
నరనారాయణుడు జంట మహర్షులు. విష్ణువే రెండు రూపాలుగా పుట్టడం వల్ల వీరిద్దరూ స్నేహంగా ఉంటూ బదరికావనంలో వెయ్యేళ్లు తపస్సు చేశారు. ఇంద్రుడు వీరి తపస్సును భగ్నం చేయడానికి చేయని ప్రయత్నం లేదు. చివరి అస్త్రంగా మన్మథుడిని ప్రయోగించాడు. మన్మథుడు బదరికావనంలో అడుగిడగానే అక్కడ వసంతం వచ్చినట్టయింది. ఆ కోలాహలానికి నరనారాయణులు కళ్లు తెరిచారు. చూడగా- పదహారు వేల మంది అప్సరసలు మన్మథుడితో సహా కనిపించారు. నరనారాయణులు ఏమాత్రం స్పందించకుండా, ఆ అప్సరసలను మించిన ఊర్వశిని సృష్టించి, ఆమెను కూడా మీతోనే ఉంచుకోండి అంటారు. చేసేది లేక మన్మథుడు అప్సరసలు, ఊర్వశితో కలిసి వెళ్లిపోతాడు.
ఒకసారి ప్రహ్లాదుడు తీర్థయాత్రలు చేస్తూ బదరికావనానికి వస్తాడు. అక్కడొక చెట్టుపై బాణాలు, ఆ చెట్టు కింద తపంలో ఉన్న నరనారాయణులు కనిపిస్తారు.
‘ఒకపక్క జపం.. మరోపక్క బాణాలు.. ఇది రుషి ధర్మం కాదు కదా!’ అన్నాడు ప్రహ్లాదుడు.
‘మేం బ్రాహ్మణ్యంలోనూ, క్షాత్రంలోనూ గొప్పవాళ్లం’ అన్నారు నరనారాయణులు.
‘అయితే, నాతో యుద్ధం చేయండి’ అన్నాడు ప్రహ్లాదు. అలా వెయ్యేళ్లు యుద్ధం చేశారు.
శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై, ‘వాళ్లు నా వాళ్లు. వాళ్లతో కయ్యం వద్దు’ అని ప్రహ్లాదుడికి చెప్పి పంపించేశాడు.
పూర్వం సహస్ర కవచుడనే రాక్షసుడు ఉండే వాడు. వాడికి వెయ్యి కవచాలు ఉండేవి. లోకంలో ఎవరినీ బతకనిచ్చేవాడు కాదు. నరనారాయణులు వాడితో తలపడ్డారు. ఒకరు యుద్ధం చేస్తే మరొకరు తపస్సులో ఉండేవారు. అలా ఒకరి తరువాత ఒకరు వాడితో యుద్ధం చేసి 999 కవచాలు ఊడగొట్టారు. ఇక, మిగిలిన ఒక కవచంతో ఆ రాక్షసుడే కర్ణుడిగా పుట్టాడు. నరనారాయణులు అర్జునుడు, కృష్ణుడిగా పుట్టారు. అలా మహాభారత యుద్ధంలో వీరిద్దరూ కలిసి కర్ణుడిని సంహరించారు. విశాలుడనే రాజు శత్రువుల వల్ల రాజ్యం పోగొట్టుకుని విష్ణువును గురించి తపస్సు చేయసాగాడు. నరనారాయణులు అతడి వద్దకు వెళ్లి, ఏం వరం కావాలో కోరుకో అన్నారు. నాకు విష్ణువు తప్ప మరేమీ వద్దన్నాడు విశాలుడు.
‘విష్ణుమూర్తే మమ్మల్ని పంపాడు. నీకేం కావాలి?’ అని అడిగారు నరనారాయణులు.
‘విష్ణువుకు ఇష్టమైన యాగాలు చేయడానికి అవసరమైన సంపద కావాలి’ అన్నాడు విశాలుడు.
అయితే కల్కి వ్రతం చేయాలని సూచించారు జంట మహర్షులు.
అలా విశాలుడు ఆ వ్రతాన్ని ఆచరించి, విష్ణువుకు ఇష్టమైన యాగాలు చేసి ముక్తిని పొందాడు.
శౌనక మహర్షి నాలుగు వేదాలు, వాటి అర్థాలు నేర్చుకుని గొప్ప జ్ఞాని అయ్యాడు. ఒకసారి శిష్యులతో పాటుగా తిరుగుతూ మనోహరంగా ఉన్నదీ, రకరకాల యోగులతో, హరిభక్తులతో, వనదేవతలతో, మునికన్యలతో అందంగానూ అన్ని పుణ్యాలకు నిలయంగానూ, పవిత్రంగానూ ఉన్న నరనారాయణుల ఆశ్రమానికి వచ్చాడు.
నారాయణుడు ఏం కావాలని అడిగాడు.
‘నాలుగు వేదాలను చదివాను. కానీ, వాటి లోతైన అర్థం తెలియడం లేదు’ అన్నాడు శౌనకుడు.
అప్పుడు వేదసారమైన విష్ణువును గురించి చెప్పి, వేదాలను తెలుసుకోవడానికి హరిభక్తి తప్ప ఇంకే ఉపాయం లేదని చెప్పాడు నారాయణుడు.
‘వేదాలను చదివే అధికారం లేనివాడు ముఖ్యంగా చేయాల్సిన పనులేమిటి?’ అని శౌనకుడు అడిగాడు.
‘అలాంటి వాళ్లు దానధర్మాలు, సత్యం పలకడం, బావులు, చెరువులు తవ్వించడం, కొడుకును పొందడం, బ్రాహ్మణ పిల్లల ఉపనయనానికి, పెళ్లిళ్లకు సాయపడటం, సొంత ధనంతో బ్రాహ్మణులను రక్షించడం, బ్రాహ్మణుడికి ఇల్లు కట్టించివ్వడం వంటివి విష్ణువుకు దగ్గరయ్యే మార్గాలు’ అని చెప్పాడు నారాయణుడు.
‘ఉత్తముడైన కవి యొక్క ఉత్తమమైన గ్రంథాన్ని తీసుకున్న ఉత్తముడికి పుణ్యలోకం కలుగుతుంది. శౌనక మహర్షీ! ఇవన్నీ ఎందుకు? విష్ణువే ధర్మం, గతి, శాశ్వతుడు. హరిభక్తి కంటే మించింది లేదు’ అని ఆ మహర్షికి బోధించాడు నారాయణుడు.
శౌనకుడు నరనారాయణులు చెప్పింది విని ఆనందంతో తన ఆశ్రమానికి తిరిగి వెళ్లాడు.
ఒకసారి నారదుడు కూడా బదరికీవనానికి వచ్చి సిద్ధి పొందడానికి ఏం చేయాలని నరనారాయణులను అడిగాడు.
‘నారదా! ధ్రువము, అచలము, ఇంద్రియగోచరము, సూక్ష్మము అయి సర్వానికి అంతరాత్మ అయి వెలుగుతున్న తత్వాన్నే ఆరాధించు’ అని బోధించారు నరనారాయణులు. అలా నారదుడు విష్ణు తత్త్వాన్ని పొందాడు.
Review నరనారాయణులు.