
మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని
‘‘సామెత కథ’’ల పరిచయం.
హైదరాబాద్ దక్కనీ ఉర్దూ భాషా సాహిత్యాల్లో సామెతలకు ప్రత్యేక స్థానం ఉంది. భాషా సాహిత్యంలోనూ, వాడుకలోనూ సమయాను కూలంగా, సందర్భానుసారంగా ఉపయోగించే సామెతలు ఆ సాహిత్యానికి అదనపు సొబగులు అద్దాయి. దక్కనీ జన జీవితంలో ఉన్న ఉర్దూ సామెతల సమాహారమే.. ఉర్దూ భాషా సౌంద ర్యానికి ప్రతీక. జీవన విలువలను, వ్యక్తిత్వ పాఠా లను నేర్పే ఆ సామెతలివిగో..
అప్నీ తోషా అప్నా భరోసా
స్వశక్తితో, మన కాళ్లపై మనం నిలబడితేనే మంచిది అని దీని అర్థం. సాధారణంగా ఒకరిపై ఒకరు ఆధారపడకుండా మనలేని జీవితాలు మనవి. అలా అని అతిగా ఇతరులపై ఆధారపడి కాడి వదిలేస్తే నడిరోడ్డుపై నిలబడే పరిస్థితి వస్తుంది. కొన్ని అవసరాలు, పనులు, ప్రయో జనాల రీత్యా ఇతరులపై ఆధారపడక తప్పదు. కానీ, మనం చేయాల్సిన పనుల విషయంలో కూడా మనం బాధ్యత నిర్వర్తించకుండా ఇతరులపై ఆధారపడితే గౌరవం పోతుంది. ఎవరికి వారు తమ రెక్కల కష్టంతోనే బతకాలి. అంతేతప్ప ఫలానా వారు లేకుంటే తాను లేననే అతిగా ఆధారపడే వైఖరి దీర్ఘ కాలంలో దారుణంగా దెబ్బతీస్తుంది. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఇతరులు మనల్ని ఆదుకోలేకపోయినా, ఆదుకోక పోయినా.. మనం మాత్రం మన జీవితాన్ని మనం భరోసాతో జీవించాలంటే స్వశక్తితో కొన్ని ప్రణాళికలు రచించుకోవాలి. మన కాళ్ల మీద మనం నిలబడేలా వ్యూహాలు రచించుకోవాలి. అదే ఈ సామెతలోని భావం.
ఆజ్ కాసాగ్ కల్‍కా ముర్గీ సే బెహతర్
రేపటి కోడికూర కన్నా నేటి ఆకు కూర మేలు అనేది పై సామెత భావం. మనలో చాలామంది ఈ రోజు జీవించడం మానేసి.. రేపటిలోనో లేదా నిన్నటిలోనో జీవిస్తుంటారు. విలువైన వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అలాగే, రకరకాల ప్రలోభాలు మనల్ని వివిధ వికారాలకు గురి చేస్తుంటాయి. ఉన్నదాని విలువ గుర్తించలేక లేని దాని కోసం ఆరాటపడుతూ మనశ్శాంతిని దూరం చేసు కుంటూ ఉంటారు. అటువంటి సందర్భాలలో పై సామెతను ఉపయోగిస్తుంటారు. దీనికి సరి సమానమైన సామెతలు తెలుగులోనూ ఒకటి రెండు ఉన్నాయి. ఆకాశంలోని మేఘాలను చూసి చేతిలో ఉన్న కుండను వదిలేసుకున్నాడట వెనకటికో రైతు. ఇవ్వాళ మనకు ఏది ఉందో దానిని ఆనందించాలి. రేపనేది ఎవరి చేతుల్లోనూ లేదు. దాని కోసం ఎదురు చూడటం అనవసరం అని సలహా ఇచ్చే సందర్భా•లలో పై సామెతను ఉపయోగిస్తారు.
జుఖ్ జానా టూట్ నేసే బెహతర్ హై
మనిషి ఒదిగి ఉండాలనే పాఠాన్ని నేర్పు తుందీ సామెత. వధింపబడటం కంటే ఒదిగి ఉండటం మేలు కదా!. తుఫాను గాలికి తాటి చెట్ల తలలు తెగిపడతాయి. కానీ, ఒదిగి ఉండే గడ్డిపోచలు బతికిపోతాయి. కాలం కలిసి రాకపోతే రాజీ పడటం మంచిది కదా అనే అర్థం ఈ సామెతను వాడుతుంటారు. ప్రతిసారీ పౌరుషం కలిసి రాదు. ప్రతికూల పరిస్థితులను తట్టుకోవా లంటే కొన్నిసార్లు ఆ పరిస్థితులకు అనుగుణంగా మనం మారిపోవాల్సి ఉంటుంది. లేకుంటే ఇబ్బందులు తప్పవు.
భోటా సిక్కా కిసీకో కుబూల్ నహీ
చెల్లని రూపాయి ఎవరికీ అక్కరలేదు. అందుకే మనుషులు తమ సొంత వ్యక్తిత్వాలను నిలుపు కోవాలి. విలువలను పెంచుకోవాలి. లేకపోతే చెలామణిలో లేని నాణాలుగా మిగిలిపోతారు. మనిషి గౌరవ మర్యాదలు పొందాలంటే తనకంటూ సొంత వ్యక్తిత్వాన్ని, హుందాతనాన్ని నిలుపుకోవాలి. అవి లేకుండా సమాజంలో అత నికి గౌరవం లభించదు.
Review ఒదిగి.