
వసంతమాసంలో వచ్చే హోలీ పర్వంలో ఆనందోత్సాహాలతో రంగులు చల్లుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ప్రకృతిలోని వర్ణాల వెనుక ఏదైనా పరమార్థముందా? ఏయే రంగులు దేనికి ప్రాతినిథ్యం వహిస్తాయి? ఆయా రంగులను చూడగానే మనిషి మనసులో కలిగే ప్రతిస్పందనలేమిటి?
ప్రకృతిలోని వర్ణాలకు అద్దం పట్టే పర్వం హోలీ. ఇందులో వాడే రంగు రంగులో ఓ కళ ఉంటుంది. ప్రతి రంగుకో లక్ష్యం ఉంది. అవి చాటే సందేశం ఉంది. ఆ రంగులు.. వాటి వెనుక దాగిన లక్ష్యాలు మనిషి ఆధ్యాత్మికతకు, ఔన్నత్యానికి అద్దం పడతాయి. అందుకే మనిషి ప్రకృతిలోని వర్ణాలను చూసి పరవశిస్తాడు. అంతకుమించి ఉత్తేజం పొందుతాడు. ఆ రంగుల్లోని దైవత్వానికి ప్రణమిల్లుతాడు.
• నీలి రంగు దివ్యత్వానికి నిదర్శనం. ఇది ఏకాగ్రతను కలిగిస్తుంది. కళ్లకు హాయిని, ప్రశాంతతను, ఆహ్లాదాన్ని ఇస్తుంది. గాఢమైన, ప్రశాంతమైన మనస్థితికి ఇది సూచకం. అందుకే కాబోలు ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థలన్నీ తమ లోగో (చిహ్నాలు)గా ఎక్కువగా నీలి రంగునే ఎంచుకుంటాయి. చూడగానే ఆహ్లాదం కలిగించడంతో పాటు ఆకర్షణ కలిగించడం నీలి రంగు ప్రత్యేకత.
• మన రుషులు తమ తపోభూములుగా పచ్చటి ప్రాంతాలను, దండకారణ్యాలనే ఎన్నుకున్నారు. ఇందుకు కారణం.. కీకారణ్యాల్లోని ఆకుపచ్చ రంగే. ఇది ఎదుగుదలకు, ఆత్మోన్నతికి సూచిక. మనసులో ఒక పార్శ్వాన్ని పచ్చగా ఉంచుకోవాలని అంటారు. దీనివల్ల అంతులేని సృజనాత్మకత పెరుగుతుంది.
• ఈ సృష్టికి రజోగుణమే కారణం. అలాంటి రజో గుణానికి సూచిక ఎరుపు రంగు. అందుకే ఈ రంగును సృజనాత్మకతకు నిదర్శనంగా భావిస్తారు. ఇది పౌరుషానికి, ఉత్తేజానికి నిదర్శనం. శత్రువులను భయపెట్టే గుణం కూడా ఈ రంగులో ఉంది.
• సృష్టిలోని అన్నీ శూన్యంలో నుంచే ఉద్భవిస్తాయి. అందుకే అన్ని రంగులకూ నలుపు రంగును మూలంగా భావిస్తారు. ఇది తమో గుణ చిహ్నం. ఈ రంగు చెడు శక్తులను ఆకర్షించి తనలో లీనం చేసుకుంటుంది. అందుకే మన సంప్రదాయంలో చిన్నపిల్లలకు కాటుకను దిష్టిచుక్కగా పెడతారు. సాధారణంగా నలుపును విషాదానికి చిహ్నంగా భావిస్తారు. కానీ ఇది పవిత్రతకు సూచిస్తుంది. ఐహిక ప్రపంచానికి దూరంగా ఉన్న వారు ఈ రంగు దుస్తులను ధరించాలంటారు. అయ్యప్ప దీక్షధారులు ఈ రంగు దుస్తులను ధరించడంలో పరమార్థమిదే. చీకటిలో నుంచే అనేక రంగులు ఉద్భవించి తెలుపులో లీనమవుతున్నాయి. కాబట్టి ఈ రంగును భగవంతుడి స్వరూపంగా భావిస్తారు. అందుకే ధాన్యం చేసేటపుడు నల్లని చుక్కపై దృష్టి నిలుపుతారు. ఈ రంగు దుస్తులు ధరించే వారు ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు.
• అత్యంత ప్రశాంతతకు, అత్యున్నత తాత్త్వికతకు, సత్వ గుణానికి నిదర్శనం తెలుపు రంగు. ఈ వర్ణంలో ఉన్న స్వచ్ఛత ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి కారణమవుతుంది. మనిషి ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు తెల్లటి రంగునే ఇష్టపడతాడు. తెలుపు వస్త్రాలను ధరించాలని అనుకుంటాడు. స్వచ్ఛతకు ఈ రంగు ప్రతీక.
• పసుపు మన సంప్రదాయంలో అత్యంత శుభసూచిక. లోకంలో ఇదే అత్యంత ఆకర్షణీయమైన రంగని అంటారు. ఈ పసిడి వర్ణం శుభాన్ని, శ్రేయస్సును కలిగిస్తుందని నమ్మకం.
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతిలోని ప్రతి రంగుకూ ఓ ప్రత్యేకత ఉంది. వాటిని చూడగానే కలిగే ప్రతిస్పందనకు ఒక కథ ఉంది. ఒక్కో రంగుకు ఒక్కో లక్ష్యం, అవసరం, ప్రత్యేకత ఉన్నాయి. మానసిక ఔన్నత్యం, ఆధ్యాత్మిక శక్తులకు రంగులు ప్రతీకలుగా నిలుస్తాయని కిర్లియన్ ఫొటోగ్రఫీ నిరూపించింది. దీంతో ఫొటోలు తీసినపుడు మనిషి చుట్టూ వైవిధ్యమైన రంగులతో కాంతి పరివేషం కనిపిస్తుంది. ఇది కోపంగా ఉన్నపుడు ఒక రకం, శాంతంగా ఉన్నపుడు మరో రకం, ఆందోళనగా ఉన్నపుడు ఇంకో రకంగా ఉంటుంది. కొన్నేళ్ల క్రితం భగవాన్ సత్యసాయిబాబాను ఈ విధానంలో ఫొటో తీసినపుడు ఆయన చుట్టూ అద్భుతమైన నీలికాంతులను గమనించానని ఓ శాస్త్రవేత్త చెప్పారు. ఏ రంగు మన ఆధ్యాత్మికతకు, మన ఉన్నతికి, మన మనస్తత్వానికి దోహదపడుతుందో అర్థం చేసుకోవడమే భగవంతుని స్వప్నలిపిని అధ్యయనం చేయడం. మనిషి తానున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఈ అధ్యయనం ఎంతో దోహదపడుతుంది. దీనిని తెలుసుకున్న వాళ్ల జీవితం వర్ణరంజితమవుతుంది. సప్తవర్ణ శోభితమవుతుంది.
జగన్మాత స్వరూపాలు కూడా వివిధ రంగుల్లో ఉంటాయి. అంటే ఒక్కో అమ్మవారు ఒక్కో రంగులో కనిపిస్తుంటారు? దీని వెనుక ఏదైనా రహస్యం ఉందా? అసలు దేవతలు వివిధ రంగుల్లో ఎందుకు ఉంటారు? తమ రంగు ద్వారా దేవతలు చాటే పరమార్థం, సర్వవ్యాపకత్వం ఏదైనా ఉందా?
దుర్గాదేవి పసుపు వర్ణంతో ప్రకాశిస్తుంది.
కాళికాదేవి ముదురు నీలం రంగులో ఉంటుంది.
సరస్వతీదేవి తెల్లని దవళ వర్ణంతో స్వచ్ఛమైన ముత్యపు రంగులో ప్రకాశిస్తుంది.
ఇలా ఒక్కో దేవతను స్మరించుకోగానే ఒక్కో రంగు మన మనసులో తళుక్కున మెరుస్తుంది. దేవుడు లేదా దేవతను ఆ రంగులోనే మనం భావన చేస్తాం. మరో రంగులో ఆ దేవతను పోల్చుకోలేం.
ఆకాశం రంగు నీలం. ఆకాశానికి విశ్వమంతటా వ్యాపించి ఉండే లక్షణం ఉంది. దూరం నుంచి చూస్తే సముద్రం కూడా నీలం రంగులో కనిపిస్తుంది. సముద్రం అనంతం అనే భావనకు ప్రతీక. ఇలా సర్వవ్యాపక లక్షణాలు కలిగిన నీలపు రంగులోనే రాముడు ఉన్నాడు. రామకృష్ణులు ఇద్దరూ మహావిష్ణువు యొక్క అవతారాలు. వారిద్దరిలోని సర్వవ్యాపకత్వాన్ని నీలం రంగు వ్యక్తం చేస్తుంది. ఇలాగే దేవతలందరూ కూడా తమ తమ వర్ణాల ద్వారా తమ స్వరూప స్వభావాలను వ్యక్తీకరిస్తుంటారు. ఇలా ఒక్కో దేవతకు ఒక్కో రంగు ఉంటుంది. ఈ రంగులన్నీ ఆయా దేవతల స్వభావాన్ని ప్రకటిస్తాయి. జగన్మాత స్వరూపాలు కూడా అంతే. ఒక్కో అమ్మవారు ఒక్కో రంగు కలిగి ఉంటారు. కింది ఉదాహరణ చూడండి..
అన్నపూర్ణాదేవి ఎరుపు
లక్ష్మీదేవి బంగారు
సరస్వతి తెలుపు
కాళి ముదురు నీలం
దుర్గాదేవి పసుపు
మహిషాసురమర్ధని ఎరుపు
రాజరాజేశ్వరీదేవి పసుపు
బగళాముఖి బంగారు
శాకంబరి మిశ్రమ వర్ణం
‘నవ వర్ణాలు’ అంటారు కదా! ఏయే రంగులు నవ వర్ణాల కిందకు వస్తాయి. వాటిని వేటికి ప్రతీకగా భావిస్తారు. నవగ్రహాలకు, నవ వర్ణాలకు సంబంధమేమిటి? రంగులతో కూడా మనిషి భావాలు, భావోద్వేగాలు ముడిపడి ఉంటాయా?
అవును. నవవర్ణాలంటే నవగ్రహాలకు ప్రతీకగా చెప్పిన వర్ణాలే. వీటి గురించి తెలుసుకునే ముందు మన తత్త్వమేంటో తెలుసుకోవాలి. మనిషి నడవడిక, ఆలోచన, వ్యవహారం, దైనందిన జీవితం, భవిష్యత్తు అంతా ఆయా గ్రహాల సంచారం మీదనే ఆధారపడి ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అందుకే, నవగ్రహాల ఆరాధన, జపం, దానాలు తప్పనిసరిగా చేయాలని ఆ శాస్త్రం చెబుతోంది. వీటితోపాటు ప్రత్యేకంగా ఆయా గ్రహాలకు ప్రతీకగా కొన్ని రంగులను కూడా పేర్కొంది. పూజా సమయంలో ఏ గ్రహానికి అర్చన చేస్తున్నామో దానికి సంబంధించిన రంగు వస్త్రాన్ని ధరించాలని పండితులు చెబుతారు. దీనివల్ల ఆ గ్రహాధిదేవతకు తృప్తి కలుగుతుంది. ఆయా గ్రహాలకు సంబంధించిన రంగుల్లో ఉండే ముత్యం, వజ్రం, కెంపు, పగడం వంటి రత్నాలను ఉంగరాల్లో ధరించాలని కూడా జ్యోతిష్కులు చెబుతారు. ఇవన్నీ ఆయా రంగులతో ముడిపడి ఉన్న భావనలను ఆ వ్యక్తి మనసులో తీవ్రతరం చేయడం లేదా మందగింప చేయడం కోసం ఉద్దేశించినవే.
సూర్యుడు ఎరుపు
చంద్రుడు తెలుపు
కుజుడు ఎరుపు
బుధుడు ఆకుపచ్చ
గురుడు పసుపు
శుక్రుడు తెలుపు
శని నలుపు
రాహువు తేనె రంగులో ఉండే నలుపు
కేతువు చిత్రవర్ణం
Review పతి రంగుకూ ఓ ప్రత్యే‘కథ’.