శ్రీరాముడి వినయం

శ్రీమద్రామయణంలోని కథ.
పరమాత్ముడైన శ్రీరాముడు అమిత పరాక్రమశాలి. మహావీరుడు. ధనుర్విద్యా నిపుణుడు. శ్రీరాముడు బ్రహ్మర్షి అయిన వశిష్ట మహర్షి వద్ద సకల శాస్త్రములను, ధనుర్విద్యను అభ్యసించాడు. గాయత్రీ మంతద్రష్ట అయిన విశ్వామిత్ర బ్రహ్మర్షి వద్ద బల, అతిబలాది విద్యలు, మరెన్నో అతి రహస్యములైన అస్త్రాలను గురించి నేర్చుకున్నాడు. ఈ అస్త్రాలు కేవలం విశ్వామిత్రుడికి మాత్రమే తెలుసు. ఇదిగాక, పరమ పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముడికి దివ్య ధనువు, అక్షయ తూణీరము, రత్నఖచిత ఖడ్గాన్ని ప్రసాదించాడు.
ఒక్క బాణంతో శ్రీరాముడు మహాబలశాలి అయిన తాటకిని నేలకూల్చాడు.

ఒకేసారి రెండు బాణాలు వదిలి సుబాహును సంహరించి, మారీచుడిని సప్త సముద్రాలకు ఆవల పారవేశాడు.
మహాభారవంతమైన శివచాపమును ఆవలీలగా ఎత్తి ఎక్కుపెట్టగా అది విరిగిపోయింది.
శ్రీరాముడు ఒక్కడే ప్రహరార్ధ కాలంలో ఖర, త్రిశిర దూషణాదులను, వారి సేనలను సంహరించాడు.

ఇంత ప్రతాపవంతుడైనప్పటికీ రాముడు ఎప్పుడూ తనకు తానుగా బలప్రదర్శన చేయలేదు. సదా వినయవంతుడై వర్తించాడు. దీనికి తార్కాణము సముద్రుని గర్వభంగ ఘట్టము. శ్రీరాముడి సైన్యం సముద్రాన్ని లఘించే సమయం వచ్చింది. సర్వజ్ఞుడైన రాముడు ఉపాయమెరిగి సహజ వినయవతుడు కావడం వలన పరమ భాగవతోత్తముడైన విభీషణుడి సలహాను అడిగాడు. అప్పుడు విభీషణుడు- ‘ఓ రఘునాయకా! మీ బాణం ఒక్కటే కోటి సముద్రాలనైనా శుష్కింప చేయగలదు. అయినా సముద్రుడనే ఉపాయం అడగడం ఉత్తమమని నా యోచన’ అని చెప్పాడు.

రావణుడు తనను వివాహమాడాలని సీతమ్మకు నెల రోజుల గడువు ఇచ్చాడు. భరతుడు పద్నాలుగేళ్లు ఒక్క నిమిషం కూడా రాముడికి దూరంగా ఉండలేక శ్రీరాముడి రాక ఆలస్యమైన పక్షంలో శరీరత్యాగం చేస్తానని ప్రతినబూనాడు. ఈ రెండు కారణాల వలన రాముడి వద్ద అప్పటికి పట్టుమని 30 రోజులు కూడా లేవు. అయినా రాముడు తన బలప్రదర్శన చేయక వినయంతో సాగరుడిని ప్రార్థించాలని నిర్ణయించాడు.

శ్రీరాముడు ఉధదిని సమీపించి, సముద్రుడికి ప్రణమిల్లాడు. తీరాన దర్బలు పరిచి, వాటిపై కూర్చుని తదేక దృష్టితో ప్రార్థించాడు. ఇలా మూడు రోజులు ప్రార్థించినా సముద్రుడు స్పందించలేదు. ‘ఇలా సామ్యంగా చెబితే సముద్రుడు వినడు. ఇక దండోపాయమే సరి’ అని రాముడు నిర్ణయించి అస్త్రాన్ని సంధించాడు. వెంటనే సముద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అంత దయాళువైన రాముడు సముద్రుడిని క్షమించి, తాను ఎక్కుపెట్టిన అమోఘమైన బాణాన్ని దేనిపై ప్రయోగించాలని అడిగాడు. సముద్రుడు ఉత్తరాన దుష్టులైన కాలకేయ రాక్షసులు ఉన్నారని, వారిపై సంధించాలని సూచించాడు. దాంతో శ్రీరాముడు తాను ఎక్కుపెట్టిన ఆ అస్త్రంతో కాలకేయ రాక్షసులను సంహరించి, ఇకపై ఆ కాలకేయులు ఉండే పర్వతం ఔషధాలకు నిలయమై ప్రజాహితం చేకూరుస్తుందని ఆశీర్వదించాడు.
శ్రీరాముని వినయం ఎంత గొప్పదనేది, దాన్ని ఎప్పుడు ఎలా ప్రదర్శించాలనేది ఈ కథ ద్వారా పిల్లలు తెలుసుకోవాలి.

Review శ్రీరాముడి వినయం.

Your email address will not be published. Required fields are marked *

Top