శరన్నవరాత్రులని అంటారు. ఇవి ఆశ్వయుజంలో వస్తాయి. మరి ఉగాదికి కూడా వసంత నవరాత్రులంటారు. ఇంకా ఇలాంటి నవరాత్రులు ఏడాదిలో ఎన్నిసార్లు వస్తాయి? ఎన్ని ఉన్నాయి? వసంత నవరాత్రుల ప్రాముఖ్యం ఏమిటి?
రుతువులను అనుసరించి మనకు ప్రతి సంవత్సరం ఐదు నవరాత్రులు వస్తాయి. ఈ ఐదు నవరాత్రులు అమ్మవారి (శక్తి) ఆరాధనకు సంబంధించినవే. వీటిలో దేవీ శరన్నవరాత్రులు (దసరా), వసంత నవరాత్రులు ముఖ్యమైనవి. వసంత నవరాత్రులు చైత్ర మాసంలో వస్తాయి. సంవత్సరాది (ఉగాది) పర్వదినంతో ఇవి ప్రారంభమవుతాయి. అంటే, ఉగాది (చైత్ర శుద్ధ పాడ్యమి)తో మొదలై చైత్ర శుద్ధ నవమితో ముగుస్తాయి. సంవత్సరాది నాడు ఉదయం వినాయక పూజతో వసంత నవరాత్రులకు శ్రీకారం చుడతారు. అమ్మవారిని ఈ సందర్భంగా కలశం రూపంలో లేదా జ్యోతి రూపంలో ప్రతిష్ఠించే ఆచారం కూడా కొన్నిచోట్ల ఉంది. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు. అలాగే తొమ్మిది రోజులు తొమ్మిది రకాలైన పిండివంటలను అమ్మవారికి నివేదిస్తారు. తొమ్మిదో రోజు (నవమి)న శ్రీరామనవమి ఉత్సవం. ఈ రోజు సీతారాములను పూజిస్తారు. వసంత నవరాత్రుల కాలం ఆధ్యాత్మికంగా వికాసం కలిగిస్తే.. మానసికంగా ఆహ్లాదం కలిగిస్తుంది. ఈ కాలంలో వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకే వసంత నవరాత్రుల సమయంలో నిర్వహించే ఆరాధనల్లో అందుకు అనుగుణమైన వంటకాల నియమాన్ని మన పెద్దలు ఏర్పరిచారు. ఉగాది నాడు ఉదయం పచ్చడిని నైవేద్యంగా చేసుకుని తినడం.. శ్రీరామ నవమి నాడు పానకం, వడపప్పు ఆస్వాదించడం ఈ ఆరోగ్య నియమాల్లో భాగమనే చెప్పాలి.
ఇక, ఏటా వచ్చే ఐదు నవరాత్రుల గురించి తెలుసుకుందాం..
చైత్ర మాసంలో వచ్చేవి వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చేవి శాకంబరీ నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో దేవీ శరన్నవరాత్రులు ఉంటాయి. ఇక, భాద్రపద మాసంలో గణేశ్ నవరాత్రులు, పుష్య మాసంలో శారదా నవరాత్రులు నిర్వహిస్తారు.
శ్రీరామ నవమి విధాయకృత్యం ఏమిటి? ఎలా జరుపుకోవాలి? అలాగే, రామ ప్రతిమను నిర్మించడం, దాన్ని దానం చేయడం అనే ఆచారాలు కూడా ఉన్నాయని అంటారు. వాటి గురించి వివరించండి.
శ్రీరామ నవమి నాడు రామ ప్రతిమను రూపొందించి, దాన్ని దానం చేయడం అనే సంప్రదాయం కొన్నిచోట్ల ఉంది. రామ ప్రతిమను ఎలా నిర్మించాలో, దానిని ఎలా దానం చేయాలో లింగ పురాణం, రామార్చన చంద్రికలలో వివరంగా ఉంది.
‘చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది) నుంచి శ్రీరామ నవరాత్రులు ఆరంభమవుతాయి. నవమి నాడు సీతారామ కల్యాణం జరుగుతుంది. ఈ తొమ్మిది రోజుల్లో రామాయణ పారాయణం, రాత్రిళ్లు రామకథా కాలక్షేపం చేయాలి. నవమి నాడు రామ జనన ఘట్టం చదివి వినిపించి, పూజాధికాలు చేయాలి. పానకం, పణ్యారము (వడపప్పు) ప్రసాదంగా పంచాలి. దశమి నాడు పట్టాభిషేక ఘట్టం పఠించాలి. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి దేవీ నవరాత్రులు నిర్వహించాలి. నవమితో నవరాత్రులు ముగించాలి’.
రామ జయంతి నాడే సీతారాముల కల్యాణం నిర్వహించడం విశేషం. ఇది ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే పాటించే ఆచారం. లోక కల్యాణార్థమై అవతరించిన ఆ రాముడికి ఉత్సవ కృతజ్ఞతగా ఈ సంప్రదాయాన్ని ఏర్పరిచారనే భావన ఉంది. అయితే దీనికి సరైన ఆధారాలు లేవు. భద్రచలంలో ఈనాడు మహా వైభవంగా రామ కల్యాణం జరుగుతుంది.
శ్రీరామ నవమి సందర్భంగా గరుడు, అశ్వ, హంస, పుష్ప పల్లకి, కల్పవృక్ష, గజ, శేష వాహనాలపై సీతారామ లక్ష్మణ, ఆంజనేయస్వామి వార్లను తిరువీధులలో ఊరేగిస్తారు. చివరి రోజు వివిధ పూలతో, బొమ్మలతో, ముగ్గులతో అలంకరించిన రథంపై స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు. ప్రజలు తండోపతండాలుగా వచ్చి, బారులుదీరి, కర్పూర హారతులు, నారికేళ ఫలాలు, కదళీ ఫలాలతో స్వామి, అమ్మవార్లను అర్చించి తమ భక్తిని చాటుకుంటారు. అమితమైన భక్తి, ముకుళిత హస్తాలతో చేతులు జోడించి నమస్కరించి రామనామం జపిస్తూ, మనసులో ‘సీతమ్మ మాయమ్మ. శ్రీరాముడు మాకు తండ్రి’ అనుకుంటూ కనులారా తనివిదీరా చూసి ఆనందించి తరిస్తారు. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు రామ నవరాత్రులను జరుపుతారు.
Review మనకు ఏడాదికి ఎన్ని నవరాత్రులు?.