విష్ణుచిత్తుని అతిథిసేవ

శ్రీకృష్ణదేవరాయల విరచిత ‘అముక్తమాల్యద’లోనిదీ కథ.

అది కలియుగం ప్రారంభమైన 46వ సంవత్సరం. పాండ్య దేశంలో శ్రీవల్లిపుత్తూరు అనే భవ్య నగరం ఉండేది. ఆ నగరం మింటినంటే మేడలతో, హంసల క్రీంకారాలు ధ్వనించే కొలనులతో, బాతులకు ఆశ్రయమైన కాలువలతో, ఉద్యానవనాలతో, మామిడి, అరటి మొదలైన తోటలతో అతి రమణీయంగా ఉండేది. నాలుగు వర్ణస్థులు సుఖశాంతులతో ఉండేవారు. ఆ ఊరి స్త్రీలు మేనికి పసుపు పూసుకుని, చెరువులో స్నానమాడి ఆ ఊరి దేవుడైన శ్రీమన్నారు కృష్ణస్వామి అభిషేకానికై బిందెలతో నీళ్లు తీసుకుని, పూజకు కలువలు కోసుకుని వెళ్లేవారు. పూజానంతరం గ్రంథాలను, ప్రబంధాలను చదువుతూ కాలక్షేపం చేసేవారు.
ఆ ఊరి ప్రజలు అతిథి కనిపించగానే సాష్టాంగ నమస్కారం చేసేవారు. స్వాగతం చెప్పి అతిథికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సేద తీర్చేవారు. టెంకాయ ఆకుల చాపపై కూర్చోబెట్టి, విశాలమైన అరటి ఆకు పరిచి భోజనం పెట్టేవారు. రాజనపు వరి అన్నం, పప్పు, నెయ్యి, ఎన్నో రకాల కూరలు, పాలు, పెరుగు ఇచ్చేవారు. అతిథి తృప్తిగా భుజించిన తరువాత తాంబూలమిచ్చి పాదసేవ చేసేవారు. అతిథి ‘వెళ్లి వస్తాను’ అనగానే శక్తికొద్దీ అతడిని సత్కరించి కొంతదూరం అతడితో కలిసి నడిచి సాగనంపేవారు. సేవ చేయడానికి అంత కొంచెమే అవకాశం దొరికిందని విచారిస్తూ తిరిగి వచ్చేవారు. ఈ విధంగా అతి శ్రద్ధతో ప్రతి రోజూ అతిథి అభ్యాగతుల సేవ చేసేవారు ఆ ఊళ్లోని గృహస్తులు.
అలాంటి ఉన్నత జీవనం సాగిస్తున్న శ్రీవల్లిపుత్తూరు ప్రజల మధ్యలో గరుత్మంతుడి అంశతో భట్టనాథుడనే భాగవతోత్తముడు జన్మించాడు. అతడు సమవర్తి. స్థితప్రజ్ఞుడు. కష్టసుఖాలను లెక్కించేవాడు కాదు. భట్టనాథుడు నిత్యం తులసిమాలలు, చెంగల్వదండలు కట్టి మన్నారు కృష్ణస్వామికి సమర్పించేవాడు. దేవాలయంలో ఉన్న వటపత్రశాయిని సేవించడం అతడికి నిత్యకృత్యం. ఏ విద్యలూ అభ్యసించకపోయినా జ్ఞానం, వైరాగ్యం కలిగి ఉండేవాడు. ఎల్లప్పుడూ విష్ణువునే ధ్యానిస్తూ ఉండేవాడు. అతడి నిష్కల్మష భక్తికి మెచ్చి శ్రీహరి అతడి హృదయంలో ఎల్లప్పుడూ నివసించేవాడు. అందుకనే భట్టనాథుడికి విష్ణుచిత్తుడనే సార్థక నామధేయం వచ్చింది.
‘మానవసేవే మాధవసేవ. భవతరణానికి నావ’ అనే సూక్తిని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు విష్ణుచిత్తుడు. అతడు ఎంతో భక్తితో అతిథిని సేవించి సేద తీర్చేవాడు. వానాకాలంలో వరి అన్నం, పప్పు, నాలుగైదు కూరలు, వరుగులు, వడియాలు, పెరుగు మొదలైన వాటితో అన్నం పెట్టేవాడు.
వేసవిలో ముందుగా అతిథి శ్రీచందనం ఇచ్చేవాడు. తాపం తీరిన తరువాత అతిథికి వేడి అన్నం, తియ్యని చారు, మజ్జిగ పులుపు, చెరకురసం, లేత టెంకాయ నీళ్లు, భక్ష్యాలు, ఫలాలు, సుగంధభర్తిమైన చల్లని నీళ్లు, వడపిందెలు, మజ్జిగ మొదలైన వాటితో విందు చేసేవాడు.
శీతాకాలంలో పునుగు వాసన గల రాజనపు అన్నం, మిరియాల పొడి, వేడివేడి కూరలు, ఆవపచ్చళ్లు, పాయసం, ఊరగాయలు, వేడిగా ఉన్న పెయ్యి, పాలు మొదలైన వాటిని ఇచ్చి అతిథిని సంతృప్తి పరిచేవాడు.

ఇతడు ఎంతటి భక్తుడంటే ఏ విద్యలూ నేర్వకుండానే ఆ దేశపు రాజైన వల్లభదేవుడికి నారాయణుడి పరతత్త్వం బోధించగలిగాడు. సాక్షాత్కరించిన విష్ణువుకు తన దిష్టి తగులుతుందేమోనని పరమాత్మకే మంగళశాసనం చేశాడు. గోదాదేవిని శ్రీహరికి కన్యాదానం చేసి లోకనాయకుడికే మామ అయినాడు.

Review విష్ణుచిత్తుని అతిథిసేవ.

Your email address will not be published. Required fields are marked *

Top