‘రామ’ నామ మహిమ

‘రామ’ అంటే రమించుట అని అర్థం. కాబట్టి మనం ఎల్లప్పుడూ మన హృదయ కమలంలో వెలుగొందుతున్న ఆ ‘శ్రీరాముని’ కనుగొనుచుండాలి. ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అంటూ విష్ణు సహస్ర నామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పాలని శివుడిని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు ‘ఓ పార్వతీ! నేను నిరంతరం ఆ ఫలితం కోసం జపించేది ఇదే సుమా!’ అంటూ ఈ కింది శ్లోకంతో మంత్రోపాసన చేస్తాడు.

శ్రీ రామ రామ రామేతి
రమే రామే మనోరమ ।
సహస్ర నామతత్తుల్యం
రామనామ వరాననే ।।

పై శ్లోకాన్ని మూడుమార్లు స్మరిస్తే ఒక్క విష్ణు సహస్ర నామ పారాయణ చేసిన ఫలితమే కాదు.. భక్తులకు శివ సహస్ర నామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థమై చైత్ర శుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్ఛ స్థితిలో ఉన్న కాలంలో పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తూ ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామ నవమి’గా విశేషంగా జరుపుకుంటాం.

ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్య క్షేత్రంలో మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే పై తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి, వారికి సద్గతి కలిగిస్తాడనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఇక, భక్త రామదాసు అయితే సరేసరి. శ్రీహరి నామ గాన మధుపానాన్ని భక్తితో సేవించి, ‘శ్రీరామ నీ నామమేమి రుచిరా.. ఎంతో రుచిరా.. మరి ఎంతో రుచిరా..’ అని కీర్తించాడు.

మనం శ్రీరామ నామాన్ని ఉచ్ఛరించేటపుడు ‘రా’ అనగానే మన నోరు తెరుచుకుని, మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామ నామ అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగే ‘మ’ అనే అక్షరం ఉచ్ఛరించినపుడు మన నోరు మూసుకుంటుంది. కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవని, అందువల్లనే మానవులకు ‘రామ నామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట. శ్రీరామ నవమి రోజున వీధులలో పెద్ద పెద్ద చలువ పందిళ్లు వేసి, సీతారామ కల్యాణం చేస్తారు. ఇళ్లలో కూడా యథాశక్తిగా రాముని పూజించి, వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారు.

‘ర’ అక్షరం ప్రాముఖ్యత
చారిత్రకంగా చూస్తే రామాయణ కథ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామ నవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తు న్నారు. ముఖ్యంగా రామాయణం, రామ నవమి లలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది.

‘రవి’ అంటే సూర్యుడు. ప్రాచీన నాగరికతలో సూర్యుడిని ‘అమన్‍ రా’ లేదా ‘రా’ అనే వారు. లాటిన్‍ భాషలో కూడా ‘రా’ ప్రత్యయం వెలుగును సూచిస్తుంది (రేడియెన్స్, రేడియం).
ఏడాదంతా రామ నామాన్ని జపించలేని వారు కూడా రామ నవమి రోజుల్లోనైనా మనసారా ‘రామ’ నామాన్ని జపించి పుణ్యం పొందవచ్చు. అందునా ‘రామ’ అని పలకడం చాలా సరళం. ఈ సూక్ష్మ మంత్రం అందించే శక్తి అంతా ఇంతా కాదు.

Review ‘రామ’ నామ మహిమ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top