ఒకసారి బుద్ధుడు విశాల •వటవృక్షం కింద కూర్చుని జ్ఞానబోధ చేస్తున్నాడు. అందరూ భక్తిశ్రద్ధలతో ఆ బోధనలు వింటున్నారు. అంతలో అక్కడికి రాజభటులు ఒక దొంగను తీసుకువచ్చారు.
రాజభటులు బుద్ధుడికి వినయంగా నమస్కరించి- –
‘భగవాన్! ఈ దొంగ గతంలో మీ వద్ద ధర్మదీక్ష తీసుకున్నట్టు చెబుతున్నాడు. మహారాజు వాస్తవం ఏమిటో కనుక్కోమని మమ్మల్ని పంపారు’ అని చెప్పారు.
బుద్ధుడు ఆ దొంగకేసి కొద్దిసేపు చూశారు.
‘నీ పేరు ఏమిటి?’ అడిగాడు బుద్ధుడు.
‘ధర్ముడు’ అని చెప్పాడు దొంగ.
‘నువ్వు ధర్మదీక్ష తీసుకున్న మాట వాస్తవమేనా?’
‘లేదు భగవాన్! తమరి పేరు చెబితే విడిచిపెడతారనే ఆశతో అబద్ధం చెప్పాను’ పశ్చాత్తాపంతో అన్నాడు ధర్ముడు.
బుద్ధుడు మందహాసం చేశాడు.
‘నువ్వు చోరధర్మంలో ఉన్నావు. నేను దీక్ష ఇస్తే బుద్ధ ధర్మాన్ని స్వీకరిస్తావా?’
‘నాలాంటి పాపికి ధర్మదీక్ష స్వీకరించే అర్హత ఉందా దేవా?’
‘తల్లికి అందరు బిడ్డలూ సమానమే. ధర్మం కూడా అంతే. ఏ ధర్మమూ ద్వేషాన్ని నేర్పదు. సమస్త ప్రాణులూ సమానమే అని గుర్తించి సేవలు చేయడమే బౌద్ధ ధర్మం’.
‘అయితే నాకు ధర్మదీక్ష ప్రసాదించండి భగవాన్’ అని చోరుడు చేతులు జోడించాడు.
‘దీక్ష అంటే మనకు ఇష్టమైనపుడు ఆచరించేది, ఇష్టం లేనపుడు విస్మరించేది కాదు. ధర్మాచరణను ప్రాణం కన్నా ఎక్కువగా భావించాలి. ఆచరించాలి. అందుకు సిద్ధమేనా?’.
‘సిద్ధమే దేవా!’
‘అయితే నీ నేరానికి శిక్ష అనుభవించాక నా వద్దకు రా. అప్పుడే నీకు ధర్మదీక్ష పొందే అర్హత లభిస్తుంది’ అన్నాడు బుద్ధుడు.
జరిగినదంతా భటుల ద్వారా తెలుసుకున్న మహారాజు చోరుడిని క్షమించి బుద్ధుడి వద్దకు పంపాడు. బుద్ధుడు అతడికి ధర్మదీక్షనిచ్చి ఉత్తముడిగా తీర్చిదిద్దాడు.
Review ధర్మదీక్షకు సిద్ధమేనా?.