పసివాడి ప్రజ్ఞ

మహా భారతంలోని అరణ్యపర్వంలోనిది ఈ కథ.

విదేహ రాజ్యాన్ని పాలించే జనక మహారాజు ఆస్థానంలో వంది అనే మహా విద్వాంసుడు ఉండేవాడు.

ఎంతటి మహా విద్వాంసుడైనా వందితో వాదించి గెలవలేకపోతున్నారు.

అందరినీ తన పాండిత్యంతో ఓడిస్తున్న వంది ఒకనాడు, ‘నాతో వాదించి ఓడిన వారిని నదీ ప్రవాహంలో ముంచేస్తాను’ అని మిక్కిలి అహంకారంతో ప్రకటించాడు.

అలా ఎందరినో తన విద్వత్తుతో వివిధ అంశాలలో ఓడించి, వారిని నదిలోకి తోయించి గర్వంతో మిడిసి పడేవాడు.

ఆ రోజులలో ఉద్ధాలకుడి శిష్యుడైన కహోడుడు విదేహ రాజ్యం చేరి వందితో వాదనకు దిగాడు. అలా ఆ వాదనలో ఓడిపోయిన కహోడుడు నదిలోకి తోసివేయబడి ప్రాణాలు విడిచాడు.

అప్పటికి కహోడుడి భార్య సుజాత నిండు గర్భిణి. భర్త మరణవార్త విని ఎంతో దు:ఖించింది. గర్భంలో ఉన్న శిశువు మీద మమకారాన్ని చంపుకోలేక విచారాన్ని విడనాడి బిడ్డ కోసమై బతకసాగింది. అలా కొంతకాలానికి ఒక కుమారుడిని కన్నది.

ఆ బాలుడు గతంలో తండ్రి శాపం వల్ల ఎనిమిది వంకరలతో పుట్టాడు. అందువల్ల అతడిని అందరూ అష్టావక్రుడు అని పిలిచేవారు.

పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటికి అష్టావక్రుడికి తన తండ్రి మరణ కారణం తెలిసింది. దీంతో వందితో వాదనకు దిగి అతడిని ఓడించాలనే సంకల్పంతో విదేహ రాజ్యానికి చేరుకున్నాడు.

అక్కడ ద్వార పాలకుడు అష్టావక్రుడిని అడ్డుకున్నాడు.

‘నిండా పన్నెండేళ్లయినా లేని బాలుడివి. నువ్వు మహా విద్వాంసుడైన వందితో వాదనకు దిగడమా? వెళ్లు.. వెళ్లు..’ అని ఆ ద్వార పాలకుడు గేలి చేశాడు.

‘ద్వారపాలకా! విద్యకు వయసుతో నిమిత్తం లేదు. జుట్టు నెరసి వయసు ముదిరిన వాడు మాత్రమే మహా విద్వాంసుడని అనుకోకు’ అని అష్టావక్రుడు అతడితో వాదనకు దిగాడు.

అంతలో అటుగా వచ్చిన జనక మహారాజు ఇదంతా విన్నాడు.

ఆ బాలుడి వద్దకు వచ్చి, ‘ఆర్యా! మా ఆస్థాన విద్వాంసుడు వంది ప్రచండ సూర్య సముడు. ఆయన ముందు మిగిలిన విద్వాంసులందరూ చిన్న చిన్న నక్షత్రాల వలే వెల వెలబోతుంటారు. ఆయనతో నీకు వాదన అసలు ఊహకందని విషయం’ అన్నాడు జనకుడు అష్టావక్రుడితో.

‘మహారాజా! నా వంటి వాడెవడూ మీ సభా భవనానికి వచ్చి ఉండరు. అందుకే మీ వంది ఆటలు సాగుతున్నాయి’ అన్నాడు అష్టావక్రుడు ఉక్రోశంగా.

‘అయితే, ముప్పది దినాలు, పన్నెండు అంశలతో, ఇరువది నాలుగు పర్వాలతో, మూడు వందల అరువది రేకులతో ఉండే దానిని ఎరిగిన జ్ఞానివా నువ్వు?’ అని జనకుడు ప్రశ్నించాడు.

‘మహారాజా! ముప్పది దినాలు అనగా నెలరోజులు. అమావాస్యలు పన్నెండు. పూర్ణిమలు పన్నెండు. ఈ ఇరువది నాలుగు పర్వాలు పన్నెండు నెలల అంశలు. మూడు వందల అరువది రోజులు రేకులు. అటువంటి సంవత్సర రూపమైప కాలచక్రం మీకు సమస్త కల్యాణాలు కలిగించు గాక!’ అన్నాడు అష్టావక్రుడు.
ఇక, అక్కడి నుంచి జనకుడు, అష్టావక్రుడి మధ్య సంవాదం ఇలా మొదలైంది. మొదట జనకుడు ఇలా ప్రశ్నించాడు- ‘ఉరుము, మెరుపు
ఆడ గుర్రాల జంట వలే కనిపిస్తూ, హఠాత్తుగా డేగలా మీద పడే ఆ రెండింటినీ ధరించేదెవరు?’.

‘మహారాజా! అవి శత్రువుల గృహాల మీద పడకూడదని కోరుతున్నాను. ప్రాణ నామాలతో ఉండే ఆ రెండు తత్త్వాల వల్ల విద్యుత్తు పుడుతుంది. వీటిని మేఘం ధరిస్తుంది’.

‘కన్ను మూయకుండా నిద్రించేది ఏది?’.
‘నిరంతరం నీటిలో ఉండే చేప’.
‘జన్మించినా చైతన్యం లేనిది ఏది?’.
‘పక్షులు పెట్టే గుడ్లు’.
‘హృదయం లేనిది ఏది?’.
‘బండరాయి’.

ఆ బాలుడి సమాధానాలతో జనకుడు సంతృప్తి చెందాడు. దాంతో ‘ఓ వేదవేత్తా! ఇప్పుడు మీరు మా మండపానికి వచ్చి వందితో వాదనలు సాగించవచ్చు’ అని అష్టావక్రుడిని సాదరంగా లోనికి తీసుకుని వెళ్లాడు. అష్టావక్రుడిని చూసి వంది హేళనగా నవ్వాడు.
‘బాలకా! నిద్రపోయే సింహాన్ని లేపకు. కాలకూట విషభరితమైన పాము పడగ మీద కాలు పెట్టకు. నాతో నీకు వాదన తగనిది. పో’ అన్నాడు వంది.
అష్టావక్రుడు జనకుడి వైపు చూశాడు.

‘మహారాజా! పర్వతాలన్నీ మైనం కంటే చిన్నవి. లేగదూడలు ఆంబోతుల కంటే చిన్నవి. రాజులందరూ జనకుడి కంటే అల్పులు. దేవతలలో ఇంద్రుడి వలే, నరులలో ఉత్తముడుగా ఉన్న మహారాజువి నువ్వు. మీ విద్వాంసుడైన వందిని నాతో వాదానికి రమ్మనండి. నా వాదాన్ని ప్రారంభిస్తున్నాను ’ అన్నాడు అష్టావక్రుడు.
మహా విద్వాంసుడు వంది వాదనకు దిగాడు.

‘అగ్ని ఒక్కటే అయినా అనేక రూపాలలో ప్రకాశం ఇస్తుంది. సూర్యుడు ఒక్కడే సర్వ లోకాలకు వెలుగు. దేవేంద్రుడు ఒక్కడే ఏకైక వీరుడు. పితృ దేవతాపతి యముడొక్కడే’ అంటూ వంది తన వాదనను ప్రారంభించాడు.

‘వందీ! ఇంద్రుడు – అగ్ని నిరంతరం స్నేహబంధంతో ఉండే దేవతలు. అలాగే పర్వత నారదులు. అశ్వనీ దేవతలు ఇద్దరు. రథానికి చక్రాలు రెండు. సతీపతులు ఇద్దరు’.

‘ప్రాణికోటి అంతా దేవమానవ తిర్యగ్రూపాలు మూడుగా ధరిస్తుంది. రుగ్యజుస్సామాలు మూడే వేదాలు. ప్రాతర్మాధ్యాహ్ని సాయం సంధ్యలు మూడు. స్వర్గ మర్త్య నరకాలు మూడే లోకాలు. అగ్ని, సూర్యచంద్రులు ముగ్గురే జ్యోతిస్స్వరూపులు’.

‘బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు నాలుగు. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులు నాలుగు. దిక్కులూ నాలుగే. హ్రస్వ, దీర్ఘ, ప్లుత, హల్లు భేదాలతో శబ్దాలు నాలుగు రకాలు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ అని వాక్కు నాలుగు రకాలు’.

‘గార్హపత్య, దక్షిణాగ్ని, ఆహవనీయ, సభ్య అసభ్యం అనే అవస్థా భేదంతో యజ్ఞాగ్ని అయిదు విధాలు. పంక్తి, ఛందస్సుకి పాదాలు అయిదు. దేవ, పితృ, రుషి, మనుష్య, భూత, యజ్ఞాలు అయిదు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అని జ్ఞానేంద్రియాలు అయిదు. విపాశ, ఇరావతి, వితస్త, చంద్రభాగ, శతుద్రు నామాలతో ప్రఖ్యాతమైనది పంచనాదం’.

‘అగ్ని స్థాపన వేళ ఆరు ఆవులను దక్షిణ ఇవ్వాలి. ఆరు రుతువులే సంవత్సర కాలచక్రాన్ని నడుపుతాయి. మనస్సుతో కలిసి జ్ఞానేంద్రియాలు ఆరు. కృత్తికలు ఆరు. యజ్ఞాలు ఆరు’.

‘ఆవు, దున్న, మేక, గుర్రం, కుక్క, పిల్లి, గాడిద- ఇవి ఏడూ గ్రామాలలో ఉండే జంతువులు. సింహం, శార్దూలం, లేడి, తోడేలు, ఏనుగు, వానరం, భల్లూకం- ఇవి ఏడూ వన్య మృగాలు. గాయత్రి, బృహతి, జగతి, అతి జగతి, పంక్తి, త్రిష్టుప్‍, అనుష్టుప్‍, భేదాలతో ఛందస్సు ఏడు రకాలు. అత్రి, పులస్త్య, క్రతువు, మరీచి, అంగిరస, పులహ, వశిష్టుడు.. వీరు సప్త మహర్షులు. ధూప, దీప, నైవేద్య, ఆచమన, గంధ, పుష్ప, తాంబూలాదులు కూడా ఏడే.
‘తులాదండాన్ని బంధించే సూత్రాలు ఎనిమిది. సింహాన్ని శరభ మృగానికి పాదాలు ఎనిమిది. యజ్ఞశాల సమీపంలో నాటే యూప స్తంభానికి ఉండే కోణాలు ఎనిమిది. వసువులు ఎనమండుగురు’.

‘వందీ! పితృ యజ్ఞ వేళ అగ్నిని ఉపాసించే సామిధేను మంత్రాలు తొమ్మిది. ప్రకృతి, పురుష, అహంకార, మహత్తత్త్వ, పంచతన్మాత్రలు తొమ్మిది. వీటి సంయోగం వల్లనే సృష్టి సాగుతున్నది. బృహతీ ఛందస్సుకు ప్రతిపాదంలోనూ తొమ్మిదే అక్షరాలు ఉంటాయి. గణిత శాస్త్రం యావత్తూ తొమ్మిది అంకెల మీద ఆధారపడి ఉంది’.

‘దిక్కులు పది. గర్భంలో జీవుడు పది మాసాలు ఉంటాడు. రోగి, దరిద్రుడు, శోకార్తుడు, రాజదండితుడు, వృత్తిలో మోసపోయిన వాడు, పిచ్చివాడు, కాముకుడు, అసూయపరుడు, మూర్ఖుడు, మొండివాడు.. ఈ పది మందీ నిందార్హులు. గురువు, తండ్రి, పెద్దన్న, ప్రభువు, మాతామహి, పితామహుడు, మేనమామ, మామగారు, తండ్రి సోదరుడు, కుటుంబంలో వృద్ధులు.. ఈ పది మందీ పూజింపదగిన వారు.
అలాగే, ప్రాణికి పది దశలు. అవి- గర్భవాసం, జననం, బాల్యం, కౌమారం, పౌగండం, కైశోరం, యవ్వనం, ప్రౌఢత్వం, వార్థక్యం, మృత్యువు’.

‘ప్రాణికోటికి ఇంద్రియాలు పదకొండు. విషయాలూ పదకొండే. జ్ఞాన, కర్మేంద్రియాలతో మనస్సు కలిసి పదకొండు. శబ్ద, స్పర్శ, రూప, రస, గ్రంథాలు అనేవి జ్ఞానేంద్రియ విషయాలు. మాట, పని, నడక, మలాదుల విసర్జన, భార్యా సంయోగం.. ఇవి కర్మేంద్రియాలు చేసే పనులు. వీటి మననం మనస్సు చేసే పని. ఇవన్నీ కలిపి పదకొండు.
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, రాగ, ద్వేష, హర్ష, శోక, అహంకారాది వికారాలు పదకొండు.
మృగ, వ్యాధ, సర్ప, అజైకపాద, అహిర్భుధ్న్య, కపాలి, పినాకి, నిర్భతి, దహిన, స్థాణు, ఈశ్వర.. వీరు ఏకాదశ రుద్రులు’.

‘మాసాలు పన్నెండు. జగతీ ఛందస్సుకి అక్షరాలు పన్నెండు. ప్రాకృత యజ్ఞం పన్నెండు రోజులు సాగుతుంది. ఆదిత్యుడు పన్నెండుగురు’.

‘తిథులలో త్రయోదశి మంచిది. భూమి మీద పదమూడు ద్వీపాలు..’ అంటూ తరువాత ఏం మాట్లాడలేక. శ్లోకం గుర్తుకు రాక వంది ఆగిపోయాడు.

వెంటనే అష్టావక్రుడు అందుకున్నాడు.
‘మహారాజా! మీ విద్వాంసుడు వంది శ్లోకం సగం చదివి విరమించాడు. తరువాత ఏమీ చెప్పలేకపోయాడు. మిగిలింది నేను చెబుతా వినండి.
‘కేశి దానవుడితో మహా విష్ణువు పదమూడు రోజులు యుద్ధం చేశాడు. వేదంలోని అతి జగతి ఛందస్సు పదమూడు అక్షరాల పరిమితితో నడుస్తుంది..’ అని అష్టావక్రుడు ముగించాడు.

వంది అవమాన భారంతో తలదించుకున్నాడు.
తనతో వాదన పెట్టుకుని ఓడిపోయిన వారిని నదిలో ముంచేసిన వంది.. నియమానుసారం తనకు తానే నదిలో మునిగిపోయాడు.

మనకు ఎంత విద్య ఉన్నా, వయసు మీరినా, వివేకాన్ని దిగమింగే అహంకారంతో నడుచుకునే వారు వంది వలే పసి వారి ప్రజ్ఞ ముందు పతనమైపోతారని ఈ కథలోని నీతి తెలియచెబుతుంది.
పిల్లలకైనా, పెద్దలకైనా విద్య వినయాన్ని కలిగించాలి కానీ గర్వ హేతువు కారాదు.

Review పసివాడి ప్రజ్ఞ.

Your email address will not be published. Required fields are marked *

Top