ఉగాదులు.. ఉషస్సులు

ఆత్మీయులు
మధురాంతకం రాజారాం గారికి..
చిర మంగళ శుభాకాంక్షలతో..
ఏమీ తోచని దినాలలో, ఏమీ సాధించకుండా గడిచిపోయిన కాలాన్ని గురించి చింతించసాగాను. కాని చెయ్యి జారిపోయిన కాలం లేదు ప్రభూ!
నా జీవితంలో ప్రతి క్షణాన్ని నీవు తీసుకున్నావు. ప్రపంచంలోని ప్రతి వస్తువులో అంతర్నిహితంగా దాగి ఉండి, బీజాలను మొక్కలుగా, మొగ్గలుగా, పుష్పాలుగా, ఫలాలుగా మారుస్తున్నావు. అలసి సొలసి ఏమీ తోచక పక్క మీద పడుకుని ఉన్నాను. పనులన్నీ ముగిసిపోయాయని అనుకున్నాను.
తెల్లవారి లేచి చూచేసరికి నా పూలతోట నిండా అద్భుతమైన పుష్పాలు పూచి ఉండడం చూచాను.
-ఠాగూర్‍
‘మధురాంతకం’ గారి పేరు వినగానే సాహితీ మధుఝంకారం ఎదవీణను మీటుతుంది. మీరు పంపిన మీ కథల పుస్తకం చదివాను. సాహితీ ఎడారిలో మీ ‘ఎడారి కోయిల’ కంఠ రవంలోంచి ఒయాసిస్సులు రాలుతాయి. కథలన్నీ చాలా బాగున్నాయి. మీ ‘శిల్ప’ సుందరి క్రీగంటి చూపుల సమ్మోహన శక్తి హృదయాన్ని తన్మయ శిఖరాగ్రా లకు చేరుస్తుంది. అడగకుండానే అంత మంచి పుస్తకాన్ని ఆత్మీయతతో పంపిన మీకు ఎలా కృతజ్ఞతలు తెలియచేయాలి? మీకు ప్రతిగా ఇవ్వటానికి, శిశిరాన్ని నా శరీర వృక్షానికి చుట్టు కున్న నా దగ్గర ఏమున్నాయి? ‘మదియ హృదయ కుసుమ వినీరస సంతోషసౌరభ పరిమళములు తప్ప!
మీ అబ్బాయి గారి (మహేంద్ర) ‘స్వర్ణసీమకు స్వాగతం’ మీరు నాటిన సాహితీ తరులకు పూచిన ప్రసూనంలా పరిమళాలు వెదజల్లుతూంది. మీరు పంపిన శ్రీ వేంకట పార్వతీశ్వర కవుల ‘ఏకాంత సేవ’ ఎంత బావుందో! కాంతారమును వీడి ‘ఏ కాంత! కౌగిలిలోనో కరిగిన అనుభూతి మనసు తీరాలను తాకింది. ఎన్నిసార్లు మీరు పంపిన ఫొటో కాపీలను •-తీ•• కళ్లతో తిరగవేశానో! అన్ని పుస్త కాలు పంపినందుకు చాలా సంతోషం మరియు కృతజ్ఞతలు.
మీ పరిశీలనా దృష్టి, భావ సౌకుమార్యం, రచనా శిల్పం.. ఎంతో బావున్నాయి.
ఇంకేమిటి విశేషాలు చెప్పండి? ఏమి చెప్పినా ‘రచయితే’ చెప్పాలి. నాలాంటి వ్యక్తి చెప్పవల సింది, చెప్పగలిగింది ఏమీ ఉండదు. పైగా నిశ్శబ్ద, నిస్తబ్ద జీవితానికి అలవాటు పడ్డ నేను మీలా శబ్ద ధనుస్సును ఎక్కుపెట్టి భావాన్ని లక్ష్య తీరాలకు చేర్చే సామర్థ్యం నా దగ్గర లేదు. ఏమైనా చెబితే వినటంలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది. ఆ రోజు వెంకటకృష్ణ గారింట్లో మీరు కలిసినపుడు – మీతో, శ్రీపతి గారితో కొద్ది సమయం మాత్రమే గడపగలిగాను. ఇంకా కాసేపు మీ సాహితీ సౌర భాలు నా నాసికాపుటాలను తాకి ఉంటే ఇంకా బావుండేది.
జీవితాన్ని నిండుగా అన్ని కోణాల నుండి అనుభవించగలిగేది ఒక్క రచయిత మాత్రమే -•ష్ట్రవ శీ•ష్ట్రవతీ• ఎవతీవశ్రీ• వఞఱ••బీ •ష్ట్రవ• •శీ అశీ• శ్రీఱ•వ.
రచయిత తాను నిండుగా జీవించడమే కాకుండా పాఠకుల్ని కూడా జీవింపజేస్తాడు. అందుకని రచయితలు సమా•దేహానికి రక్తనాళాల లాంటివాళ్లు. ఔతీఱ•వతీ• •తీవ •తీ•వతీఱవ• శీ• •శీ•ఱవ••. అలాంటి పవిత్ర కార్యాన్ని ఎంతో దీక్షతో నెరవేరుస్తున్న మీరు ఎంతగానో అభినంద నీయులు.
నా గురించి విశేషాలు ఏమీ లేవు. ఏ రచయితో అన్నట్లు గుండుసున్నా లాంటి జీవి తంలో కూర్చుని నిండుగా నవ్వటం, మీలాంటి రచయితల మంచి పుస్తకాలు, నా సోమరితనపు అనుమతి దొరకినపుడల్లా చదవటం, మిగతా సమ యాల్లో మా పిల్లలతో ఆడుకోవటం, వాళ్లతో ఆడుతూ – ఈ ఆటనంతా ఆడించే వాడి గురించి కాసేపు ఆలోచించటం, ఎవరైనా మీలాంటి వ్యక్తులు కలిసినపుడు వాళ్ల సమయపు వెన్నెలలను చకోర పక్షిలా మేయటం, ఇంకా సమయం మిగిలితే నా శిథిల జీవిత వస్త్రాన్ని కలల జరీపోగులతో అలంకరించుకోవటం, కలను ‘నిజం’గా అనుభవించటం, ‘నిజాన్ని’ కలగా భావించటం, నిద్రలోంచి మేల్కొనటానికి ప్రయ త్నిస్తూ మేల్కొంటూ నిద్రించటానికి సాహసించటం, నన్ను నేను పోగొట్టుకొని, నాకై నేను తిరిగి వెతు క్కోవటం, పసిపాపల అమాయకత్వపు అమర కాంతిని జూచి ఈర్ష్య పడటం, కన్నీటి కుంభాకార కటకం గుండా జీవన గవాక్షాలలోకి తొంగి చూస్తూ సుదూర సత్యాలకై ఆత్మ అలలపై అన్వేషణ గావించటం, నన్ను చూచి నేను నవ్వు కోవటం, ఆనందం కలిగినపుడు దు:ఖించటం, దు:ఖం కలిగినపుడు ఆనందించటం లాంటి అర్థంలేని, అర్థం కాని పనులు చేసుకుంటూ ప్రాణ ప్రమిద లోని తైలాన్ని ఖర్చుపెడుతూ ఉంటాను.
మీ అబ్బాయి – మహేంద్ర గారికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు అందజేయగలరు. ఇంట్లో అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందజేయగలరు. జనవరి ‘ఇండియా టుడే( (తెలుగు)లో మీ కథకు ప్రత్యేక అభినందనలు. ఈ మధ్య ‘స్వాతి’ మాస పత్రికకు మీరిచ్చిన ఇంటర్వ్యూ చదివాను. మీ సమాధానాలు మీ వ్యక్తిత్వానికి నిలువెత్తు దర్పణంలా ఉన్నాయి.
మీరు పుస్తకాలు పంపినందుకు మరొక్కమారు కృతజ్ఞతలను తెలియజేస్తూ మీ జీవన ప్రాంగ ణంలో సంతోష సుధార స్రవంతులు ఎల్లవేళలా ప్రవహించాలని కాంక్షిస్తూ, మీరు ప్రపంచ సాహిత్య సౌవర్ణ వీథుల్లో సుమధుర సోయగాలు వెద జల్లుతూ అడుగులు వేయాలని ఆకాంక్షిస్తూ… ఓ కవి అన్నట్లుగా :
మనసు పాలపైన
సంతోష మీగడలు తెట్టకట్టినయట్లు
యదలోపల గుడిలోన
మార్దవించిన మురళి
మధువు లొలికినయట్లు
కలలేవో మేల్గొంచి
కనుచూపు తీరాల
కస్తూరి నౌకలను కౌగిలించినయట్లు…
జీవనమందారవనంలో మనమంతా చిరు నవ్వులు చిందుదాం! మనసు మందిరంలో మరిని జేగంటలు మ్రోగిద్దాం!
మీ
శ్రీరామ్‍
నీ మాటలు సులభంగా తెలుస్తాయి ప్రభూ, కాని నువ్వు
తమకి తెలుసునని మాట్లాడే వాళ్ల భాష అర్థంకాదు. నీ నక్షత్రాల
కంఠస్వరం, నీ చెట్ల మౌనం చక్కగా విదిత మౌతుంది నాకు
నిగూఢ స్రవంతిలో నా జీవితాన్ని ముంచి నింపుకున్నాను
నా హృదయం పుష్పంమల్లే విచ్చుకుంటుందని తెలుసు
హిమమయ ఏకాంత ప్రాంతలనించి ఎగిరి వొచ్చే
పక్షులవలె, నీ పాటలు నా హృదయ వసంత రస్మిలో గూళ్లు
కట్టుకునేందుకు తేలివొస్తున్నాయి.
తృప్తిపడి ఆ ఆనందోత్సవ సమయానికై
నిరీక్షిస్తూ నిలిచిపోతాను.
– ఠాగూర్‍
ఆత్మీయులు
మధురాంతకం రాజారాం గారికి
మరియు ఇతర కుటుంబ సభ్యులకు …
ఉగాది (ఆంగీరస) శుభాకాంక్షలతో…
ఆంగీరస నామ సంవత్సరంలో
మీ జీవన గగనం శతకోటి ఆనంద ఇంద్రధనస్సులతో శోభిల్లాలనీ…
మీ సాహితీ శిల్ప సుందరి, ఎదను కదిలించే ఎల్లోరా శిల్పంలా
నూతన సోయగాలు వెదజల్లాలని…
ఆ శోభల్లో, ఆసోయగాల కాంతి జలపాతాల్లో
మా మనుసులు ఆనందనృత్యమాడాలనీ… కాంక్షిస్తూ…
‘విశ్వరహస్యం’ – ‘విశ్వాసరహస్యం’ తెలిసిన ఎదలో నదులుగా ప్రవహిస్తుంది.
మీ
శ్రీరామ్‍
(1992, మార్చి 27న ప్రముఖ రచయిత మధురాంతకం రాజారామ్‍ గారికి నిజామాబాద్‍ నుంచి శ్రీరామ్‍ గారు రాసిన లేఖ)

Review ఉగాదులు.. ఉషస్సులు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top