శూర్పణఖ

లోకంలో వలచిన వనిత కోసం పేరుకెక్కిన పురుషులు ఉన్నట్టే, మనసు పడిన మగవాని కోసం చరిత్ర సృష్టించిన స్త్రీలూ ఉన్నారు. మహోన్నత త్యాగాలతో, మరపురాని సాహసాలతో కొందరు పేరు పొందితే, మితిమీరిన స్వార్థాలతో, దారుణ దుర్మార్గాలతో మరికొందరు చరిత్రకెక్కారు. రామాయణంలో శూర్పణఖ ఈ రెండవ కోవకు చెందిన స్త్రీ పాత్ర.
ఆమె ఏ ముహూర్తంలో రాముడిని చూసి మోహించిందో కానీ, ఆమె మోహం ఆ సీతారాముల దాంపత్యాన్ని చిందరవందర చేసింది. రావణుడి జీవితాన్ని సర్వనాశనం చేసింది. రామాయణ మహా కావ్యాన్నే పెద్ద మలుపు తిప్పింది. శూర్పణఖ రావణాసురుడి చెల్లెలు. ఆమెదొక వికృతరూపం.
అయినా రాక్షస స్త్రీ గనుక కోరిన రూపం ధరించగలదు. రావణుడు ఆమెను విద్యుజ్జిహ్యుడికి ఇచ్చి వివాహం చేశాడు.
విద్యుజ్జిహ్వునిది పాతాళలోకం.
యశ్శ నగరం. రావణుడు తన దిగ్విజయ యాత్రలో భాగంగా ఒకసారి ఆ యశ్శ నగరం మీద దండెత్తాడు. ఎదిరించిన కాలకేయులనంతా ఖండించాడు. మితిమీరిన యుద్ధావేశంలో బావమరిది విద్యుజ్జిహ్వుడిని కూడా వధించాడు.
స్వయానా చెల్లెలిని విధవను చేశాడు.
లంకకు రాగానే శూర్పణఖ రావణుడి పాదాలపై పడింది. పరిపరి విధాల దు:ఖించింది.
రావణుడు పశ్చాత్తప్తుడయ్యాడు.
చెల్లెలిని లేవనెత్తాడు. కన్నీళ్లు తుడిచాడు.
‘అమ్మా! నీకు అన్యాయం జరిగింది. ఆవేశంలో బావమరిది అనే సంగతి మరిచి నీ పతిని హతం చేశాను. మరణించిన నీ మగడిని మళ్లీ నీకివ్వలేను. అయితే నీ బతుకుదెరువుకు లోటు లేకుండా ఏర్పాటు చేస్తాను. తమ్ముడు ఖరుడిని దండకారణ్యంలో ప్రభువుగా నియమిస్తున్నాను. పద్నాలుగు వేలమంది రాక్షసులను అతడికి బలగంగా పంపుతున్నాను. దూషణుడు అతడికి దండనాథుడిగా వ్యవహరిస్తాడు. ఖరదూషణలు ఇద్దరూ నీ ఆజ్ఞానువర్తులై నడుచుకుంటారు. రాజ సోదరివై నువ్వు భోగభాగ్యాలు అనుభవించు’ అని ఆమెను ఓదార్చి ఖరుని వెంట దండకారణ్యం పంపాడు.
జీవితంలో శూర్పణఖ చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. అందుచేత ఆమె కామవాంఛలు అట్టే తీరలేదు. ఆ వయసులో భర్త సుఖం లేకుంటే ఆడమనిషికి పెద్ద అసంతృప్తి. అందమైన పురుషుడిని చూసినపుడంతా ఆమె మనసు చలిస్తుంది.అనుకూల దంపతులను చూసినప్పుడు ఆమె మనసు అసూయ పడుతుంది. పతి సౌఖ్యాన్ని అనుభవించే పర స్త్రీని చూస్తే ఆమె మనస్సు ఏమాత్రం సహించలేదు.ఎంతో సంస్కారం ఉంటేగాని ఆ వయసులో అలాంటి స్త్రీ అసంతృప్తినీ, అసూయను ఆవలికి పారద్రోలలేదు.
శూర్పణకది భర్త సుఖానికి దూరమైన జీవితం.
సంస్కార శూన్యమైన వ్యక్తిత్వం.
కామసంబంధమైన అసంతృప్తి, అసూయ ఆమె స్వభావంలో బలంగా గూడుకట్టుకున్నాయి.
అది హేమంత రుతువు. ఆనాడు ఉదయం గోదావరిలో స్నానం చేసి, పూజలన్నీ పూర్తి చేసుకుని సీతారామలక్ష్మణులు పర్ణశాల వాకిట విశ్రాంతిగా కూర్చున్నారు. చల్లగాలి మెల్లగా వీస్తూ ఉంది. ప్రకృతి శోభ కనులపండువగా ఉంది. ఒకే వేదిక మీద సీతారాములు, వేరొక వేదిక మీద ఒకింత దూరంలో లక్ష్మణుడు కూర్చుని ముగ్గురూ మనోహర ప్రకృతి గురించి ముచ్చటించుకుంటున్నారు.
సీత రాముడికి మరీ చేరువగా ఉంది.
మగని వైపు ఒకింత ఓరగా ఆయన కళ్లలోకి చూస్తూ ఉంది. అంతలోనే శూర్పణఖ ఎక్కడి నుంచో అక్కడికి వచ్చింది.
ఆ దంపతులను చూసింది. ‘ఆహా! ఎంత అందగాడు? ఆయన పక్కన ఆ భంగిమలో నేనే ఉంటే…’ అంటూ ఏవేవో కలలు కన్నది.
వెంటనే తన వికృత రూపాన్ని వదిలింది.
ఏదో తొడుగు దిగవేసుకున్నట్టు అందమైన రూపం ధరించింది. అయితే ఆ అందం వెనుక ఏదో చెప్పలేని వికారం తొంగి చూస్తూనే ఉంది.
శూర్పణఖ వయ్యారాలు ఒలకబోస్తూ శ్రీరాముడి ఎదుట నిలిచింది. ‘తాపస వేషం ధరించి,

ధనుర్బాణాలు చేతబట్టి దండకారణ్యం వచ్చిన మీరెవరు?’ అని అడిగింది రాముని ముఖంలోకి తీక్షణంగా చూస్తూ. రాముడు తన సంగతి చెప్పాడు. తన భార్య సంగతి చెప్పాడు.
తమ్ముడి సంగతి చెప్పాడు. తామెందుకు వచ్చారో తెలియచెప్పాడు. ఆ తరువాత ‘అంగనామణీ! నీవెవరు?’ అని ప్రశ్నించాడు.
శూర్పణఖ తన సంగతి చెప్పింది.
తన అన్నలైన రావణ, కుంభకర్ణుల సంగతి చెప్పింది. తమ్ముడు విభీషణుడి సంగతి చెప్పింది.
క్రూర పరాక్రములైన ఖరదూషణాదుల సంగతి చెప్పింది. శ్రీరాముడి ముఖంలోకి సాభిప్రాయంగా చూసి, ‘నిన్ను ప్రేమించా’నంది.
‘సీత నీకు తగిన భార్య కాదు. నన్ను చేపట్టి జనస్థానంలో స్వేచ్ఛగా విహరించు’ అని రాముడిని కోరింది. రాముడు ఆశ్చర్యపోయాడు.
అల్లన నవ్వి, ‘శూర్పణఖా! నేను సీతాపతిని. నిన్ను కూడా చేపట్టితే ఈ సీత నీకు సవతి అవుతుంది. నీవంటి ఉత్తమ స్త్రీలకు సవతి పోరు సహించడం కష్టం. అడుగో తమ్ముడు లక్ష్మణుడు. ఆయన ఒంటరివాడు. అన్నివిధాలా నీ అందానికి తగిన వాడు’ అన్నాడు రాముడు అపహాస్యంగా.
శూర్పణఖ వెంటనే లక్ష్మణుడి వద్దకు వెళ్లింది.
తన వంపుసొంపులను ప్రదర్శించింది.
తనను భార్యగా స్వీకరించాలని వేడుకుంది.
లక్ష్మణుడు పకపకా నవ్వాడు. ‘వెర్రిదానా! నేను రామదాసుడిని. నన్ను పెళ్లాడితే నువ్వూ దాసివవుతావు. నీలాంటి అందగత్తెకు దాసీత్వమా? అయ్యో! అది ఎంత మాత్రం ఉచితం కాదు. నీవు ఆ రాముడినే చేపట్టు. ఆయన రెండవ భార్యగా ఉండు. నీ ముందు ఆ సీతమ్మ అందమెంత? ఆయన నిదానంగా నిన్నే నెత్తికెక్కించుకుంటాడు. సీతమ్మను సాగనంపుతాడు’ అనగానే శూర్పణఖ మురిసిపోతూ మళ్లీ రాముడి వద్దకు వెళ్లింది.
సీతమ్మను చురచురా చూసింది.
ఆమె అడ్డే లేకుంటే ఆ రాముడు తననే వరిస్తాడని తలచింది. మహోగ్రంగా నోరు తెరిచింది. సీతమ్మను మింగాలని మీదికి వచ్చింది. రాముడు ససంభ్రమంగా లేచాడు.
శూర్పణఖను అదలించాడు.
‘లక్ష్మణా! ఈ రాక్షసి హద్దుమీరింది. సీతను మనం రక్షించుకోవాలి. శూర్పణఖను అంగవిహీనం చెయ్యి’ అని ఆజ్ఞాపించాడు.
వెంటనే లక్ష్మణుడు ఖడ్గంతో ఆ రాక్షసి ముక్కుచెవులూ కోసేశాడు.
నేల అంతా నెత్తుటిమయం అయింది.
పాపం! సీతమ్మ ఆ దృశ్యాన్ని చూడలేక రెండు చేతులతో కళ్లు మూసుకుంది.
హాహాకారాలతో ఆ శూర్పణఖ ఆకాశానికి ఎగిరింది. ఒక్క ఉదుటున ఖరుడి ముందు వాలింది. కడుపు బాదుకుంటూ జరిగినదంతా చెప్పింది. ఖరుడు మహోగ్రుడయ్యాడు.
ఆ రామలక్ష్మణులు తన ముక్కు చెవులే కోసినట్టు బాధపడ్డాడు. పద్నాలుగు మంది మహావీరులైన రాక్షసులను పిలిచాడు.
ఆ సీతారామలక్ష్మణులను చంపి రమ్మన్నాడు.
శూర్పణఖ వాళ్ల వెంట వెళ్లింది.
ఒక చెట్టు చాటున దాగింది.
ఆ శ్రీరామచంద్రుడిని చూపింది.
రాక్షస వీరులు పద్నాలుగు మంది రాముడి మీద విజృంభించారు. ఆయన బాణాలకు హతులయ్యారు. శూర్పణఖ అంతా చూసింది.
పెద్దగా అరచి, పరుగెత్తుకుని వచ్చి ఖరునితో ఆ రాక్షసుల చావు సంగతి చెప్పింది.
రాముడి బలపరాక్రమాలు వర్ణించింది.
నోరు కొట్టుకుంటూ, జుట్టు పీక్కుంటూ ఇది రాక్షసజాతికే అవమానమని అతడిని రెచ్చగొట్టింది. ఖరుడు మహొగ్రుడయ్యాడు.
పటపట పళ్లు కొరికాడు. సమస్త సైన్యంతో శ్రీరాముడి మీదకు దండెత్తి వెళ్లాడు.
శూర్పణఖ తృప్తిగా ఒక్క ఊర్పు విడిచింది.
యుద్ధం చూడాలని ఖరుడి వెంట వెళ్లింది.
అయితే ఆమె ఆశించినదొకటి.. అయినది ఇంకొకటి. ఖరదూషణాదులు ససైన్యంగా రాముడి చేతిలో ఖండితులయ్యారు.
శూర్పణఖ గుండెలదిరాయి.
పెద్దగా ఒక్క కేక పెట్టి లంకకు ఎగిరివెళ్లింది.
అది లంకలో పుష్పక విమానాగ్ర భాగం.
అప్పుడే రావణుడు మారీచాశ్రమం నుంచి తిరిగి వచ్చాడు. మంత్రులతో కొలువుదీరాడు.
అంతకుముందు అకంపనుడు చెప్పిన శూర్పణఖావమానాన్ని గురించి, ఖరదూషణ సంహారాన్ని గురించి, రామలక్ష్మణుల •లపరాక్రమాన్ని గురించి, సీతా సౌందర్యాన్ని గురించి, మారీచుని సలహాను గురించి మనసులో ఆలోచిస్తున్నాడు. అంతలోనే శూర్పణఖ వచ్చింది. కడుపు బాదుకొంటూ, కన్నీటి ధారలతో, నెత్తుటి చారికలతో ముక్కుచెవులు లేకుండా మిక్కిలి వికృతంగా ఉంది. రావణుడి పాదాలపై వాలింది.
‘అన్నా! నువ్వు మన్మథ భోగాల్లో మునిగి మీదికి వచ్చే ప్రమాదాన్ని గుర్తించలేకున్నావు. చారుల వల్ల విషయాలు తెలుసుకోకుండా స్త్రీలోలుడవై విహరిస్తున్నావు. జనస్థానంలో రాముడు రాక్షసులను నిర్మూలిస్తున్నాడు. మహర్షులకు అభయమిస్తున్నాడు. మన ఖరదూషణులను ససైన్యంగా ఖండించాడు. అతని పరాక్రమం అద్వితీయం. అతడి తమ్ముడు అన్ని విధాలా అన్నకు తగిన వాడు. అన్ని విషయాల్లో అన్నకు సాయంగా ఉంటాడు. సీత రామపత్ని. ఆమె అతిలోక సౌందర్యవతి. దేవ గంధర్వ యక్ష కిన్నెరులలో అంతటి అందగత్తె లేదు. అలాంటి భార్యను పొందిన పురుషుని జీవితమే చరితార్థం. నీకు ఆమె భార్య అయితే అన్ని విధాలా బాగుంటుంది. నేను అపహరించి తెచ్చి ఆమెను నీకు ఇవ్వడానికి ప్రయత్నించాను. అందుకే లక్ష్మణుడు నాకీ గతిని పట్టించాడు’ అంటూ బావురుమని ఏడ్చింది. తెగిన ముక్కు, చెవులు చూపించింది. చెల్లెలికి జరిగిన అవమానాన్ని, రాముడి పరాక్రమాన్ని, ఖరదూషణ సంహారాన్ని సహించి ఊరుకుంటావా? అని రెట్టించి అడిగింది రావణుడిని శూర్పణఖ.
అంతేగాక, ‘సీతను భార్యగా పొందలేని నీకు ఈ భోగభాగ్యాలు ఎందుకు?’ అని ఎత్తిపొడిచింది.
రావణ హృదయాన్ని సీతాపహరణానికి సిద్ధం చేసింది. రామాయణంలో మంథర రామ పట్టాభిషేకాన్ని చెడగొట్టి, ఆయన జీవితాన్ని అడవుల వైపు మళ్లిస్తే, శూర్పణఖ అరణ్యవాసంలో ఆయన అర్ధాంగిని అపహరింప చేసి, రామబాణాన్ని రావణుడి మీదికి గురిపెట్టేలా చేసింది. మంథర, శూర్పణఖ వల్ల రాముడికి అపకారమే జరిగినా లోకానికి మాత్రం ఉపకారమే జరిగింది. రామాయణ కావ్యం పెద్ద మలుపులు తిరిగింది.

Review శూర్పణఖ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top