రాక్షస సంహారం చేసిన జగన్మాత చివరి రోజున రణన్నినాదం చేసింది. సర్వ దుర్లక్షణాలకు ప్రతీకైన మహిషాసురుడిని మట్టుబెట్టింది. ఆ సమయంలోనే విశ్వాంతరాళాల్లోకి వ్యాపించిన ఆమె రూపాన్ని ఆదిశంకరులు దర్శించి అమితానందాన్ని పొందారు.
‘అయిగిరినందిని, నందిత మేదిని’ అంటూ పులకించిపోయారు. ‘అయిజగదంబ కదంబ వనప్రియా’ అంటూ కీర్తించారు. ‘మధుమధురే మధుకైటభభంజనీ’ అంటూ ప్రార్థించారు. అదే 21 శ్లోకాల మహిషాసుర మర్దిని స్తోత్రంగా అవతరించింది.
ఇందులోని ప్రతి అక్షరం మంత్రమే.. ప్రతి పదం, ప్రతి పాదం భక్తుల ఇహానికి, పరానికి బాటలు వేసింది. ఈ శ్లోకంలోని కొన్ని ముఖ్య పాదాలకు అర్థమిదీ..
అయినిజ హుంకృతి మాత్రనిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే
సమరవిశోషిత శోణిత బీజసముద్భవ శోణిత బీజరతే శివ శివ శుంభ నిశుంభ మహాహవతర్పిత భూతపిశాచరతే
జయజయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
కేవలం హుంకారంతో ధూమ్రాక్షుడు, విలోచనుడు వంటి రాక్షసులను అమ్మ నిర్జించింది. శుంభ, నిశుంభులను రణరంగ మధ్యంలో రక్తపుటేరులో ముంచెత్తింది. మహా సమరంలో రాలిపడే ప్రతి చెమటచుక్క నుంచి, ప్రతి రక్తపు బొట్టు నుంచి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ మహాశక్తి ఎదిగిపోతూ ఉంది. జగదంబ విసిరిన అర్ధచంద్రాకృతి ఉన్న బాణం దెబ్బకు దుర్ధరుడు విలవిల్లాడుతూ మరణించాడు. త్రినేత్రుడనే రాక్షసుడు గదతో అమ్మను అడ్డుకోబోతే త్రిశూలంతో అతడిని సంహరించింది. అంధకాసురుడిని ఆమె సింహమే మింగేసింది.
అమ్మ సమరానికి కదిలిన సమయంలో ఆమె వెనుక దేవతలంతా చతురంగ బలాలుగా బారులుదీరి ఉన్నారు. మెరిసే కత్తి, ఇత్తడిమొన కలిగిన బంగారు బాణాలతో కూడిన ధనుస్సును ధరించింది ఆమె. శత్రువుపై ఉరకడానికి సిద్ధపడుతున్న సమయంలో ఆమె దేహంతో పాటు యుద్ధ పరికరాలు, ధరించిన స్వర్ణాభరణాలు చిత్రంగా ఊగుతూ విశేష ప్రతిభ కలిగిన కళాకారిణి చేస్తున్న నాట్యవిన్యాసంలా కనిపిస్తున్నాయి.
జయ జయ జప్య జయే జయ శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే
భణ భణ భింజిమి భింకృతనూపుర సింజితమోహిత భూతపతే
నటితనటార్ధ నటీనటనాయక నాటిత నాట్య సుగానరతే..
అసురులను సంహరించే క్రమంలో జగన్మాత చేస్తున్న వీరవిహారానికి యావత్ప్రపంచం విస్తుపోతోంది. ఆ తల్లి విజయ విహారానికి జయజయధ్వానాలు పలుకుతోంది. దేవతలు నాట్యం చేస్తున్నారు. సురకాంతలు తతథై తథై తతథై అంటూ నట్టువాంగం మొదలుపెట్టారు. హాసవిలాసాలతో దేవి చూపు ప్రసరించింది. నమస్కరిస్తున్న భక్తులందరినీ ఒకసారి ప్రేమగా వీక్షించిందామె. ధిమికిట ధిక్కిట ధిక్కిట ధిమి ధిమి అంటూ మృదంగనాదం ప్రారంభమైంది. జయజయ జయజగదంబ అంటూ జయధ్వానాలు మిన్నుముట్టాయి.
అయి సుమన: సుమన: సుమన: సుమన: సుమనోహర కాంతియుతే
శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకర వక్త్రవృతే
సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే..
పరాశక్తి ధరించిన కాలి మువ్వల నుంచి వస్తున్న సవ్వడితో పాటు విస్తరిస్తున్న కాంతింపుంజాలు బాలభానుడి కిరణాలను అధిగమిస్తున్నాయి. అమ్మవారి నేత్ర సౌందర్యం ముందు భ్రమరాలు చిన్నబోతున్నాయి. ఆ నేత్రాలు పద్మాలని భావిస్తున్న తుమ్మెదలు మకరందం గ్రహించాలని అటుగా వచ్చాయి. హేలా నృత్యవేళ అంబ వేగంగా పదం కదుపుతుంటే ఏ దిక్కున చూసినా చందమామ అప్పుడే ఉదయించినట్టు ఆమె ముఖబింబమే కనిపించింది. అన్ని దిక్కులా సుమనోహర కాంతిపుంజాలు దర్శనమిస్తుంటే జగత్తు పావనమవుతోంది.





































































































































































































































































































































































Review మధుమధురే మధుకైటభభంజనీ.