
అరణ్యవాసంలో పాండవులు ద్వైతవనంలో గడుపుతున్నారు. ధర్మరాజు తమ్ములతో కలసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా, ఒక బ్రాహ్మణుడు పరుగు పరుగున అక్కడకు వచ్చాడు.
‘ధర్మరాజా! నా అరణిని ఒక చెట్టు కొమ్మల్లో దాచుకున్నాను. ఒక మాయదారి జింక వచ్చి ఆ చెట్టు కొమ్మలను అందుకుంది. నేను అరణిని దాచుకున్న కొమ్మ దాని కొమ్మల్లో చిక్కుకుపోయింది. అరణి లేకుంటే నాకు నిత్య విధులు సాగవు. దయచేసి నా అరణిని నాకు అందించు’ అని ప్రాథేయపడ్డాడు.
‘కంగారు పడకండి బ్రాహ్మణోత్తమా! మీ అరణిని మీకు అందచేస్తాం’ అని భరోసా ఇచ్చాడు ధర్మరాజు.
తమ్ముళ్లతో కలసి జింకను వెతుకుతూ ధర్మరాజు అడవిలోకి వెళ్లాడు. కొంత దూరం వెళ్లే సరికి జింక కనిపించింది. పాండవులు పుంఖాను పుంఖాలుగా బాణాలు ప్రయోగించినా ఒక్కటీ దానికి తగల్లేదు. పరుగు తీస్తూ అది అంతర్థానమైంది. జింక కోసం వెదికి వేసారిపోయిన ధర్మరాజు తముళ్లతో కలసి ఒక చెట్టు కింద కూర్చుకున్నాడు. అందరికీ దాహం వేయసాగింది.
‘నకులా! చెట్టెక్కి దగ్గరలో ఎక్కడైనా నీరుందేమో చూడు’ అన్నాడు ధర్మరాజు.
నకులుడు చెట్టెక్కి నలువైపులా చూశాడు.
చెట్టు దిగి దగ్గరలోనే మడుగు ఉందని అన్నకు చెప్పాడు.
‘నువ్వు మొదట వెళ్లి నీళ్లు తాగి రా! తరువాత మా కోసం కూడా తీసుకుని రా’ అని ధర్మరాజు చెప్పాడు.
నకులుడు మడుగు వద్దకు వెళ్లాడు.
అందులోకి దిగి నీళ్లు తాగబోతుంటే, అశరీరవాణి వినిపించింది-
‘ఈ తటాకం నాది. ఇక్కడ నీరు తాగాలంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వాటికి సరైన సమాధానాలు చెబితేనే నీళ్లు తాగే అవకాశం లభిస్తుంది’ అని పలికింది.
బాగా దాహంతో ఉన్న నకులుడు అశరీరవాణి మాటలను పట్టించుకోలేదు. మొండిగా మడుగులోకి దిగి, దోసిలి నిండా నీరు తీసుకుని తాగాడు. అంతే.. కొద్ది క్షణాల్లోనే అచేతనంగా అక్కడ కుప్పకూలిపోయాడు.
నకులుడు ఎంతసేపటికీ రాకపోయే సరికి ధర్మరాజు సహదేవుడిని పంపాడు.. ఏం జరిగిందో చూసి రమ్మని.
నకులుడి గురించి వెతుక్కుంటూ మడుగు వద్దకు వెళ్లిన సహదేవుడికీ నకులుడి మాదిరిగానే అశరీరవాణి మాటలు వినిపించాయి.
సహదేవుడు కూడా ఆ మాటలను ఖాతరు చేయలేదు. మడుగులోకి దిగి నీళ్లు తాగుతుండగానే అతనూ కుప్పకూలి పడిపోయాడు.
దీంతో ధర్మరాజు వరుసగా అర్జునుడినీ, భీముడినీ పంపాడు. అందరికీ నకులుడికి పట్టిన గతే పట్టింది.
నీళ్ల కోసం వెళ్లిన నలుగురు సోదరులు వెళ్లిన వాళ్లు వెళ్లినట్టే వెళ్లి తిరిగి రాకపోవడంతో ధర్మరాజు కలత చెందాడు.
ఇక లాభం లేదనే ఈసారి తానే తమ్ముళ్లను వెతుక్కుంటూ స్వయంగా తటాకం వద్దకు బయల్దేరాడు.
తటాకం ఒడ్డున అచేతనంగా పడి ఉన్న నలుగురు తమ్ముళ్లనూ చూశాడు.
అప్పటికే దాహంతో ఉన్న ధర్మరాజు కాసిన్ని నీళ్లు తాగాలని అనుకున్నాడు. తాగిన అనంతరం తటాకంలోని నీళ్లను తమ్ముళ్లపై చల్లితే వాళ్లు లేచి కూర్చుంటారని భావించాడు. ఇలా ఆలోచిస్తూ ధర్మరాజు తటాకంలోకి దిగగానే, వెంటనే అశరీరవాణి వినిపించింది.
‘ధర్మజా! ఇది నా తటాకం. నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తరువాతనే ఇందులోని నీళ్లు తాగాలి. ఎవరికైనా ఇదే షరతు వర్తిస్తుంది. అలా కాదని, నీళ్లు తాగితే నీ తమ్ముళ్లకు పట్టిన గతే నీకూ పడుతుంది’ అని అశరీరవాణి వినిపించింది.
‘అయ్యా! నువ్వు ఎవ్వరివో మామూలు మనిషివి కావు. నువ్వు అడిగినట్టే నాకు తెలిసినంత మేరకు నీ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను. అయితే, ఒక్క షరతు. ప్రశ్నలు అడిగే ముందు నీ నిజ స్వరూపం ఏమిటో ప్రదర్శించు’ అని ధర్మరాజు వేడుకున్నాడు.
‘సరే’నంటూ నిజరూపంలో ఒక యక్షుడు ధర్మరాజు ముందు ప్రత్యక్షమయ్యాడు.
‘ఇప్పుడు నీ ప్రశ్నలు అడుగు’ అని ధర్మరాజు అన్నాడు.
యక్షుడు ఈ కింది విధంగా ధర్మరాజుకు ప్రశ్నలు సంధించాడు.
‘భూమి కన్నా బరువైనది ఏది?’
‘తల్లి’ అని బదులిచ్చాడు ధర్మరాజు.
‘గాలి కంటే వేగమైనది ఏది?’
‘మనసు’
‘రూపం ఉన్నా హృదయం లేనిది?’
‘రాయి’
‘లోకంలో గల అన్ని ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మం ఏది?’
‘అహింస’
‘లోకానికి దిక్కు?’
‘సత్పురుషులు’
‘ఆత్మవిద్యలో మనిషికి సహాయపడగలిగేవి ఏమిటి?’
‘మనసు, ప్రాణం, ఇంద్రియ నిగ్రహం’
‘ఆకాశం కంటే ఎత్తయిన వ్యక్తి ఎవరు?’
‘తండ్రి’
‘సూర్యుడిని ఉదయింప చేసేది ఎవరు?’
‘బ్రహ్మం’
సూర్యుడి చుట్టూ తిరిగే వారెవరు?’
‘దేవతలు’
‘మనిషికి ఆపదలో సహాయ పడేది ఎవరు?’
‘ధైర్యం’
‘మనిషి మానవత్వాన్ని ఎలా పొందగలుగుతాడు?’
‘అధ్యయనం వల్ల..’
‘మనిషికి సజ్జనత్వం ఎలా వస్తుంది?’
‘ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనసుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా, అలాంటి పనులు చేయకుండా ఉండాలి. అలా చేసిన వారికే సజ్జనత్వం లభిస్తుంది’
‘జన్మించి కూడా ప్రాణం లేనిది ఏది?’
‘గుడ్డు’
‘కీర్తికి ఆశ్రయం ఏది?’
‘దానం’
‘సుఖానికి ఆధారం ఏది?’
‘శీలం’
‘మనిషికి దైవిక బంధువులు ఎవరు?’
‘భార్య/భర్త’
‘నిద్రలో కూడా కన్నుమూయనిది ఏది?’
‘చేప’
‘రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?’
‘యజ్ఞం చేయడం వలన’
‘రైతుకు ఏది ముఖ్యం?’
‘వాన’
‘లోకాన్ని కప్పి ఉంచినది ఏది?’
‘అజ్ఞానం’
‘మనిషి వేటిని విడిచిపెడితే సర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అవుతాడు?’
‘వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడిచిపెట్టాలి’
‘సిగ్గు అంటే ఏమిటి?’
‘చేయరాని పనులంటే భయపడటం’
‘దయ అంటే ఏమిటి?’
‘ప్రాణులన్నిటి సుఖాన్ని కోరడం’
‘దు:ఖం అంటే ఏమిటి?’
‘అజ్ఞానం కలిగి ఉండటం వలన వచ్చేది’
‘నరకం అనుభవించే వారెవరు?’
‘ఆశపెట్టి దానం ఇవ్వని వాడు, వేదాలను, ధర్మశాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ ద్వేషించేవాడు, దానం చేయనివాడు’
ఇలా యక్షుడు చాలా ప్రశ్నలను అడిగాడు.
వాటన్నింటికీ ధర్మరాజు తన బుద్ధి కుశలతతో సమాధానాలు చెప్పాడు.
‘నీ సమాధానాలకు సంతోషించాను. నీ తమ్ముళ్లలో ఒక్కరిని మాత్రమే బతికిస్తాను. ఎవరిని బతికించాలో కోరుకో’ అన్నాడు యక్షుడు.
‘మహానుభావా! నకులుడిని బతికించు’ అని కోరాడు ధర్మరాజు.
‘పరాక్రమవంతులైన భీమార్జునులలో ఒకరిని ఎంచుకోకుండా, నకులుడిని బతికించాలని ఎందుకు కోరుతున్నావు?’ అని ప్రశ్నించాడు యక్షుడు.
‘అయ్యా! నా తండ్రి పాండురాజుకు ఇద్దరు భార్యలు. వారు కుంతి, మాద్రి. కుంతీపుత్రుల్లో నేను బతికే ఉన్నాను. అందువల్ల మాద్రీ పుత్రుల్లో ఒకరైనా బతికి ఉండటమే ధర్మం కదా! అందుకునే నకులుడిని బతికించాలని కోరాను’ అని బదులిచ్చాడు ధర్మరాజు.
‘ధర్మరాజా! నీ ధర్మనిరతి చాలా గొప్పది. నీ బుద్ధికి మెచ్చి నీ నలుగురు తమ్ముళ్లనూ బతికిస్తున్నాను’ అన్నాడు యక్షుడు.
అతడు అలా అనడమే తరువాయి.. భీమార్జున, నకుల సహదేవులు నిద్రలో నుంచి మేలుకున్నట్టుగా లేచి కూర్చున్నారు. క్షణాల్లో తన కళ్ల ముందు జరిగిన ఈ అద్భుతానికి ధర్మరాజు ఆశ్చర్యచకితుడయ్యాడు.
‘మహానుభావా! నువ్వు సామాన్య యక్షుడివి కాదు. నీ నిజ స్వరూపాన్ని చూపించు’ అని ధర్మరాజు వేడుకున్నాడు.
అక్కడ యక్షుడు రూపంలో యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు.
‘కుమారా! నిన్ను చూడాలని అనిపించింది. అందుకే ఈ ప్రదేశానికి చేరుకున్నాను. నన్ను ఆశ్రయించిన వారికి ఏ లోటూ రానివ్వను. ఏం కావాలో కోరుకో’ అన్నాడు యముడు.
‘మమ్మల్ని ఆశ్రయించిన ఒక బ్రాహ్మణోత్తముడి అరణిని ఒక జింక ఎత్తుకుపోయింది. అతడి అరణిని అతడికి ఇప్పించు. ఇంకేమీ వద్దు’ అని ధర్మరాజు ప్రార్థించాడు.
‘నీ మనసు గ్రహించాలని నేనే అరణిని దొంగిలించాను. జింక నా మాయాసృష్టి’ అంటూ యమధర్మరాజు తన చేతిలోని అరణిని ధర్మరాజు చేతికి అందించాడు.
‘మీ అరణ్యవాసం ముగిసి అజ్ఞాతవాసానికి సమయం ఆసన్నం అవుతోంది. అజ్ఞాతవాసంలో కోరుకున్న రూపాలను ధరించే శక్తిని మీకు అనుగ్రహిస్తున్నాను. మిమ్మల్ని ఎవరూ గుర్తుపట్టలేరు’ అని వరం ఇచ్చి యముడు అంతర్థానమయ్యాడు.
Review యుధిష్టరుడి ధర్మనిరతి.