ప్రళయ కాలం

అది వైకుంఠం.
శ్రీమన్నారాయణుడు, శ్రీలక్ష్మీదేవి ఏవో ముచ్చట్లలో మునిగిపోయి ఉన్నారు.
అంతలో విష్ణువు, ‘లక్ష్మీ! మా బావ శివుడిని, నా చెల్లి పార్వతిని పలకరించి చాలా రోజులైంది. అంతేకాదు, ఒక ముఖ్య విషయం వారితో చర్చించాలని అనుకుంటున్నాను. గరుత్మంతుడు ఎక్కడ ఉన్నాడు?’ అని ప్రశ్నించాడు.
‘నాథా! గరుత్మంతుడు అనంతనాగునితో ముచ్చట్లాడుతున్నాడు. ఇప్పుడే పిలుస్తానుండండి’ అని బదులిచ్చింది లక్ష్మి.

‘సమయం మీరిపోతోంది. గరుత్మంతుడిని తొందరగా రమ్మను’ అన్నాడు విష్ణువు.

స్మరణ మాత్రం చేతనే గరుత్మంతుడు తన దేవర చెంత వాలాడు.

‘మనం వెంటనే కైలాసం వెళ్లాలి. సిద్ధంకా’ అని చెప్పాడు మహా విష్ణువు.

గరుత్మంతుడు ఎందుకు అన్నట్టు సంశయంగా నిలుచుండగా, లక్ష్మీదేవి, ‘ఖగరాజు నీ యానతి విని కనలేడో, వైకుంఠానికి కైలాసానికి బహుదూరం బనినాడా’ అంది.

గరుత్మంతుడు అది విని, ‘అమ్మా! విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటే విశ్వ ప్రదక్షిణ తృటికాలంలో చేయగలను. నాకు ఆ శక్తి దేవర ఇచ్చిన ప్రసాదం. చతుర్దశ భువన సంచారం నాకు వెన్నతో పెట్టిన విద్య’ అన్నాడు.

లక్ష్మీదేవి సమ్మతంతో విష్ణుమూర్తి శివుడి వద్దకు గరుత్మంతుడిపై బయల్దేరాడు.

విష్ణువు సరిగ్గా ముహూర్త కాలానికి కైలాసగిరి చేరాడు. అప్పటికి ప్రదోషకాలమైంది. త్రినేత్రుడు ఆ సమయంలో మహా నృత్యం చేస్తున్నాడు.

అక్కడే నిలుచుని బ్రహ్మదేవుడు శివుడి తాండవం శ్రద్ధగా తిలకిస్తున్నాడు.

అటుగా వచ్చిన విష్ణువును చూసి బ్రహ్మ కుశల ప్రశ్నలు వేశాడు.

మరోపక్క పరమశివుని నృత్యం తార•స్థాయిలో కొనసాగుతోంది. శివుడి నృత్యానికి విశ్వం ఆగగలదా? అన్నట్టు అక్కడ చిత్రగతుల లయరీతుల కేళీ వినోదం జరుగుతోంది. ప్రమథ గణాలు ఉన్మత్త స్థితిలో మైమరిచి ఉన్నారు. నిటలాక్షుని నృత్యకేళీ విన్యాసాలను చూసి పరవశించిన మహా విష్ణువు తాను వచ్చిన పని మరిచి సంతోషాంతరంగుడై స్తబ్ధుడయ్యాడు.
రుద్రుడెందుకో క్రోధాగ్నితో భీతావహంగా నృత్యిస్తున్నాడు. అది యుగాంత సూచన అన్నట్టుగా ఉంది. అంతటా నిశ్శబ్దం. ఎవరూ రుద్రుడికి అంతరాయం కలిగించడానికి సాహసించలేదు.

కొంత సమయం అయిన తరువాత హరుడు హరిని గమనించి, నృత్యహేళ ఆపి, ‘ఏం బావా! ఇలా దయచేశారు? ఊరక రారు కదా మహాత్ములు’ అన్నాడు.

‘బావా! నీతో ఒక విషయం చర్చించాలనుకున్నాను. అలాగే, నా చెల్లి గిరిజ (పార్వతి)ని చూసి చాలా రోజులైంది. పలకరించి మీ ఇంట మృష్టాన్న భోజనం స్వీకరించాలనే కోరికతో వచ్చాను’ అని బదులిచ్చాడు విష్ణువు.

‘బావా! నీ రాక మాకెంతో అదృష్టం. ఈ రోజు ఎంతో సుదినం. అన్నపూర్ణాదేవి చేతి వంట తిన్న తరువాత వేరే భోజనం రుచించదు’ అన్నాడు సంతోషంగా శివుడు.

విష్ణుమూర్తి సోదరి ఇంట భోజనాదులు పూర్తి చేశాడు. భగినీ హస్త భోజనం (సోదరి స్వయంగా వండి సోదరుడికి వడ్డించడాన్ని భగినీ హస్త భోజనం అంటారు) అయిన తరువాత విష్ణువు తాంబూలం వేసుకుని తీరికగా కూర్చున్నాడు.

ఈశ్వరుడు, ‘ఇప్పుడు చెప్పు బావా! నీ రాకకు కారణం ఏమిటి?’ అని అడిగాడు.

‘ఏమీ లేదు బావా! అయినా లయకారకుడివి. నీకు తెలియదా? ద్వాపర యుగాంతం కాబోతున్నది. కౌరవ, పాండవులనే అన్నదమ్ములు మహా సంగ్రామం చేస్తున్నారు. నేటికి ఏడవ రోజు’ అన్నాడు విష్ణువు.

‘అదేమి బావా! నువ్వు కృష్ణావతారంలో అక్కడే ఉన్నావు కదా! యుద్ధ నివారణకు రాయబారం నడిపినావు కదా! అంతా ఉత్తుత్తేనా?’ అని పరిహాసమాడాడు పరమశివుడు.

‘ఎంత మాట బావా! నా శక్తివంచన లేకుండా ఇరుపక్షాలకూ చెప్పి చూశాను. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? అయినా ఇప్పటికి మహా భారత యుద్ధం మొదలై ఏడు రోజులైంది. ఎందరో మృతి చెందారు. నీకు లయ భోజన (అంటే అంతమందినీ నీలో లయం చేసుకున్నావు కదా అని అర్థం)మైంది కదా’ అని విష్ణువు ఎదురు పరిహాసమాడాడు.
వెంటనే పరమశివుడు కోపోద్రిక్తుడై, ‘నా మూడో నేత్రాన్ని తెరిచి ఈ సృష్టి మొత్తాన్ని ఇప్పుడే భస్మీపటలం చేస్తాను. ఇక ఏ సృష్టీ లేదు. నా నిర్గుణానందంలో నేనుంటాను’ అని హుంకరించాడు.

అక్కడే ఉన్న బ్రహ్మదేవుడు శివుడి కోపాగ్నిని చూసి గజగజలాడాడు. భయంతో నిరుత్తరుడై, ‘నా వయసు ఇప్పుడు యాభై ఒక్క సంవత్సరాలు (ద్వితీయ పరార్థే). సృష్టి విలయం జరిగితే నేను అర్థాయుష్కుడిని కానా?. ఇంతటితో నా జీవితం ముగియాల్సిందేనా’ అని దీనంగా విష్ణువు వంక చూశాడు.
‘నేను అటు పరబ్రహ్మను చేరక, ఇటు ఉన్న చోట ఉండక కిందకు రాక త్రిశంకు స్వర్గంలాంటి జీవితమా నాది?’ అని బ్రహ్మ మనసులోనే అనుకున్నాడు.

అంతలో పార్వతి కల్పించుకుంది.

‘అన్నా! ఈ మాయా నాటకాన్ని నాథుడు (నా భర్త/సృష్టి భర్త)అప్పుడే ముగిస్తాడా?’ అని విష్ణువు వంక చూసి పరిస్థితిని సైగతో చక్కబెట్టమని చెప్పింది.

అప్పుడు విష్ణువు బ్రహ్మ, పార్వతిలను ఉద్దేశించి, ‘మీరేమీ భయపడకండి. నేను యుగాంతంలో సృష్టి విత్తనాలు తీసుకుని వెళ్తాను. మళ్లీ కలియుగంలో మన మాయా నాటకం మొదలుపెడదాం. మా బావ కోపం ఎంత ఎంతసేపు? నేను అనునయిస్తాను కదా! ఇక పదకొండు రోజులే (మహా భారత యుద్ధం మొత్తం పద్దెనిమిది రోజులు జరిగింది. ఈ శివ-కేశవుల కలయిక నాటికి ఏడురోజులైంది) కదా సర్వనాశనం కావడానికి మిగిలింది’ అన్నాడు.
అనంతరం విష్ణువు శివుడితో, ‘బావా! నీకు తెలుసు కదా! సమరమందు నేను ఆయుధం ధరించబోనని. అలా అని అర్జునుడికి మాట ఇచ్చాను. నువ్వు ప్రసాదించిన పాశుపత దివ్యాస్త్రాలు అతడి వద్దే ఉన్నాయి. ఇప్పుడు భారత యుద్ధం రూపంలో ధర్మానికి హాని కలిగింది. నేను ఆ ధర్మరక్షణకే అవతరించిన విషయం నీకు తెలుసు. కొద్దిరోజులు శాంతించు. ఇక తర్వాత పని నీదే కదా! ఆట (నృత్యం) సగంలో ఆపితే పార్వతి బాధపడదా?’ అన్నాడు.
‘సరే! మీ ఇష్టమే నా ఇష్టం. నాకు కావాల్సింది ధర్మస్థాపన. అది ఎలాగూ నువ్వు చేస్తావు కదా త్రివిక్రమా!’ అన్నాడు శివుడు.

‘బావా శివా! యుగాంతం ముగింపు మాత్రం చేసేది నువ్వే. అది నీ చేతుల్లోనే ఉంది. మాయా స్వరూపిణి అయిన నా సోదరి పార్వతి నీ ప్రళయ నృత్యానికి సాక్షిగా నిలుస్తుంది. నా స్వరూపంతో ఉద్భవించి కృష్ణ ద్వీపంలో తపస్సు చేసి వ్యాసుడనే నామధేయంతో వేద విభాగం చేసి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు రాస్తాడు. అష్టాదశ పురాణాలను రాసి భావి యుగాల జీవులకు మార్గదర్శనం చేస్తాడు. ఇక సమరభూమి అయిన భూలోకంలో తెగింపు నాది.. ముగింపు నీది. ఏమంటావు బావా!’ అంటూ విష్ణుమూర్తి.. పరమశివుడిని ఇలా స్తుతించాడు.
నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమ:
నమస్తే అస్తు ధన్వనే బాహూభ్యా మతతే నమ:
(‘ఓ రుద్రా! నీ క్రోధానికి, నీ బాణానికి, నీ ధనస్సుకు, నీ బాహువులకు నమస్కరించెదను. వీటిని మా యందు ప్రయోగింపవలదు’).

విష్ణువు ఇలా ప్రార్థించగానే శివుడు ఆయనను ఆలింగనం చేసుకున్నాడు. ‘నువ్వు వేరు.. నేను వేరా?’ అని ఆప్యాయంగా పలికాడు.

‘బావా! ఇక నాకు సెలవు ఇస్తావా?’ అని అడిగాడు విష్ణువు.
‘నా చెల్లికి నా ఆశీర్వచనాలు అందచేయి’ అని చెప్పాడు శివుడు.
విష్ణువుకు పార్వతీ పరమేశ్వరులు వీడ్కోలు పలికారు. జగత్తుకు తల్లిదండ్రులైన హరిహరుల లీలలు తెలుసుకోవడం ఎవరి తరం?

కర్మఫలం
కౌండిన్య మహర్షి ఒకసారి వైకుంఠానికి వెళ్లాడు. దారిలో ఎన్నో విచిత్ర దృశ్యాలు చూశాడు. వాటి గురించి మహా విష్ణువు వద్ద ప్రస్తావించాడు.
‘స్వామీ! ఒక మామిడిచెట్టు విరగకాసింది. సమృద్ధిగా ఆకులు, ఫలాలున్నా దానిపై ఒక్క పక్షీ వాలలేదు. మధ్యలో ఓ ఆవు కనిపించింది. చుట్టూ పచ్చని గడ్డి ఉన్నా అది తినలేకపోతోంది. అంతలో గంతులేస్తున్న ఏనుగు, కిందపడి దొర్లుతున్న గాడిద కనిపించాయి. వీటి అంతరార్థమేమిటో బోధపడలేదు’ అన్నాడు మహర్షి. అప్పుడు విష్ణువు మందహాసంతో, ‘మునివర్యా! తమరు చూసిన మామిడిచెట్టు గత జన్మలో వేద విద్వాంసుడు. అతడు పాండిత్యాన్ని తన వరకే పరిమితం చేసుకున్నాడు. తన జ్ఞానాన్ని ఎవరితోనూ పంచుకోలేదు. అందుకే ఈ జన్మలో పక్షులు వాలని చెట్టుగా మిగిలాడు. ఆ ఆవు పూర్వ జన్మలో బీడుభూమి. ఎవరికీ ఉపయోగపడని కారణంగా ఈ జన్మలో ఆకుపచ్చని గడ్డి కళ్లెదురుగా ఉన్నా తినలేని దైన్యస్థితిలో ఉంది. ఏనుగు, గాడిదలు గతించిన జన్మలో విశృంఖల జీవనాన్ని గడిపిన ఉద్వేగ స్వభావులు. వారి తుంటరితనం, దుడుకు ప్రవర్తనల వల్ల ఈ జన్మలో ఇలా గంతులేస్తూ, దొర్లుతూ బతకాల్సి వచ్చింది. పరులకు ఉపయోగపడని జీవమైనా, జడ పదార్థమైనా కర్మఫలాన్ని అనుభవించాల్సిందే’ అని వివరించాడు.

Review ప్రళయ కాలం.

Your email address will not be published. Required fields are marked *

Top