
వసంత రుతు శోభలకు వసంత పంచమి స్వాగతం పలుకుతుంది. అదే శ్రీపంచమిగా ప్రసిద్ధి.
అక్షర సంపద అంతటినీ లోక కల్యాణానికి వినియోగించడమే సరస్వతీ దేవికి అసలైన సమర్పణ.
శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణీ
వాసరా పీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే
వసంత పంచమి రోజున సరస్వతీదేవిని తెల్లటి వస్త్రాలతో అలంకరించి, తెల్లని పుష్పాలతో పూజించి చందనం, క్షీరాన్నం, పేలాలు, నువ్వుండలు, అటుకులు, చెరుకు ముక్కలను నివేదించాలని శ్రీమహావిష్ణువు నారదుడికి చెప్పినట్టు దేవీ భాగవతంలో ఉంది.
విద్యార్థులు సరస్వతిని పూజించి అనుగ్రహం పొందుతారు.
పుస్తకాలకు పసుపు రాసి దేవి ముందు
ఉంచి మంచి విద్యాబుద్ధులు అనుగ్రహించాలని ప్రార్థిస్తారు.
ఆయా వృత్తుల వారు పనిముట్లను దేవీరూపంగా భావించి వాటికి పూజ చేస్తారు
సరస్వతీదేవి హంసవాహిని.
శ్వేత వస్త్రాలను ధరించి హంస వాహనంతో తెల్లటి తామర పుష్పంపై చదువుల తల్లి కొలువుదీరి ఉంటుంది.
నాలుగు చేతులతో నాలుగు దిక్కుల్లో
ఉండటం సర్వవ్యాపకత్వానికి సంకేతం.
ఎడమచేతిలోని పుస్తకం సమస్త విద్యలకు చిహ్నం.
కుడిచేతిలో అక్షరమాల జ్ఞాన సూచిక.
హస్తభూషణమైన వీణ.. ఆమె సకల కళల అధిదేవత అని చాటుతుంది.
సరస్వతీదేవికి ఒక చేతి మీద చిలుక
ఉంటుంది.
అది మధురమైన పలుకులకు ప్రతీక.
సరస్వతి దేవి చేతిలోని పద్మం సంపదలకు సంకేతం.
పాశాంకుశాలు మనిషిలోని మనోకాలుష్యాన్ని హరింపచేసే ఆయుధాలకు సంకేతాలు.
పాలనీ, నీటినీ వేరు చేసే హంస మంచిచెడుల విచక్షణాజ్ఞానంతో మెలగాలని తెలియచేస్తుంది.
ఇన్ని శుభ లక్షణాల చదువుల తల్లి కాబట్టే ఆమెను కవులు, ‘అక్షరధామ శుక వారిజ పుస్తక రమ్యపాణి’ అని స్తుతించారు.
సరస్వతీదేవి రూపం ఆధ్యాత్మికతకు, తాత్త్వికతకు ప్రతిరూపం. ఆమెను వీణాపాణిగానూ కొలుస్తారు.
ఆమె రెండు చేతులతో వీణ పట్టుకుని దర్శనమిస్తుంది.
ఆ వీణకు ముప్పై రెండు మెట్లు
ఉంటాయి.
దాని పేరు కచ్చపి. యోగశాస్త్రం ప్రకారం.. మనిషి వెన్నెముకకు ముప్పై రెండు పూసలు ఉంటాయి. వీణాదండాన్ని సుషుమ్న నాడితో పోలుస్తారు.
మూలాధారం నుంచి సహస్రారం వరకూ సంచరించే ఈ నాడే మన ప్రాణం.
తల్లి చేతిలో వీణరాగాల వలే మన జీవనశైలి కూడా ఉంటుంది.
వీణ పలకడం మానివేస్తే సృష్టి స్తంభిస్తుంది.
కాబట్టి ఆ తల్లి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలి.
సరస్వతి ఆదిపరాశక్తి అంశారూపం. మూలా నక్షత్రం ఆమె జన్మ నక్షత్రం.
అందుకే శారదా నవరాత్రుల్లో ఆ నక్షత్రం నాడు సరస్వతికి ప్రత్యేక పూజలు చేస్తారు.
ఒకప్పుడు సృష్టి చేయడంలో బ్రహ్మ అశక్తుడై ఆదిశక్తిని ప్రార్థించగా సరస్వతిని తన అంశగా సృష్టించి అందించిందనీ, నాటి నుంచి సృష్టి నిర్విఘ్నంగా కొనసాగుతోందని పురాణ కథనం.
బ్రహ్మకు సృష్టి రచనను రాసే శక్తిని అందిస్తున్నది సరస్వతీ మాతే.
బ్రహ్మ నాలుగు ముఖాలూ నాలుగు వేదాలను వల్లిస్తూ ఉంటాయని, సరస్వతి చతుర్భుజాలలో ఉన్న పుస్తకం, జపమాల, పద్మం, శుకం (చిలుక) నాలుగు పురుషార్థాలకు సంకేతమనీ పండితులు చెబుతారు.
ఓం సరస్వతీ మాయా దృష్ట్వా వీణా పుస్తక ధరణిమ్ ।
హంసవాహిని సమాయుక్తా మా విద్యాదాన్ కరోతు మే ఓం ।।
‘వీణ, పుస్తకం పట్టుకుని ఉండే సరస్వతి రూపాన్ని నేను దర్శిస్తున్నాను. హంసవాహిని అయిన ఆ చదువుల తల్లి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు గాక’ అని పై శ్లోకానికి భావం. ఇది సరస్వతి ధ్యాన మంత్రం.
ఇక ఈ కింది శ్లోకం లోక ప్రసిద్ధి చెందినది..
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ।
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా।।
Review వీణాపాణి.. విమల సరస్వతి.