శ్రీరామ నవమి రోజున పానకం – వడపప్పును భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. దీని ప్రాముఖ్యత ఏమిటి? ఈ ప్రసాదం వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. శ్రీరామ నవమి నాటికి వేసవి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సమయంలో పానకం – వడపప్పును ప్రసాద రూపంలో సేవించడం వల్ల ఆరోగ్యం, ఆయుష్షుతో పాటు అలసట తీరుతుందని పండితుల అభిప్రాయం. మన దేవతా ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు – పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీ భాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతువ్యాధులకు, పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని కలిగిస్తాయని, ఔషధంగా పని చేస్తాయని అంటారు. పానకం విష్ణువుకు ప్రీతిపాత్రమైనది. ఇందులో వినియోగించే పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలువ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక అయిన పెసరపప్పును ‘వడ’ పప్పు అంటారు. అంటే, మండుతున్న ఎండల్లో వడదెబ్బ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని దీనిని ‘వడపప్పు’ అంటారు. పెసరపప్పు బుధ గ్రహానికి ప్రీతిపాత్రమైనది.
పానకం
కావాల్సినవి: బెల్లం- 3 కప్పులు, మిరియాల పొడి- 3 టీ స్పూన్లు, ఉప్పు- చిటికెడు, శొంఠిపొడి- టీ స్పూన్, నిమ్మరసం- 3 టీ స్పూన్లు, యాలకుల పొడి- టీ స్పూన్, నీరు- 9 కప్పులు.
పానకం తయారు చేసే విధానం: ముందు బెల్లాన్ని మెత్తగా దంచి, నీళ్లలో కలపాలి. బెల్లం మొత్తం కరిగాక.. పలుచని క్లాత్‍తో వడకట్టాలి. ఇందులో మిరియాల పొడి, శొంఠిపొడి, ఉప్పు, యాలకుల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అంతే పానకం సిద్ధమైనట్టే.
వడపప్పు
కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు- కప్పు, కీరా- ఒక ముక్క, పచ్చిమిర్చి-1 (తరగాలి), కొత్తిమీర తరుగు- టీ స్పూన్, కొబ్బరి తురుము- టేబుల్ స్పూన్, ఉప్పు- తగినంత.
వడపప్పు తయారీ విధానం: పెసరపప్పును నాలుగు గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి. నీటిని వడకట్టేసి, పప్పు ఒక గిన్నెలో వేయాలి. దాంట్లో కీరా తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలిపితే వడపప్పు సిద్ధం.
ఉగాది పచ్చడి
కావాల్సినవి: వేపపువ్వు- తగినంత, చిన్న చెరుకు ముక్క- 1, చిన్న కొబ్బరి ముక్క- 1, అరటిపళ్లు- 2, చింతపండు- తగినంత, చిన్న మామిడికాయ- 1, బెల్లం- 100 గ్రాములు, పచ్చి మిరపకాయ- 1, ఉప్పు- తగినంత, నీళ్లు- సరిపడినన్ని.
తయారు చేసే విధానం: ముందుగా చెరుకు, కొబ్బరి, బెల్లం, మిర్చి, మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. వేపపువ్వును శుభ్రంగా కడిగి రేకుల్ని తీసి పెట్టుకోవాలి. తగినన్ని నీళ్లలో చింతపండును బాగా కలిపి వడకట్టిన పులుపు నీళ్లను చిన్న కొత్త కుండలోకి పోయాలి. అందులో బెల్లం తురుము వేసి బాగా కలపాలి. ఆ తర్వాత చిటికెడు ఉప్పు, చెరుకు, కొబ్బరి, మామిడికాయల ముక్కలు వేసి బాగా కలపాలి. చివరగా అరటింపడు ముక్కలు వేయాలి. అంతే.. షడ్రుచుల ఉగాది పచ్చడి సిద్ధం
Review పానకం-వడపప్పు తయారీ.