గుర్రం మూతికి బట్ట కట్టినట్టే

చక్కెర కంటే తీయనైన మధుర గుళికలు మన తెలుగు పదాలు. అయితే.. ఇటీవల కాలంలో అంతగా చేదెక్కిపోతున్నాయెందుకు? చేజేతులా మనం చేటు తెచ్చుకుంటున్న నిర్లక్ష్యంతో తెలుగు పదాలకు పలుకుబడి తగ్గుతోంది. ఎన్నో అందమైన పదాలు.. ఆనందాన్ని కలిగించే భావాలు.. అవన్నీ కనుమరుగైపోతున్నాయెందుకు? తెలుగులో నానార్థాలు, పర్యాయపదాలు, వ్యుత్పత్తులు, జాతీయాలు చదివితే ఎన్నో అర్థాలు తెలుస్తాయి. అవి ఆనందానికి వారధులవుతాయి. కనుమరుగైపోతున్న ఈ పదాల పలుకులన్నీ మన బడిలోనే చిన్ననాట చిన్నారులకు నూరిపోయాలి. ఇటీవలి తరం పూర్తిగా మరిచి పోయిన కొన్ని పదాలు, జాతీయాలు వాటి అర్థాల గురించి తెలుసుకుందాం.
‘‘వాడికి చెప్పకు. చెబితే గుర్రం మూతికి బట్ట కట్టినట్టే’’..
ఇది మన తెలుగులో చాలా తరచుగా వినిపించే జాతీయం. చాలా సందర్భాల్లో ఈ ప్రయోగాన్ని ఉపయోగిస్తుంటాం. ఇక, ఈ ప్రయోగం విషయంలోకి వెళ్తే.. ఎవరి నోట్లోనైనా మాట దాగకుంటే దీన్ని వాడుతుంటాం. ఈ ప్రయోగాన్ని ఆయా సందర్భాల్లో వాడటం సంగతి అటుంచితే, అసలు ఈ జాతీయం ఎలా వచ్చింది? గుర్రం ఎందుకొచ్చింది?.. ఈ విశేషాలు తెలుసుకుందామా?
ఒకరోజు శ్రీకృష్ణ దేవరాయల వారు తన ముద్దుల భార్య చిన్నాదేవి మందిరానికి వెళ్తాడు. తన భార్యను ముద్దు పెట్టుకుందామని అనుకునే సమయంలో ఆవిడ పెద్దగా తుమ్మిందట. దీంతో తను చేయదల్చుకున్న పనికి ఆటంకం కలగడంతో రాయల వారు శయన మందిరం నుంచి వెళ్లి పోయారు. ఈ విషయాన్ని అంతపుర దాసీలు పసిగట్టారు. విషయం బయటకు పొక్కకూడదని రాణీ వారు దాసీలకు ఆజ్ఞ ఇచ్చారు. అయితే, ఒక దాసీ మాత్రం ఆపుకోలేక తన కూతురితో ఆ రోజు అంతఃపురంలో జరిగిన విషయాన్ని చెప్పేసిందట. ఆ దాసీ కూతురు తెనాలి రామకృష్ణుడి ఇంట్లో పని చేసేది. అంతపుర రహస్యం తెలియడంతో ఆమె ఏదో గొప్పగా భావించి చాలా సంతోషంగా ఉండటంతో ఆమె వాలకం గమనించిన తెనాలి రామకృష్ణుడికి అనుమానం వచ్చింది. విషయం ఏమిటో కనుక్కున్నాడు. నవ్వుకొని, అంతటితో ఆగక తన గుర్రం మూతికి బట్టకట్టి తన ఇంటి నుంచి మొదలుపెట్టి విజయనగర రాజవీధుల్లో తిప్పాడు. ఇది చూసిన ప్రజలు తెనాలి రామ కృష్ణుడు ఇలా చేయడంలో ఏదో రహస్యం ఉండే ఉంటుందని గుసగుసలు ఆడుకున్నారు. అలా అలా ఈ విషయం వేగులకు తెలిసింది. వారు తెనాలి రామకృష్ణుడిని కలిసి గుర్రం మూతికి బట్ట ఎందుకు కట్టారు? అని అడిగారు. వారితో చెబితో శ్రీకృష్ణదేవరాయలకు విషయం ఎలాగైనా తెలుస్తుందని గ్రహించిన తెనాలి రామకృష్ణుడు వారితో ఇలా అన్నాడు.‘‘ఏం చెప్పమంటారు? నిన్న రాత్రి అంతః పురంలో రాణీవారు తుమ్మారు. అది ఈ గుర్రం వింది. ఇదేమో మామూలు గుర్రం కాదు. దీని నోట ఏ మాటా దాగదు. అందుకే విషయం బయటకు పొక్కకూడదని దాని మూతికి బట్ట కట్టాను’’.
రామకృష్ణుడి నుంచి ఈ మాట వింటూనే వేగులు వేగిరం కృష్ణదేవరాయల వారి వద్దకు వెళ్లి వారి చెవిలో వేశారు. రాయలు గారు రామ కృష్ణుడి చమత్కారానికి మనసులోనే నవ్వుకున్నారు. కానీ, పైకి మాత్రం- ‘‘ఇక నుంచి తన ముఖం చూపించవద్దని రామకృష్ణుడితో చెప్పండి’’ అని భటులను ఆజ్ఞాపించారు. ఆ తరువాత తెనాలి రామకృష్ణుడు ఏదో చమత్కారం చేసి రాయల వారి మనసు గెలుచుకుని మళ్లీ వారి అనుగ్రహం పొందాడు. ఇది వేరే కథ.
మొత్తానికి ఈ జాతీయం పుట్టడానికి కారణమైన కథ ఇది. అంటే, తెనాలి రామకృష్ణుడి గుర్రం నుంచి ‘గుర్రం మూతికి బట్ట కట్టినట్టు’ అనే జాతీయం వచ్చిందన్న మాట. దీనిని అప్పటి నుంచి ఏదైనా రహస్యాన్ని నేరుగా చెప్పకుండానే బట్టబయలు చేసే వారి విష యంలో వాడుతుంటాం.

Review గుర్రం మూతికి బట్ట కట్టినట్టే.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top