వెలుగు పూలు

ఆసేతు హిమాచలం పిల్లలు, పెద్దలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. ఇది మన తెలుగు వారికి, మరియు దక్షిణ భారతీయులకు మూడు రోజుల పండుగ. ఇది ఆశ్వయుజ మాసం చివరిలో వస్తుంది. ఈ పండుగ మూడు రోజుల్లో మొదటిది నరక చతుర్దశి. రెండవది దీపావళి అమావాస్య. మూడవది బలి పాడ్యమి. నరక చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. నరకుని ఉద్దేశించి నాలుగు వత్తులతో దీపాన్ని దానం చేయాలి. సాయంకాలం ఆలయాల్లో దీపాలను.

అమావాస్య నాడు సూర్యుడు ఉదయిస్తున్న ప్రత్యూష కాలంలో తల స్నానం చేయాలి. కొత్త బట్టలు వేసుకోవాలి. మధ్యాహ్నం వేళలో అన్న దానాలు చేసే ఆచారం కూడా కొన్నిచోట్ల ఉంది. సాయంత్రం లక్ష్మీపూజ చేయాలి. దేవాలయాల్లో, ఇంటి ముంగిళ్లలో దీపాలను అలంకరించాలి. కొన్ని ప్రాంతాల్లో చెక్కతో చెట్లలాగా చేసి, అందులో దీపాలను ఉంచుతారు. వీటినే దీప వృక్షాలంటారు. కొన్ని ఆలయాల్లో ఇత్తడి దీప వృక్షాలు కూడా దర్శనమిస్తాయి. ఆకులతో దొన్నెలు కుట్టి వాటిలో నూనెతో దీపాలను చేసి నదులలో, కొలనులలో, నూతులలో (బావి) తెప్పల మాదిరిగా వదులు తారు.
ఆనాటి రాత్రికి స్త్రీలు చేటలు, తప్పెటలు వాయిస్తూ సంబరంగా జ్యేష్ఠాదేవి (అలక్ష్మి, పెద్దమ్మారు, దారిద్య్ర దేవత అని పేరు)ని ఇళ్ల నుంచి తరుముతారు. తరువాత ఇంటిని ముగ్గు లతో అలంకరించి, బలి చక్రవర్తిని స్థాపించి పూజిస్తారు. మూడవ రోజు బలి పాడ్యమి. ఉదయం జూదం ఆడతారు. ఆ రోజు గెలిచిన వారికి సంవత్సరమంతా జయం కలుగుతుందని నమ్మకం. ఈనాడు గోవర్ధన పూజ కూడా చేస్తారు.
దీపావళి పండుగను ఎందుకు జరుపు కుంటారోననడానికి అనేక పురాణ కథలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి-
1. నరకాసుర వధ, 2. బలి చక్రవర్తి రాజ్య దానం, 3. శ్రీరాముడు రావణ సంహారం అనం తరం అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమా వేశం కావడం (ఇదే భరత్‍ మిలాప్‍గా ప్రసిద్ధి), 4. విక్రమార్క చక్రవర్తి పట్టాభిషేకం.
ఈ కథలలో బలి చక్రవర్తి కథ తప్ప మరి దేని గురించి వ్రత గ్రంథాలలో, ధర్మశాస్త్ర గ్రంథా లలో లేదు. ధర్మసింధువు తదితర అన్ని గ్రంథాలలో బలి చక్రవర్తి కథ మాత్రమే ఉంది. దీపావళి అనగానే మనకు గుర్తుకు వచ్చే బాణసంచా కాల్పులకు ఆధారమైన నరకాసుర వధ ఎంతో ప్రచారంలో ఉన్నప్పటికీ ఈ కథ ప్రస్తావన వ్రత గ్రంథాలలో లేదు. నరక భయ నివారణార్థం అభ్యంగన స్నానం, దీపాలతో అలంకరించడం, లక్ష్మీపూజ తదితర విషయాలు మాత్రమే ఉన్నాయి. ఈ వ్రత గ్రంథాలలో ‘పరక’ అనే శబ్దానికి నరకము అనడానికి బదులు నరకాసురుడుగా అన్వయించి తరువాత కాలంలో పురాణ కథతో జోడించి ఉంటారని కొందరు పండితుల అభిప్రాయం. ఇందులో జ్యోతిశ్శాస్త్ర సంబంధమైన రహస్యం ఇమిడి ఉందని మరికొందరు అంటారు.
అక్కడ ఆ ఐదు తిథులు కలిస్తేనే దీపావళి..
దీపావళి అంటే దీపోత్సవం అనే విషయం తెలిసిందే. ఈ రోజున ప్రతి ఇల్లు, వీధి, దేవాలయం దీపాలతో వెలిగిపోతూ ఉంటాయి. నిజానికి ఇది ఐదు రోజుల పండుగ. ఈ పండుగ ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాటి నుంచి ప్రారంభమై కార్తీక శుద్ధ విదియతో ముగుస్తుంది.
ఆశ్వయుజ బహుళ త్రయోదశి తిథి- ధన త్రయోదశి తిథి.
ఆశ్వయుజ బహుళ చతుర్దశి తిథి- నరక చతుర్దశి తిథి
ఆశ్వయుజ అమావాస్య తిథి- దీపావళి పర్వం
కార్తీక శుద్ధ పాడ్యమి తిథి- గోవర్ధన పూజ
కార్తీక శుద్ధ విదియ తిథి- భగినీ హస్త భోజనం
ఈ ఐదు పండుగలు కలిసి జరుపుకుంటేనే నిజానికి దీపావళి. ఉత్తర భారతదేశంలో ఈ ఆచారం ఉంది.
మన తెలుగు నాట ప్రధానంగా నరక చతుర్దశి, దీపావళి పర్వాలను మాత్రమే ఎక్కువగా జరుపుకుంటారు.
అస్సాం, బెంగాల్‍ రాష్ట్రాలలో ఈ పండుగను ‘జగద్ధాత్రి పూజ’గా నిర్వహించుకుంటారు.
పశ్చిమ బెంగాల్‍ రాష్ట్రంలో దీపావళి రోజు ‘కలిపూజ’ను ఎంతో వైభవంగా జరుపుతారు.
ఒడిశా రాష్ట్రంలో ఈ పండుగను ‘కుమార పూర్ణిమ’గా ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి నాడు ప్రారంభించి దీపావళి వరకూ దీపోత్సవాలతో ఆటపాటలతో నిర్వహించుకుంటారు.
కర్ణాటక రాష్ట్రంలో మొదటి మూడు రోజులు దీపావళి పండుగను జరుపుకుంటారు.
తమిళనాడులో పగటి పూటనే దీపావళి సందర్భంగా టపాసులు కాలుస్తారు.
రాజస్థాన్‍ రాష్ట్రంలో ఈ పండుగను ‘ధన్‍ తేరస్‍’గా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున స్త్రీలు తమ నగలను నది నీటిలో కడుగుతారు. స్త్రీలు పిల్లిని లక్ష్మీదేవిగా భావించి పూజిస్తారు. అన్ని రకాల వంటలూ పిల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు.
గుజరాత్‍, మహారాష్ట్ర రాష్ట్రాలలో రకరకాల పిండివంటలతో ‘లక్ష్మీపూజ’గా జరుపుకుంటారు. ఈ రోజునే కొత్త పద్దుల పుస్తకాలు ప్రారంభిస్తారు.

Review వెలుగు పూలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top