ఉగాది నాడు

ఉగాది నాడు చేయాల్సిన విధాయకృత్యం ఏమిటి? వివరంగా తెలుపగలరు?

ఉగాది పర్వదినాన ఉదయమే అభ్యంగనస్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించాలి. ఇంటి ద్వారాలను, పూజా మందిరాలను, ఇంటా బయటా పుష్పం, మామిడి ఆకుల తోరణాలతో అలంకరించాలి. పూజామందిరంలో మంటపం నిర్మించి, ఆ సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను షోడశోపచారాలతో పూజించాలి. ఉగాది పచ్చడిని దేవతకు నివేదించాలి.
భోజనానంతరం మూడు జాములు గడిచాక ఇల్లు, దేవాలయం, గ్రామ చావడి.. ఎక్కడైనా అందరూ సమావేశమై పంచాంగ శ్రవణం నిర్వహించడం ఆచారం. సంవత్సరంలోని ఆదాయ వ్యయాలు, కందాయ ఫలాలు, సుయోగ – దుర్యోగాలను, స్థూలంగా ఆ ఏడాదిలోని భావి జీవిత క్రమాన్ని తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది.
ఉగాది నాడు ప్రధానంగా ఆచరించాల్సిన పది విధాయ కృత్యాలను శాస్త్రకారులు స్పష్టంగా పేర్కొన్నారు. అవి-
ప్రతిగృహ ధ్వజారోహణం: ప్రతి ఇంటా ధ్వజారోహణ చేయాలి. అంటే, ఇంటి గుమ్మం ఎదుట విజయచిహ్నంగా ధ్వజాన్ని ప్రతిష్ఠించాలి.
తైలాభ్యంగం: నువ్వుల నూనెతో తల స్నానం చేయాలి.
నవ వస్త్రభరణధారణం- ఛత్రచామరాది స్వీకారం: శుచిగా స్నానం చేసిన అనంతరం కొత్త బట్టలు, కొత్త నగలు ధరించడం, కొత్త గొడుగు, కొత్త విసనకర్ర స్వీకరించడం మూడవ విధి కిందకు వస్తుంది.
దమనేన బ్రహ్మ పూజనము: బ్రహ్మదేవుడిని దమనములతో పూజించడం నాల్గవ విధి.
సర్వాకచ్ఛాంతకర మహాశాంతి – పౌరుషప్రతిపవ్రతము: విఘ్నేశ్వరుడిని, నవగ్రహాలను, బ్రహ్మాది దేవతలను పూజిస్తూ శాంతిపూజ చేయడం ఐదవ కృత్యం.
నింబకుసుమ భక్షణం: వేపపువ్వును లేదా వేపపువ్వుతో చేసిన పచ్చడిని స్వీకరించడం.
పంచాంగ పూజ – పంచాంగ శ్రవణం: పంచాంగశ్రవణం, ఆ ఏడాది కలిగే శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకోవడం ఏడవ విధి.
ప్రపాదాన ప్రారంభం: చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనుల దాహార్తి తీర్చడం ఎనిమిదవ కృత్యం.
రాజదర్శనం: మన శ్రేయస్సుకు కారకులైన వారిని, పెద్దలను దర్శించుకోవడం తొమ్మిదవ విధి.
వసంత నవరాత్రి ప్రారంభం: పై తొమ్మిది కృత్యాలు చేయగా వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనట్టు.
ఉగాది పర్వం నాడు ఆనందోత్సాహాలతో గడపాలనే వారంతా ఈ పది విధాయ కృత్యాలను విధిగా పాటించాలని శాస్త్ర నియమం.
మనకు కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు ఉన్నాయి కదా! ఏయే యుగం ఎప్పుడు ప్రారంభమైంది?
కృతయుగాన్ని వైశాఖ శుద్ధ తదియ నాడు, త్రేతాయుగాన్ని కార్తీక శుద్ధ నవమి నాడు, ద్వాపర యుగాన్ని శ్రావణ శుద్ధ త్రయోదశి నాడు ప్రారంభించిన పరమాత్మ కలియుగాన్ని చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది) నాడు ప్రారంభించాడని చెబుతారు. అందుకే ఉగాది యుగానికి ఆది దినమైంది. ఉగాది అంటే నక్షత్రపు నడక అని అర్థం. ఇది ప్రకృతి పండుగ. నేలంతా పులకరించి, కొత్త చిగుళ్లు, పూలతో కళకళలాడే పండుగ. భవిష్యత్తుపై ఆశలు పెంచి కొత్త జీవితానికి ఊపిరిలూదే పండుగ. ఈ పండుగను ‘సంవత్సరేష్ఠి’ అని కూడా అంటారు. ఇష్ఠి అంటే క్రతువు. అన్ని లోకాలూ సుఖశాంతులతో ఉండుగాక! అనే విశ్వవ్యాప్తమైన శుభకామన ఉండటమే మన సంవత్సరాది సందేశ ప్రత్యేకత.
ఇక, ఉగాది ప్రాశస్త్యం గురించి భవిష్యోత్తర పురాణంలో ఉంది. అందులో ధర్మరాజుతో శ్రీకృష్ణుడు అన్న మాటలివి.. ‘మహాబాహో! చైత్ర మాస శుద్ధ పాడ్యమి పుణ్యమైనది. ఆనాడు వేపాపూతను ప్రసాదంగా స్వీకరించి తిథి, నక్షత్రాదులను, శకమును, వర్షాఆధిపతులను గురించి వినాలి. ఇలా వినడం వలన అశుభములు కూడా శుభములుగా మారి పోతాయి’.
ఉగాది నాడు ఇంద్రోత్సవం జరపాలని మహా భారతంలో ఉంది. సామాన్యంగా ఉగాది నుంచి రామ నవమి వరకు రామ నవరాత్రులను జరుపుతారు. చాంద్రమాన సంవత్సరాది అతి ప్రాచీనమైనది. దీనికి ధర్మశాస్త్రములే ప్రమాణం.

Review ఉగాది నాడు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top