పరాశరుడు వశిష్టుడికి మనవడు. శక్తి మహర్షికి కొడుకు. వ్యాస మహర్షికి తండ్రి. కాబట్టి ఈయన ఎంత గొప్ప మహర్షో అర్థమై ఉంటుంది.
కల్మాషపాదుడనే రాజు వేటాడి వస్తూ దారిలో కనిపించిన శక్తి మహర్షిని పక్కకు తప్పుకో అన్నాడు. మహర్షి ఎదురు వస్తే నమస్కరించాలి కానీ, అలా అనకూడదు కదా! మహర్షి అదే విషయాన్ని రాజుకు చెప్పాడు. దాంతో రాజు మహర్షిని కర్రతో కొట్టాడు. దీంతో రాజుని రాక్షసుడిగా మారిపోతావని శపించాడు శక్తి మహర్షి. శాప ప్రభావంతో రాజు రాక్షసుడిగా మారిపోవడంతో పాటు, శక్తి మహర్షిని కూడా చంపేశాడు. కొడుకు మరణించడంతో వశిష్టుడు బాధపడుతూ, కోడలిని ఓదార్చి, నీ కడుపులో పన్నెండేళ్ల నుంచి ఉండి వేదాలు వింటున్న కొడుకు ఉన్నాడు. కాబట్టి దు:ఖించాల్సిన పనిలేదన్నాడు. కొన్నాళ్లకు శక్తి భార్య మగబిడ్డను ప్రసవించింది. అతడు తాత వశిష్టుడి దగ్గరే పెరిగాడు. ఆయన పేరే పరాశరుడు.
ఒకనాడు తల్లి ద్వారా తన తండ్రి రాక్షసుడి చేతిలో చనిపోయినట్టు తెలుసుకున్నాడు పరాశరుడు. నా తండ్రిని ఒక రాక్షసుడు చంపుతున్నప్పుడు ఎవరూ అడ్డుపడలేదు.. కాబట్టి లోకాన్ని నా తపస్సుతో నాశనం చేస్తానని పరాశరుడు ప్రతిజ్ఞ చేశాడు.
వశిష్టుడు అది తెలుసుకుని, అలా చేయడం తప్పని మనవడికి నచ్చచెప్పాడు. నీ తండ్రిని చూడాలని ఉంటే శివుడి గురించి తపస్సు చేయి.. ఆయనే నీకు నీ తండ్రిని చూపిస్తాడు అని వశిష్టుడు సలహా ఇచ్చాడు.
పరాశరుడు గొప్ప తపస్సు చేసి, శివుడి అనుగ్రహంతో స్వర్గలోకంలో ఉన్న తండ్రిని చూసి, ఆశీర్వాదం తీసుకున్నాడు. తిరిగి మళ్లీ ఆశ్రమానికి వచ్చి, తల్లికి, తాతకు జరిగినదంతా చెప్పాడు. తన తండ్రిని సంహరించిన రాక్షసుడిపై కోపంతో మొత్తం రాక్షసులను చంపడానికి పరాశర మహర్షి సత్ర యాగం చేయడం మొదలుపెట్టాడు. రాక్షసులందరూ హోమాగ్నిలో పడి చనిపోతున్నారు. మహర్షులు అంతా కలిసి పరాశరుడిని ఆపారు. ‘నాయనా! నువ్విలా హింస చేయకూడదు. రాక్షస వంశం నాశనమైపోతుంది. లోకానికి ఉపయోపగడే పనులు చేయాలి కానీ, ఇలాంటి హింస తగదు’ అని పరాశరుడికి హితవు చెప్పారు.
‘మీరు చెప్పింది వింటాను. కానీ, ఈ అగ్నిని ఇలా వదిలేస్తే నన్నే తినేస్తుంది కదా!’ అన్నాడు పరాశరుడు.
మహర్షులు ఆ అగ్నిని హిమాలయాల్లో వదిలేసి రమ్మని సలహానిచ్చారు. ఒకనాడు జనక మహారాజు పరాశరుడిని ధర్మాన్ని గురించి చెప్పాలని కోరాడు.
‘రాజా! పండు కావాలంటే దాని గింజ ఎంత అవసరమో మనిషికి సుఖం కావాలంటే ధర్మం అంతే ముఖ్యం’ అంటూ ఎన్నో ధర్మసూక్ష్మాలను బోధించాడు పరాశరుడు జనకుడికి.
‘మహర్షీ! తపస్సు వల్ల ఉపయోగం ఏమిటి?’ అని అడిగాడు జనకుడు.
‘రాజా! మనిషి ఇంద్రియాలను జయించి ధర్మార్థకామమోక్షాలు పొందడానికి తపస్సే కారణం అవుతుంది’ అంటూ హింస-అహింస, జ్ఞానాన్ని గురించి కూడా చెప్పాడు పరాశరుడు.
ఇలా పరాశరుడు జనకుడికి బోధించిన విషయాలే ‘పరాశర గీత’గా లోకప్రసిద్ధి పొందింది. ఒకనాడు వ్యాసుడు తన తండ్రిని వెతుక్కుంటూ వెళ్లాడు. ఇతర రుషులతో కలిసి పరాశరుడిని కలిసి, కలియుగ ధర్మాల గురించి అడిగి తెలుసుకున్నాడు. ఆ విషయాలే ‘పరాశర స్మ•తి’గా ప్రతీతి. దీంట్లో ఆచారకాండం, ప్రాయశ్చిత్తకాండం వంటివి ఉన్నాయి.
ఇంకా ‘పరాశర హోరా శాస్త్రం’ అనే గొప్ప జ్యోతిష గ్రంథం విష్ణుతత్త్వం గురించి బోధిస్తుంది. ఇంకా ఇలాంటివే మరెన్నో గ్రంథాలతో సాటి మహర్షులను, లోకాన్ని ఉద్ధరించాడు పరాశర మహర్షి.
‘పాపాలు చేయకపోతే పుణ్యం వస్తుందే కానీ, మోక్షం కలగదు. కాబట్టి మంచి గురువు చెప్పినట్టు చేసి, జ్ఞానం సంపాదించి మోక్షాన్ని పొందాలి. అప్పుడు జన్మ ఉండదు’ అని పరాశరుడు శిష్యులకు బోధించేవాడు.
ఒకనాడు తీర్థయాత్రలు చేద్దామని పరాశరుడు బయల్దేరి యమునా నది ఒడ్డుకు వచ్చి నది దాటడానికి పడవ ఎక్కాడు. ఆ పడవను దాసరాజు కుమార్తె సత్యవతి (మత్స్యగంధి) నడుపుతోంది. ఆమెను చూసి ఇష్టపడిన పరాశరుడు, ఆమె పూర్వజన్మలో దేవకన్య అని గ్రహించాడు. అదే విషయం సత్యవతికి చెప్పాడు. ‘నాకు ఏ దోషం అంటకుండా కన్యగానే ఉండేలా వరమిస్తే మీరు చెప్పినట్టే చేస్తాను’ అంది సత్యవతి.
అనంతరం వారిద్దరి కలయికతో వేదవ్యాసుడు పుట్టాడు. పరాశరుడు సత్యవతి అడిగిన వరాలిచ్చి, కొడుకును దీవించి వెళ్లిపోయాడు. వ్యాసుడు కూడా తల్లికి నమస్కరించి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు.
Review పరాశర మహర్షి.