే ఉంది. దాన్నే ద్రోణుడు కోరుకున్నాడు. అక్కడి నుంచి పాత మిత్రుడు కదా అని ద్రుపదుడి వద్దకు వెళ్లి, పూర్వపు చనువు కొద్దీ, ‘సఖుడా’ అని పిలిస్తే, అది ద్రుపదుడికి నచ్చలేదు. దీంతో హస్తినాపురంలోని బావమరిది ఇంటికి చేరుకున్నాడు ద్రోణుడు. అక్కడ కౌరవ రాజకుమారులు గిల్లీదండ ఆడుతుండగా, గోటీబిళ్ల నీళ్లులేని బావిలో పడిపోయింది. దాన్ని బయటకు తీయడం ఆ కౌరవ రాజకుమారులకు చేతకాలేదు. అక్కడకు వచ్చిన ద్రోణుడు వారిని చూసి నవ్వాడు. ఒక ఉంగరాన్ని కూడా బావిలోకి వేసి, •‘నాకు కొంచెం భోజన వసతి కల్పిస్తే గోటీబిళ్లను, ఉంగరాన్ని కూడా బావిలో నుంచి తీసి ఇస్తాను’ అన్నాడు ద్రోణుడు. పిల్లలు సరేనన్నారు. ద్రోణుడు గుప్పెడు గడ్డిపోచలను కోసి, వాటిని అభిమంత్రించి, ఒక పోచను బిళ్ల మీద గురిపెట్టి వేశాడు. ఆ పోచకు మరో పోచను కలిపాడు. ఇలా మంత్రించిన పోచలతో గోటీబిళ్లను పైకి తీశాడు. అలాగే ఉంగరాన్నీ తీశాడు. ఆనందంతో పిల్లలు, ‘మేం మీకు ఏం చేసి పెట్టాలి?’ అని అడిగారు. ‘మీ భీష్ముడి తాతకు నా గురించి చెప్పండి చాలు’ అన్నాడు ద్రోణుడు. భీష్ముడు ద్రోణుడి విలువిద్య పాండిత్యాన్ని గుర్తించాడు. కౌరవ, పాండవులకు విలువిద్యను నేర్పాలని చెప్పి, ద్రోణుడికి ఏ లోటూ లేకుండా చేశాడు.
విలువిద్యలో అర్జునుడి నేర్పును గమనించిన ద్రోణుడు అతడిని విలుకాళ్లలో మేటివాడిగా చేయాలని అనుకున్నాడు. అయితే, ఏకలవ్యుడు అర్జునుడిని మించిపోతాడని గ్రహించి, అతడి బొటనవ్రేలిని గురుదక్షిణగా పొందే క్రూరత్వానికి ఒడిగట్టడం ద్రోణుడి జీవితంలో ఓ మచ్చ. అలాగే, ద్రుపదుడు తనకు చేసిన అవమానాన్ని గుర్తుచేసుకుని అర్జునుడి సాయంతో అతడిపై దండెత్తి రాజ్యాన్ని వశం చేసుకున్నాడు. ఇంత కక్ష తీర్చుకున్నా, తనను చంపడానికి పుట్టిన ద్రుపదుడి కొడుకు దృష్టద్యుమ్నుడికి విలువిద్యను నేర్పింది ద్రోణుడే కావడం విశేషం.

భీష్ముడి తరువాత ద్రోణుడే కౌరవసేనకు సేనా నాయకుడు అయ్యాడు.
కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. ‘ధర్మరాజును బంధిస్తే యుద్ధం ముగుస్తుంది. మీరు పాండవ పక్షపాతి అయి ఆ పనిచేయట్లేదు’ అని దుర్యోధనుడు ఎత్తిపొడిచినపుడు, అభిమన్యుడి చావుకు ద్రోణుడు పథకం వేశాడు. చక్రవ్యూహం పన్ని ఒంటరివాడిని చేసి ఆరుగురు యోధులు ఒక్కసారిగా మీదపడి అభిమన్యుడిని చంపేలా పథకం రచించింది ద్రోణుడే. ఆ తరువాత పాండవుల సేనను ద్రోణుడు తన విలువిద్య పాఠవంతో కకావికలం చేయసాగాడు. కృష్ణుడి ఉపాయంతో, ధర్మరాజు- ‘అశ్వత్థామ చనిపోయాడు’ అనే వదంతిని వ్యాపింప చేశాడు. కుమారుడు మరణించాడన్న వార్త విన్న ద్రోణుడు యుద్ధంలోనే అస్త్ర సన్యాసం చేశాడు. ధ్యాన ముద్రలో కూర్చుని ప్రాణాన్ని వదిలేసిన ద్రోణుడి తలను దృష్టద్యుమ్నుడు వర ప్రభావం వలన నరికేశాడు.

Review ద్రోణాచార్యుడు.

Your email address will not be published. Required fields are marked *

Top