
మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం.
అవటకచ్ఛపం
తాబేలుతో మనిషి తీరును వర్ణించడం ఈ జాతీయం ఉద్దేశం. బొరియ కూప కూర్మం.. అంటే నీటి తాబేలు బావిలోనో చెరువులోనో మకాం వేసి అదే తన ప్రపంచం అనుకున్నట్టు, మరో లోకం లేదనుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తాబేలు మెట్ట తాబేలు సంగతి. నీటిలో ఉండే తాబేలు మాదిరిగానే మెట్ట ప్రాంతంలో ఉండే తాబేలుకు కూడా లోకజ్ఞానం ఉండదు. కూప కూర్మం తానుండే బావే, కొలనే లోకం అనుకుంటే మెట్ట తాబేలు కూడా తానుండే ఉపరితలమే లోకమన్నట్టు వ్యవహరిస్తుంది. ఇలా లోకజ్ఞానం లేకుండా ఉండే వ్యక్తులను అవటకచ్ఛపం అంటారు. కూపకూర్మం, బావిలో కప్ప వంటి జాతీయాలు ఒకే భావాన్ని వ్యక్తీకరిస్తాయి.
అవినాభావం
‘వినా’ అనే సంస్క•తావ్యయానికి ‘లేని’ అని అర్థం. అవినాభావమనే మాటకు లేకుండపోవటమని అర్థం. ‘వీళ్లిద్దరికీ అవినాభావ సంబంధం’ అంటే వాళ్లు ఒకరిని విడిచి మరొకరు బతకలేనంత స్నేహం, ఒకరు లేనిదే మరొకరు ఉండనంత మైత్రి అనే అర్థాలు వచ్చాయి. ఒక సంస్క•త పద్యం ఇలా తెలుగులో జాతీయంగా మారిపోయింది.
అశ్వత్థ ప్రదక్షిణం
అశ్వత్థమంటే రావిచెట్టు. ప్రదక్షిణం అంటే చుట్టూ తిరగడం. తెలుగు వాళ్లలో ఒక నమ్మకం ఉంది. సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారమైన రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తే సంతానం కలుగుతుందనే విశ్వాసంతో ఒక గొడ్రాలు రావిచెట్టు చుట్టూ మూడుసార్లు తిరిగి కడుపు పట్టి చూసుకుందట. ఇలా ప్రదక్షిణల వల్ల, కౌగిలింతల వల్ల సంతానం కలుగుతుందనే విశ్వాసంతో సింహాచలం దేవాలయంలోని స్తంభాన్ని దంపతులు చెరోవైపు నుంచి కౌగిలించుకోవడం కద్దు. అలాంటిదే అశ్వత్థ ప్రదక్షిణం కూడా. ప్రదక్షిణ వల్ల దైవానుగ్రహం కలిగినా పురుష ప్రయత్నం లేకుండా గర్భోత్పత్తి కలుగుతుందని అనుకోవడం అమాయకత్వమే కావచ్చు కానీ, ‘ఆమె కడుపుతో ఉంది.. బహుకాలం తరువాత’ అనడానికి బదులు ‘అశ్వత్థ ప్రదక్షిణం చేసింది’ అనడం అలవాటైంది.
అష్టావక్రుడు
పూర్వం ఏకపాదుడనే గురువు శిష్యులను వేపుకు తినేవాడట. రాత్రింబవళ్లు శిష్యులను అదేపనిగా చదివిస్తూ ఉండేవాడట. ఆ గురువు గారి కుమారుడు తల్లి కడుపులో ఉండగానే, శిష్యుల మీద జాలిపడి తండ్రితో వాళ్ల మీద దయ చూపాలని వాదించాడట. తల్లి గర్భంలో ఉండగానే ఇలా వంకర మాటలు మాట్లాడావు కాబట్టి నీ శరీరంలో ఎనిమిది (అష్ట) వంకరలతో కురూపిగా పుడతావని ఆ తండ్రి గర్భస్థ శిశువును శపించాడని విష్ణు పురాణం చెబుతోంది. అలా శపించి, సంపాదన కోసం ఏకపాదుడు జనక మహారాజు వద్దకు వెళ్లిపోతాడు. దీంతో గర్భంతో ఉన్న ఆయన భార్య తన సోదరుడు ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలో అష్టావక్రుడు తన మేనమామ అయిన ఉద్దాలక మహర్షి ఇంట్లో పుడతాడు. ఒకసారి ఉద్దాలక మహర్షి తొడపై అష్టావక్రుడు కూర్చోబోతే.. ఉద్దాలకుడి కొడుకు వెక్కిరిస్తాడు. దీంతో అవమానం పాలైన అష్టావక్రుడు తండ్రిని వెతుక్కుంటూ పోయి జనకుడి రాజసభలో వాదోపవాదాల్లో ఓడిపోయి చావుకు సిద్ధమైన తండ్రిని కాపాడుకుంటాడు. అష్టావక్రుడు నీళ్ల మధ్యలో నిలిచి చాలా కాలం తపస్సు చేయగా రంభాదులు వచ్చి తమకు విష్ణుమూర్తి భర్త అయ్యేలా వరం ఇవ్వాలని కోరతారు. కృష్ణావతార కాలంలో అలాగే జరుగుతుందని వరమిస్తాడు అష్టావక్రుడు. అంతవరకూ బాగానే ఉంది కానీ అష్టావక్రుడు నీళ్లలోంచి బయటకు రాగానే అతడి అవతారం, శరీరంలోని వంకరలను చూసి అప్సరసలు నవ్వారట. ఆయనకు కోపం వచ్చి కృష్ణుడు లేనపుడు మీరు బోయల చేతిలో అవమానాల పాలవుతారని శపించాడట. ఎంత మహా తపస్వి అయినా, విద్వాంసుడైనా శరీర సౌందర్యం లేనందున లోకంలో ఆయన వెక్కిరింతల పాలయ్యాడు. అంటే లోకానికి ఆయన శక్తి కన్నా వికార స్వరూపమే ఆకర్షకరమైందన్న మాట. అందుకే కురూపిని అష్టావక్రుడు అనడం అలవాటైపోయింది.
Review అష్టావక్రుడు.. అవినాభావం.