
మాఘ మాసంలో చేసే స్నానాలు మహా పుణ్యప్రదమైనవి. ఈ మాసంలో ప్రతిరోజూ నియమ నిష్టలతో స్నానాలు చేయడం, వ్రతాలు ఆచరించడం ఆచారంగా ఉంది. వీటినే మాఘ ప్నానాలు, మాఘ వ్రతాలు అని అంటారు. ప్రతిరోజూ స్నానం, పూజ, మాఘ పురాణ పఠనం కానీ శ్రవణం (వినడం) కానీ చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. మాఘ మాసంలో చేసే వ్రతాలు.. మాఘ మాసంలో చేసే స్నానాలు.. వాటి వల్ల కలిగే శుభ ఫలితాల గురించి మన హైందవ గ్రంథాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. మరి ఆ విశేషాలేమిటో ‘ఈ మాసం ప్రత్యేకం’ శీర్షికలో తెలుసుకుందాం..
రఘు వంశంలో సుప్రసిద్ధుడైన రాజు దిలీపుడు. ఆయన ఒకనాడు వేటాడుతూ హిమాలయ పర్వత ప్రాంతాలలోని ఒక సరసు వద్దకు వెళ్లాడు. అక్కడ ఒక ముని తపస్సు చేసుకుంటూ రాజుకు కనిపించాడు. ఆయన రాజును చూసి, ‘ఈ రోజే మాఘ మాసం ప్రారంభమైంది. నిన్ను చూస్తుంటే మాఘ స్నానం చేసినట్టు లేవు. వెంటనే ఆ పని చెయ్యి’ అని చెప్పాడు. ‘ఈ విషయంలో నీకింకా ఏమైనా సందేహాలు ఉంటే మాఘ స్నానం ఫలితాల గురించి నీ రాజ గురువు వశిష్ఠుడిని అడుగు. ఇంకా వివరంగా చెబుతాడు’ అని ఆ ముని వెళ్లిపోయాడు.
దిలీపుడు అక్కడున్న సరస్సులో స్నానం చేసి ఇంటికి వెళ్లాడు. వశిష్ఠ మహర్షికి కలిసి మాఘస్నానం ఫలితం గురించి చెప్పాలని కోరాడు.
అప్పుడు వశిష్ఠుడు మాఘ స్నాన ఫలితాల గురించి రాజు దిలీపుడికి వివరంగా చెప్పాడు.
‘మాఘ మాసంలో ఒకసారి ఉషోదయ స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం. ఇక మాసం పొడవునా చేస్తే లభించే పుణ్యం, ఫలం అంతా ఇంతా కాదు. పూర్వం ఒక గంధర్వుఉడు ఒకసారి మాఘ స్నానం చేస్తేనే ఆన మనస్తాపం అంతా పోయింది. ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నా ముఖం మాత్రం పూర్వజన్మ పాపం వల్ల వికారంగా ఉండేది. ఆ గంధర్వుడు ఒకసారి భృగు మహర్షి వద్దకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు. తనకు అన్ని సంపదలు, అన్ని శక్తులు ఉన్నా ముఖం మాత్రం పులి ముఖాన్ని తలపించేలా వికారంగా ఉందని, ఏం చేసినా అది పోవడం లేదని చెప్పుకుని బాధపడ్డాడు. గంధర్వుడి వ్యధను గమనించిన భృగు మహర్షి అది మాఘ మాసం కావడం వల్ల వెంటనే వెళ్లి గంగానదిలో స్నానం చేయాలని, పాపాలు, వాటి వల్ల సంక్రమించే వ్యథలు నశిస్తాయని చెప్పాడు. వెంటనే గంధర్వుడు సతీసమేతంగా వెళ్లి గంగానదిలో మాఘ స్నానం చేశాడు. భృగువు చెప్పినట్టుగానే స్నానం చేయగానే గత జన్మకు సంబంధించిన పాపాలు హరించిపోయాయి. గంధర్వుడికి వికార రూపు పోయి ముఖం సౌందర్యవంతంగా మారింది’ అని వశిష్ఠుడు దిలీపుడికి మాఘ స్నానం వల్ల కలిగే ఫలం గురించి వివరించాడు.
ఇంద్రుడి దుర్బుద్ధి.. మాఘ స్నానంతో ప్రాయశ్చిత్తం
పరస్త్రీ వ్యామోహం కూడదని, అది పరమ పాపకరమని మన హైందవ ధర్మం బోధిస్తోంది. దానికి ఉదాహరణగా నిలిచే కథ ఒకటి మాఘ పురాణం తొమ్మిదో అధ్యాయంలో ఉంది. మాఘ స్నానం వల్ల కలిగే పుణ్య ఫలాన్ని గురించి వివరించడం ఈ కథ ఉద్దేశం. ఆ పుణ్య ఫలంతో పాటు తెలిసీ తెలియక పరస్త్రీ వ్యామోహాన్ని ఎవరూ ఎప్పుడూ పొందకూడదనే హెచ్చరిక కూడా ఈ కథలో అంతర్లీనంగా ఉంటుంది.
పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేదపాఠాలు నేర్పుతూ ఉండేవాడు. తుంగభద్ర నదీ తీరంలోని ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం నిరంతరం శిష్యుల వేద పఠనంతో మారుమోగుతూ ఉండేది. మిత్రవిందుడికి అందమైన, సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ జీవితాన్ని గడుపుతూ భార్యతో కలిసి ఆచారాలను నెరవేర్చే వాడు మిత్రవిందుడు. ఇలా ఉండగా ఒకనాడు రాక్షస సంహారం కోసం దిక్పాలకులను, శూరులైన దేవతలను వెంటబెట్టుకుని ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమంలో కనిపించిన మిత్రవిందుని భార్యను చూసి మోహించాడు. అప్పటికి అవకాశం లేక దేవతలు, దిక్పాలకులతో కలిసి రాక్షసులను సంహరిస్తూ ఇంద్రుడు ముందుకు వెళ్లిపోయాడు. కానీ, అతడి మనసు మాత్రం ముని పత్ని మీదే ఉంది. రాక్షస సంహారం చేస్తూనే ఒకరోజున తెల్లవారుజాము వేళ ఇంద్రుడు మిత్రవిందుడి ఆశ్రమానికి వచ్చాడు. ఆ సమయంలో ఇంద్రుడిని చూసిన మిత్రవిందుడు, ‘ఎవరు నువ్వు? ఈ సమయంలో ఎందుకు వచ్చావు? నీకు ఏం కావాలి?’ అని గట్టిగా ప్రశ్నించాడు.
‘నేను దేవేంద్రుడిని’ అని ఇంద్రుడు గొప్పగా చెప్పుకున్నాడు. ‘వేళ కాని వేళ ఏం కోరుకుని ఇక్కడకు వచ్చావు?’ అని మిత్రవిందుడు మళ్లీ గట్టిగా అడిగాడు. ఆ ప్రశ్నతో ఇంద్రుడు తలదించుకోవడం తప్ప బదులు ఇవ్వలేకపోయాడు.
ముని తన దివ్యశక్తితో అంతా గ్రహించాడు. వచ్చిన వాడు ఇంద్రుడని, అతని మనసులో దుర్బుద్ధి ఉందని తెలుసుకున్నాడు.
ఇంద్రుడు దేవతలకు ప్రభువే అయినా, అతనిలో ఉన్న చెడు తలంపు కారణంగా అతడిని ఉపేక్షించదలుచుకోలేదు మిత్రవిందుడు.
‘పాపానికి పూనుకుని ఇక్కడకు వచ్చావు. కాబట్టి నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుంది. ఇక్కడి నుంచి నువ్వు తిరిగి స్వర్గానికి వెళ్లే దివ్యశక్తులు కూడా నశిస్తాయి’ అని ముని తీవ్రంగా శపించాడు.
కొద్ది సమయానికే ఆ శాపం రూపుదాల్చింది. ఇంద్రుడికి మిగతా శరీరమంతా బాగానే ఉన్నా ముఖం మాత్రం గాడిద రూపు వచ్చింది. చెవులు నిక్కబొడుచుకుని ఉన్నాయి. తన ముఖాన్ని తడిమి చూసుకుని, భయంకరంగా ఉన్న ఆ రూపాన్ని చూసుకుని ఇంద్రుడు భయపడ్డాడు. తన దురాలోచనలకు సిగ్గుపడ్డాడు. దిశ్యశక్తులన్నీ నశించి అందవిహీనమైన ముఖం ప్రాప్తించినందుకు ఎంతో బాధపడ్డాడు. ఆ ముఖంతో పాటు ఇంద్రుడికి బుద్ధి కూడా మారిపోయింది. అక్కడున్న గడ్డి, ఆకులు తినడం మీద మనసు మళ్లింది. ఇంద్రుడు తన విచిత్ర పరిస్థితికి దు:ఖిస్తూనే సమీపం అరణ్యంలో ఉన్న కొండ గుహలోనికి వెళ్లాడు. ఎవరికీ తన దుస్థితిని గురించి చెప్పుకోలేని దయనీయ స్థితికి దు:ఖిస్తూ ఆ గుహలోనే దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు గడిపాడు. ఇంద్రుడు స్వర్గంలో లేడని, ఎటో వెళ్లిపోయాడని దేవతలంతా అతడి కోసం వెతుకుతున్న విషయాన్ని రాక్షసులు తెలుసుకున్నాడు. వెంటనే ఎక్కడెక్కడి రాక్షసులంతా ఒకచోటకు చేరి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. స్వర్గవాసులంతా చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు.
కొందరు స్వర్గలోకవాసులు జరిగిన ఉపద్రవాన్ని గ్రహించి విష్ణువు గురించి తపస్సు చేశారు. ఆయన ప్రత్యక్షం కాగానే తమ బాధనంతా చెప్పుకున్నారు. అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోరమైన ఆలోచన, దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని గురించి దేవతలకు వివరించి అందువల్లే ఈ కష్టాలు వచ్చాయని చెప్పాడు. ఒక్కడు తప్పు చేసినా అతడిని అనుసరించి ఉండేవారికి కష్టాలు తప్పవని, ఒక్కడి పాపాన్ని అందరూ అనుభవించాల్సి రావడం అంటే ఇదేనని వారికి చెప్పాడు. మరి, ఇంద్రుడికి ఈ శాపం పోయి దేవతలంతా సుఖంగా ఉండాలంటే ఏం చేయాలో ఉపాయం చెప్పాలని దేవతలంతా విష్ణువును ప్రార్థించారు.
మాఘ మాసంలో ఒక్కరోజున నియమంగా నదీ స్నానం చేసినా చాలు ఎంతో పుణ్యం లభిస్తుందని, సర్వ పాపాలు నశిస్తాయని విష్ణువు వారికి చెప్పాడు. ఇలా చెప్పి, ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న పర్వత గుహ ఉన్న ప్రాంతం గురించి విష్ణువు దేవతలకు తెలిపి, ‘ఈ శచీపతిని తెచ్చి తుంగభద్ర నదిలో మాఘ మాసంలో స్నానం చేయించండి. అప్పుడు పరిస్థితి అంతా చక్కబడుతుంది’ అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. కాకతాళీయంగా ఇదంతా జరిగింది మాఘ మాసంలోనే కావడంతో వెను వెంటనే దేవతలంతా గాడిద ముఖంతో గుహలో దాక్కుని రహస్యంగా గడుపుతున్న ఇంద్రుడి వద్దకు వెళ్లి ఆయనకు తీసుకుని వచ్చి తుంగభద్ర నదిలో స్నానం చేయించారు. ఆ పుణ్య ఫలంతో ఇంద్రుడి పాపం నశించి మళ్లీ మామూలు రూపం లభించింది.
మాఘ స్నాన పుణ్యఫలాన్ని వివరించే కథ..
పూర్వం ఆంధ్ర దేశంలో సుమంతుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతడి భార్య పేరు కుముద. ఆమె చాలా పద్ధతి గల మహిళ. చాలా ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపుతుండేది. అయితే కుముద ఎంత ధర్మాత్మురాలో సుమంతుడు అంత అధర్మపరుడు. అడ్డదారుల్లో ధనం సంపాదించడమే తప్ప ఏనాడూ దానధర్మాలు చేసేవాడు కాదు. సంపాదించిన ధనమంతా లోభ గుణంతో దాచిపెడుతుండే వాడు. ఇంకా అక్రమ, అన్యాయ మార్గాల్లో ఎంత కూడబెట్టాలా? అని నిరంతరం ఆలోచిస్తుండే వాడు.
ఇలా ఉండగా, ఒకనాడు సుమంతుడు ఏదో పని మీద గ్రామాంతరం వెళ్లాడు. ఆ రోజున బాగా మబ్బులు పట్టి వర్షం జోరుగా కురవడం ప్రారంభించింది. అర్ధరాత్రి సమయానికి వయసు మళ్లిన ఒక సాధువు వానలో తడుస్తూ సుమంతుడి ఇంటికి వచ్చాడు. సుమంతుడు వేరే పనిపై ఊరికి వెళ్లాడు కదా! ఆ సమయంలో ఇంట్లో సుమంతుడి భార్య కుముద ఒక్కర్తే ఉంది. ఆ సాధువు తన పరిస్థితిని చెప్పి ఆ రాత్రికి ఇంట్లోనే ఉంటానని, అందుకు అనుమతించాలని ఆమెను కోరాడు.
కుముద పెద్దలను, వృద్ధులను గౌరవించడం, అతిథి మర్యాదల గురించి తెలిసిన ఉత్తమురాలు కావడంతో ఆమె సాధువును సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి పరిచర్యలు చేసింది. సాధువు ఆ రాత్రి చలి, వాన బాధలు పోగొట్టుకుని హాయిగా నిద్రించాడు. తెల్లవారుజామున సమయంలో ఆ సాధువు మేల్కొని హరినామ స్మరణ చేయడం ప్రారంభించాడు. ఈ సంకీర్తనలు విన్న కుముద కూడా నిద్ర లేచింది. అనంతరం వృద్ధుడు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఉద్యుక్తుడు కాసాగాడు.
‘అంత వేకువనే ఎక్కడికి వెళ్తున్నారు?’ అని కుముద ఆయనను అడిగింది.
తాను మాఘ స్నాన వ్రతం చేస్తున్నానని, సమీపంలోని నదికి వెళ్లి స్నానమాచరిస్తానని ఆ సాధువు బదులిచ్చాడు.
ఆయన మాటలతో మాఘ స్నాన వ్రతంపై కుముదకు ఆసక్తి కలిగింది. ఆ వ్రతానికి సంబంధించిన వివరాలన్నీ అడిగి తెలుసుకుంది. ఆ వ్రతం వల్ల కలిగే పుణ్యఫలాన్ని తాను కూడా పొందాలని అనుకుంది.
వెంటనే తాను కూడా మాఘ స్నాన వ్రతం చేస్తానంటూ ఆ సాధువు కూడా వెళ్లి స్నానమాచరించింది.
కొద్దిరోజులకు సుమంతుడు ఊరి నుంచి తిరిగి వచ్చాడు. రోజూ మాదిరిగానే కుముద ఆ ఉదయం కూడా నిద్ర లేచి మాఘ స్నానానికి బయల్దేరింది. భర్తను కూడా తనతో రావాలని కోరింది.
దైవ ద్వేషి, దురాత్ముడు అయిన సుమంతుడు ఆమె కోరికను తిరస్కరించాడు. ఆమె వెంట మాఘ స్నానానికి వెళ్లకపోగా, ఆమెను, స్నాన ఫలాన్ని గురించి హేళన చేశాడు. పైగా తాను స్నానానికి వెళ్లకపోవడమే కాక తన భార్యను కూడా స్నానానికి వెళ్లవద్దని అదుపు చేశాడు.
కానీ, కుముద సద్భక్తి నిండిన ఇల్లాలు కావడంతో ఎలాగో భర్త కంటపడకుండా వెళ్లి ఆ రోజుకు మాఘ స్నానాన్ని ఆచరించింది. ఈ విషయం తెలుసుకున్న సుమంతుడు ఆమెపై నిఘా పెట్టాడు. మర్నాడు కూడా ఆమె నదీ స్నానానికి వెళ్లడం కనిపెట్టాడు. తన మాట కాదని, తనకు తెలియకుండా నదీ స్నానానికి ఎందుకు వెళ్లావంటూ ఒక కర్ర తీసుకుని ఆమె వెంట పట్టాడు. అప్పటికే ఆమె నదిలో మునుగుతూ హరినామ స్మరణతో స్నానం చేస్తుంది.
ఆమెను కొట్టే ప్రయత్నంలో సుమంతుడు కూడా నదిలోకి దిగి ఆమెను కర్రతో కొట్టడానికి యత్నించాడు. అయితే ఆమె ఆ కర్రను గట్టిగా పట్టుకుని గుంజుతూ తప్పించుకునే ప్రయత్నంలో భర్తను కూడా గట్టిగా నీళ్లలోకి లాగింది. దీంతో అతడు నీటమునుగుతూ తేలుతూ ఉండటంతో సుమంతుడు కూడా ఆ రోజు నదీ స్నానం చేసినట్టయింది. చివరకు ఎలాగో భార్యను గట్టిగా పట్టుకుని నదిలోంచి ఆమెను బయటకు లాగి ఇంటికి తీసుకువచ్చాడు.
ఆ తరువాత చాలా కాలం గడిచింది. అంత్యకాలంలో దైవికంగా ఆ భార్యాభర్తలిద్దరూ ఒకేసారి మరణించారు. మాఘస్నాన పుణ్య ఫలం, దానధర్మాల ఫలితంగా కుముదను తీసుకువెళ్లడానికి ముందుగా విష్ణుదూతలు వచ్చారు. దైవదూషణ, అధర్మ ప్రవర్తనతో కాలం గడిపిన నేరానికి సుమంతుడిని యమదూతలు వచ్చి సుమంతుడిని యమలోకానికి తీసుకుని వెళ్లారు. అక్కడ చిత్రగుప్తుడు సుమంతుడి పాపాలన్నీ లెక్కగట్టి ఘోర నరక శిక్షను విధించాడు. అయితే భార్యను మాఘ స్నానం నుంచి విరమించే యత్నంలో ఆమెతో కొట్లాడుతూ, పెనుగులాడుతూ తాను కూడా అనుకోకుండా నదిలో దిగి మునిగిన ఫలితంగా అతడికి కూడా కొంత మాఘ స్నాన ఫలం దక్కింది. ఆ పుణ్యం ఫలితంగా అతడికి నరకలోక శిక్ష తప్పింది. అతడిని వైకుంఠానికి పంపాలని చిత్రగుప్తుడు ఆదేశించాడు.
మాఘము అంటే..
మాఘము అనే పదానికి సంస్క•తంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకు ఉన్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది పాపాలను నశింపచేసే మాసం. అందుకే ఇది పుణ్య మాసం. ఇది హరిహర ప్రీతికర మాసం. మాధవ మాసం. స్థూల అర్థంలో మాధవుడు అంటే భగవంతుడు. శివుడైనా, విష్ణువైనా ఎవరైనా ఒక్కటే అని చెప్పే మాసమే ఈ మాఘమాసం. ఇంకా ఈ మాసంలో సూర్యుడిని, గణపతిని ఇతర దేవతలను కూడా పూజిస్తూ వ్రతాలు ఆచరిస్తారు.
Review మహా పుణ్యం.. మాఘ స్నానం.