నేనే శివుడిని

పరమ జిజ్ఞాసువు, కారణజన్ముడైన ఒక విద్యార్థిని ఒక ఆధ్యాత్మిక గురూత్తముడు ‘నీవు ఎవరివి?’ అని ప్రశ్నించాడు.
ఆ విద్యార్థి సవినయంగా నమస్కరించి- ‘చిదానంద రూప: శివోహం శివోహం’
అని సమాధానం చెప్పాడు.
ఇక్కడ శివుడు అనే పదానికి
పరబ్రహ్మం అని అర్థం. మనం పరమేశ్వరుడు, శివుడు అని అర్థం చెప్పుకుంటే సందర్భోచితంగా
ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ‘నేను
శివుడిని. నేనే శివుడిని’ అని
మనసులో అనుకున్నా, పైకి అన్నా
బాగానే ఉంటుంది. శివతత్వాన్ని
అర్థం చేసుకుని శివుడిలాగా
ప్రవర్తిస్తే ఇంకా బాగుంటుంది.

‘శివం’ అంటే ‘శుభం’ అని అర్థం. శివుడు అంటే శుభాలను కలిగించే వాడు అని అర్థం. ‘శం’ అంటే సుఖం. ‘శంకరుడు’ అంటే సుఖాన్ని కలిగించే వాడు. పాల సముద్రం నుంచి హాలాహలం ఆవిర్భవించినప్పుడు లోకాలన్నీ భయకంపితాలై హాహాకారాలు చేస్తుంటే శివుడు ఆ ఘోర విషాన్ని అరచేతిలోకి తీసుకుని ఆనందంగా తాగాడు. తనకు వెలుపల ఉన్న లోకాలకు, తనకు లోపల ఉన్న లోకాలకు ఇబ్బంది కలగకుండా దాన్ని తన కంఠ ప్రదేశంలో నిలుపుకున్నాడు. ఇతరుల ఇబ్బందిని తొలగించడం మన పని అయినట్టయితే, మనం ఆ పనిని చేసి తీరాల్సిందే. వారికి వచ్చిన ఇబ్బందిని తీర్చవలసిందే. ఇదే శివతత్త్వం.

శివుడు అభిషేక ప్రియుడు. భక్తి ప్రపత్తులతో ఒక్క ఉద్ధరిణెడు నీళ్లు తీసుకొని ‘హరహర మహాదేవ’ అంటూ శివలింగంపై పోస్తే చాలు ఆయన ఉబ్బితబ్బిబ్బయిపోతాడు. ఒక్క మారేడు దళాన్ని తీసుకుని ‘ఓం నమశ్శివాయ’ అంటూ శివలింగంపై ఉంచితే చాలు- శివుడు పొంగిపోతాడు. భక్తుడి కోరికలన్నిటినీ తీరుస్తాడు. మన వద్దకు వచ్చిన వ్యక్తి ఎంత విలువైన వస్తువును తెచ్చాడనేది కాదు.. ఎంత ఆప్యాయతతో దానిని తెచ్చాడనేది ప్రధానం. మనం చూడాల్సింది ‘అర్థా’న్ని కాదు.. ఆత్మీయతనే. ఇదే శివతత్త్వం.

శివుడు రుద్రుడు. అపరిమితమైన ఆగ్రహం గలవాడు. అదే శివుడు పరమ శాంతమూర్తి కూడా. శివుడి ఫాలనేత్రంలో భయంకరమైన అగ్ని ఉంది. తల మీద చల్లని వెన్నెలను కురిపించే చంద్రుడు ఉన్నాడు. మన్మ థుడు తన మీద బాణం వేసిన సమయంలో శివుడు కాలాగ్ని రుద్రు డయ్యాడు. తన మూడో కంటి మంటతో అతనిని భస్మీపటలం చేశాడు. మన్మథుడి భార్య రతి దీనంగా ప్రార్థించగానే శాంతించాడు. ఆమెకు పతి భిక్ష పెట్టాడు. కోపం అనేది మనిషికి చాలా సహజమైన లక్షణం. దీర్ఘక్రోధం పనికిరాదు. ఇరుగుపొరుగుకు నష్టాన్ని కలిగించే క్రోధం అసలు పనికి రాదు. పశ్చాత్తాపం చెందిన వారిని క్షమించే గుణం ఉండాలి. ఇదే శివతత్త్వం.
ఎక్కడో గగనతలంలో ఉన్న గంగానదీ ప్రవాహం ఒక్క ఉదుటున భూమి మీదకు దూకితే చిన్న మట్టి ముద్దవంటి భూగోళం మొత్తం తడిసి బద్ధలైపోవడం ఖాయం. అటువంటి సంకట పస్థితిలో భగీరథుడు ‘త్వమేవ శరణం మమ’ అంటూ ప్రార్థిస్తే శివుడు తన రెండు చేతులనూ నడుం మీద మోపి, రెండు పాదాలనూ కైలాస పర్వతశిల పైన స్థిరంగా ఉంచి గంభీరంగా నిలబడ్డాడు. ఆకాశం నుంచి ఒక్క ఊపున దూకిన గంగను తన శిరస్సు మీద భరించాడు. జటాజూటంలో బంధించాడు. ఒక్క పాయను మాత్రం వదిలి గంగను నిదానంగా హిమవత్పర్వతం మీదకు పంపాడు. మన సమక్షంలో ఏదైనా మహా ప్రమాదం జరగబోతూ ఉంటే దానిని ఆపగలిగిన సామర్థ్యం మనకుంటే మనం ఆపవలసిందే. అదే శివతత్త్వం.

శివుడు విభూతిరాయుడు. విభూతి అంటే ఐశ్వర్యం. అన్ని విధాలైన ఐశ్వర్యాలకూ ఆయన అధిపతి. సమస్త సంపదలకూ అధీశ్వరుడైన కుబేరుడు శివుడికి ప్రియ మిత్రుడు. అయినప్పటికీ శివుడు నిరాడంబరుడే. మన ఘనత అనేది మన వ్యక్తిత్వంలో ఉండాలి. మన ప్రవర్తనలో ఉండాలి. మన కర్తవ్య నిర్వహణలో ఉండాలి. అంతేకానీ, బాహ్య వేషంలో కానే కాదనడానికి శివుడే ఉదాహరణ. ఇదే శివతత్త్వం.

మహాన్యాసం అనే శివాభిషేకంలో దశాంగరౌద్రీకరణం అని ఉంది. అదే విధంగా షోడశాంగ రౌద్రీకరణం కూడా ఉంది. ఇవి మన శరీరంలోని లలాటం, నేత్రం మొదలైన పది అవయవాల్లోనూ, శిఖ, శిరస్సు మొదలైన పదహారు అవయవాల్లోనూ శివుడున్నాడని తెలియ చేస్తున్నాయి. అంటే మన శరీరం యావత్తూ శివస్వరూపమేనన్న మాట. మన శరీరం ఇంత పవిత్రమైనదీ, విలువైనదీ కనుకనే దీన్ని మనం సత్కార్యాల కోసమే వినియోగించాలని దీని అంతరార్థం. శివోహం.. నేను శివుడిని. నేనే శివుడిని అనే మాటకు అసలైన అర్థమిదే.

ఏడాదికి ఒకసారే..

దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా, అందులో నుంచి ముందుగా హాలాహలం పుట్టింది. లోకాలను దహించడానికి ఈ విషాగ్ని కీలలు భగభగలాడుతూ చెలరేగుతూ ఉంటే, మంధర పర్వతం కవ్వంగా వాసుకి సర్పం తాడుగా సాగుతున్న అమృత మధనం ఆగిపోయింది. విష విలయం ఆపడానికి విలయనేత్రుడు శివుడే స్వయంగా పూనుకున్నాడు. విషపు మంటలను గుటుక్కున మింగి గరళకంఠుడయ్యాడు పరమశివుడు. ఆయన బాధను పంచుకోవడానికి దేవ, మానవ, రాక్షస గణాలన్నీ జాగరణ పాటించి నీలకంఠుడికి సపర్యలు చేసిన రాత్రి ‘మహా శివరాత్రి’గా ప్రసిద్ధమైంది. అన్ని శివాలయాల్లో కోలాహలంగా నాలుగు యామాల పాటు శివుడికి అభిషేకాలు, పూజలు చేయడం ఒక్క మతపరమైన సంప్రదాయం కాదు.. ‘సహ అనుభూతి’ ఒక సామాజిక పక్రియ అని తెలియ చేయడానికి శివరాత్రి చక్కని ఉదాహరణ. దీన్ని పౌరాణిక గాథగా కొట్టివేయడానికి, మూఢాచారంగా ముద్రవేయగానికి వీలులేదు. పురాణం- వేదం తాలూకు వివర్తరూపం. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని వ్యజింప చేయడానికి ద్రష్టలైన రుషీశ్వరులు సృష్టించిన దివ్యకథా కదంబం. మహా శివరాత్రి ఏడాదికి ఒక్కసారే. మాస శివరాత్రి ప్రతి నెలా ఎందరికో మార్గదర్శనం చేయిస్తుంది. ఈ శివరాత్రిని ధ్యాన, జ్ఞాన, కార్మిక శివరాత్రులుగా పాటించాల్సిన అవసరం ఏమిటో తెలుసుకోవాలి. అంతకన్నా ముందు, అందులోని అంతరార్థం గ్రహించడం సమంజసం.

మంగళకరమైన శివ శబ్దానికి అజ్ఞానానికి సంకేతమైన రాత్రికి లంకె ఏమిటి? ఈ ప్రశ్నకు తొలుత సమాధానం చెప్పుకోవాలి. భగవద్గీతలో స్థితప్రజ్ఞుడైన యోగి లక్షణాలను అర్జునుడికి కృష్ణుడు తెలియ చేశాడు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన ముఖ్యమైన శ్లోకం గుర్తు చేసుకుంటే ఈ చిక్కుముడి వీడిపోతుంది. తమోజీవులు అన్నింటికీ ఏది రాత్రో, జ్ఞాని అయిన యోగికి అది పగలు. అజ్ఞాన జీవులు మేలుకుని ఉండే సమయం ఆ జ్ఞానికి రాత్రితో సమానం. ఇప్పుడు శివరాత్రికి సరైన నిర్వచనం తేటతెల్ల మైంది. క్షణికం, అశాశ్వతమైన ఇంద్రియ సుఖాల కోసం పాకులాడుతూ, అది ఆత్మస్థితికి దూరమైన మనం శివజ్ఞానులమై నిరంతరం పరమాత్మను ధ్యానిస్తూ, నిస్వార్థ క్రియా యోగులుగా మారడమే జీవిత ధ్యేయం కావాలి.

మానవుడు కర్మజీవి కాబట్టి క్షణం కూడా ఏదో ఒక పని- శారీరకంగా కాకపోయినా, మానసికంగానైనా చేయక తప్పదు. ఈ మనిషి జన్మ-కర్మ జనితమే కాబట్టి, అవతార పురుషుడు కృష్ణుడు తానూ కర్మ చేయక తప్పడం లేదని అర్జునుడికి చెప్పిన విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి. కర్మ చేయడం ఎలాగూ తప్పదు కాబట్టి నిరంతర స్మరణ చేస్తూ కర్తవ్య కర్మను దైవకార్యంగా నిర్వర్తించాలి. ఇదే ‘కార్మిక శివరాత్రి’. ఈ విధంగా జ్ఞానభక్తి, కర్మ మార్గాల ద్వారా పరతత్వాన్ని గ్రహించడానికి శివరాత్రి అద్భుతమైన అవకాశాన్ని సందేశాత్మకంగా అందచేస్తున్నది.

శివరాత్రి అనే పేరు రావడానికి కారణం- ఈశాన సంహిత ఇంకో విధంగా చెబుతోంది. శివుడు నేటి అర్ధరాత్రి కాలాన కోటి సూర్య సమప్రభతో లింగాకారంలో పుట్టడం చేత దీనికి శివరాత్రి అనే పేరు వచ్చిందట. అర్ధరాత్రి లింగోద్భవ కాలం. ఇక పరమశివుడు లింగాకారంలో పుట్టిన రోజు కావడం చేత ఇది శివుడికి ప్రియకరమైనదని, ఈనాడు లింగరూపి అయిన శివుడిని పూజించాలని శైవాగమనం చెబుతోంది. దేవపూజ పగలు కాక రాత్రిపూట సాగడం శివరాత్రి ప్రత్యేకతల్లో ఒకటి. సాధారణంగా పండుగలు మృష్టాన్న భోజనాలతో జరుగుతాయి. కానీ శివరాత్రి ఉపవాసాల పండుగ. శివరాత్రి గురించి పురాణేతిహాసాల్లో చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

బ్రహ్మ, విష్ణువు ఒకసారి తమలో ఎవరు అధికులనే విషయమై కలహించుకోసాగారు. అప్పుడు ఒకానొక అర్ధరాత్రి వేళ ఈశ్వరుడు అగ్ని లింగాకారంలో వారి ఎదుట పొడచూపాడు. దానిని చూసి వారిద్దరు విస్తుపోయి దానికంటే తాము తక్కువనే సంగతి గ్రహించారు. అర్ధరాత్రి వేళ ఆ లింగాన్ని అధిక భక్తితో పూజించారు. అప్పటి నుంచి అది మహా శివరాత్రి అయ్యింది.

Review నేనే శివుడిని.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top