
అనగనగా ఒక ఊళ్లో రాము, సోము అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు.
ఒకరోజున వాళ్లిద్దరు ఒక దూర ప్రయాణానికి బయల్దేరారు. ఆ రోజుల్లో ఇప్పటిలాగా బండ్లు, కార్లు, రైళ్లు ఉండేవి కావు కదా! అందుచేత ఇద్దరూ కాలినడక బయల్దేరారు.
తోవలో తిందామని రాము మూడు రొట్టెలు, సోము అయిదు రొట్టెలు తెచ్చుకున్నారు.
సగం దూరం వచ్చేసరికి వాళ్లిద్దరికీ ఆకలి వేసింది. ఆ పక్కనే ఒక చెరువు కనిపించింది.
ఇద్దరూ చెరువు ఒడ్డున కూర్చుని రొట్టెలు తిందామని అనుకున్నారు.
ఇంతలో ఒక బాటసారి అటుగా వెళ్తూ వాళ్ల దగ్గరికి వచ్చాడు.
‘బాబూ! ఆకలి బాగా వేస్తోంది. నాకు కూడా మీరు తినేదాంట్లో కొంచెం పెడతారా?’ అని వాళ్లిద్దరినీ అడిగాడు.
బాటసారిని చూసేసరికి ఇద్దరికీ జాలి కలిగింది. వాళ్ల దగ్గరున్న మొత్తం ఎనిమిది రొట్టెలనూ ముగ్గురూ సమానంగా పంచుకుని తిన్నారు. బాటసారి తనకు చేసిన సాయానికి కృతజ్ఞతగా వారిద్దరికీ ఎనిమిది అణాలు ఇచ్చి తన దారిన తాను వెళ్లిపోయాడు.
అప్పుడు సోము రాముతో ఇలా అన్నాడు-
‘రామూ! నావి అయిదు రొట్టెలు గనుక నేను అయిదు అణాలు తీసుకుంటాను. నీవి మూడు రొట్టెలు గనుక నువ్వు మూడు అణాలు తీసుకో’.
రాము అందుకు అంగీకరించలేదు.
‘అదేం కుదరదు. ఇద్దరం చెరిసగం పంచుకోవాల్సిందే’ అని పట్టుబట్టాడు.
సోము కూడా అందుకు అంగీకరించలేదు. తనవి అయిదు రొట్టెలు కాబట్టి ఆ బాటసారి ఇచ్చిన అణాల్లో అయిదు తనకే ఇవ్వాలని మంకుపట్టు పట్టాడు. ఇద్దరి మధ్యా ఎంతకీ పంపకాలు కుదరలేదు. దీంతో ఇద్దరూ తగవుకు దిగారు.
అంతలో ఆ దారిలో ఒక ముసలివాడు వెళ్తూ వారి పోట్లాటను చూసి వారి వద్దకు వచ్చాడు.
‘ఏం జరిగింది? ఎందుకు గొడవపడుతున్నారు?’ అని వీరిద్దరినీ అడిగాడు.
తమ గొడవకు కారణమేమిటో వాళ్లిద్దరూ ముసలివాడికి చెప్పారు.
ఇద్దరికీ సర్ది చెప్పడానికి ఆయన ప్రయత్నించాడు కానీ ఇద్దరూ అతడి మాటలను చెవికెక్కించుకోలేదు. పైగా గొడవ మరింత పెరిగి పెద్దదయింది. ఇలా కాదని, ‘బాబులూ! మీరిద్దరూ నేను చెప్పినట్టు చేస్తారా? లేక ఇలాగే గొడవపడి మొత్తం సొమ్ము పోగొట్టుకుంటారా?’ అని కాస్త గట్టిగా గదిమేసరికి ఇద్దరూ మెత్తబడ్డారు. ‘నేను చెప్పినట్టు వినండి. ఇద్దరికీ న్యాయంగా పంచుతాను. ఇద్దరూ లాభపడతారు’ అన్నాడు వృద్ధుడు. ఇద్దరూ అందుకు అంగీకరించారు. అప్పుడు ముసలివాడు వారి తగవు ఇలా తీర్చడం ప్రారంభించాడు.
‘మీరిద్దరు, ఆ బాటసారి కలిసి ఎనిమిది రొట్టెలు సమానంగా పంచుకుని తిన్నారు కదా?’ అని అడిగాడు. రాము, సోము అవునని తలూపారు.
‘అయితే సొము తెచ్చిన అయిదు రొట్టెలు పదిహేను ముక్కలు అయ్యాయి. రామూ తెచ్చిన మూడు రొట్టెలు తొమ్మిది ముక్కలు అయినాయి. దీనిని బట్టి సోమూ తన పదిహేను ముక్కలలో తాను ఎనిమిది తిని బాటసారికి ఏడు ముక్కలు ఇచ్చాడన్న మాట. అందుకని సోమూకు న్యాయంగా ఏడు అణాలు వస్తాయి. ఇక రామూ తన తొమ్మిది ముక్కల్లో తాను ఎనిమిది తిని ఒక ముక్క బాటసారికి ఇచ్చాడన్న మాట. అందుకని రామూకి ఒక అణా వస్తుంది’ అని వృద్ధుడు తీర్పు చెప్పాడు.
అంటే, రామూకి ఒక అణా దక్కింది.
ముసలివాడి తీర్పు విని రామూ తన తెలివితక్కువ తనానికి సిగ్గుపడ్డాడు.
సోమూ చెప్పినట్టు విని ఉంటే కనీసం తన మూడు రొట్టెలకు ప్రతిగా మూడు అణాలు దక్కి ఉండేవి. కానీ, ఇప్పుడు ముసలివాని తీర్పుతో ఒక్క అణానే దక్కింది.
‘నా రొట్టెల ప్రకారమే వాటా వేసుకుని ఉంటే మూడు అణాలు దక్కేవి కదా.. ఇప్పుడు మొత్తం చెడింది’ అని రాము విచారించాడు.
Review వృద్ధుని తీర్పు.