సుకుమారి భానుమతి

మహాభారతం అనగానే మనకు గుర్తొచ్చే పేర్లు.. శ్రీకృష్ణుడు, పాండవులు, కౌరవుల్లోని దుర్యోధనుడు, దుశ్శాసనుడు, విదురుడు, దృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, శకుని.. మరికొన్ని పేర్లు మాతమ్రే. మహా భారతంలో అసలు సిసలైన ప్రతినాయక పాత్రధారి అయిన దుర్యోధనుడి గురించే తప్ప అతని భార్య గురించి తెలిసింది చాలా తక్కువ.
దుర్యోధనుడి భార్య పేరు భానుమతి. చాలా అందగత్తె. ఈమె కాంభోజ రాజ్యానికి చెందిన రాజపుత్రిక అని కొందరు అంటారు. ఆమె తండ్రి ద్రోణాచార్యునికి మిత్రుడు. అలాగే, భానుమతి కాశీ రాజు చిత్రాంగదుని కుమార్తె అని కొన్నిచోట్ల ప్రస్తావన ఉంది.
పాంచాల దేశ రాజకుమారి ద్రౌపది స్వయంవరానికి వెళ్లి, అక్కడ అర్జునుడి ముందు ఓడిపోతాడు దుర్యోధనుడు. పాండవులు ఆ స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకుని, అనంతరం పాండవులు ఐదుగురు ఆమెను పెళ్లి చేసుకుంటారు. దీంతో ఆ ఓటమిని తలచుకుని దుర్యోధనుడు కుమిలిపోతుంటాడు. ఇది జరిగిన తరువాత దుర్యోధనుడు చాలా రోజులు నిద్ర లేకుండా అసూయతో రగిలిపోయాడు. ఆ సమయంలో తన మామ అయిన శకుని ద్వారా, కాశీ రాజు చిత్రాంగదుడు తన కుమార్తె భానుమతికి స్వయంవరం ఏర్పాటు చేస్తున్నాడనే సమాచారం దుర్యోధనుడికి తెలుస్తుంది. ఆ స్వయంవరానికి హాజరు కావాలని శకుని దుర్యోధనుడిని ప్రోత్సహిస్తాడు. దీంతో దుర్యోధనుడు తమ మిత్రులైన కర్ణుడు, అశ్వత్థామను వెంటబెట్టుకుని స్వయంవరానికి వెళతాడు. ఇంకా ఆ స్వయంవరంలో పాల్గొనేందుకు శిశిపాలుడు, జరాసంధుడు, రుక్మి వంటి మహామహులు ఎందరో హాజరవుతారు. బల పరీక్ష లేని ఈ స్వయంవరంలో
పాల్గొనడానికి అర్హత.. కేవలం ఒక రాజ్యానికి యువరాజు అయి ఉండటమే.
స్వయంవరం ప్రారంభమవుతుంది. భానుమతి ఆ స్వయంవర సభలోకి తన చెలికత్తెలతో కలిసి పూలమాలతో అడుగుపెడుతుంది. ఆమె పక్కనున్న చెలికత్తెలు ఆ స్వయంవరానికి హాజరైన ఒక్కొక్క రాజకుమారుడి గురించి వర్ణిస్తూ ఉండగా, వారందరినీ పరికిస్తూ భానుమతి ముందుకు సాగుతుంటుంది. శిశుపాలుడు, జరాసంధుడు తదితర బలమైన రాజులను కాదని ముందుకు వెళ్తుంటుంది. దుర్యోధనుడి వంతు వచ్చేసరికి అతడిని కూడా చూసీ చూడనట్టుగా భానుమతి ముందుకు సాగిపోతుంది. అంతలో ఆమె కళ్లు కర్ణుడిపై పడతాయి. చూసీ చూడగానే అతనిపై మనసు పారేసుకుంటుంది. అది గమనించిన దుర్యోధనుడు ఆ అవమానాన్ని భరించలేకపోతాడు. అసలే నిలువెత్తు అహంకారానికి, అసూయకు ప్రతిరూపమైన దుర్యోధనుడు ఆ తిరస్కారాన్ని దిగమింగుకోలేకపోతాడు. వెంటనే ఆమెను ఎత్తుకుని సభామధ్యంలోనే బలాత్కారం చేయబోతాడు. కాశీరాజు ఈ ఘోరాన్ని అడ్డుకుని తన కుమార్తెను అపహరించి తీసుకుపోవాలని సలహానిస్తాడు. దుర్యోధనుడికి అడ్డుకునేందుకు ప్రయత్నించిన మిగతా రాజకుమారులను ఓడించే బాధ్యత కర్ణుడు తీసుకుంటాడు. దుర్యోధనుడు ఆమెను ఎత్తుకుని హస్తినకు చేరి వివాహం చేసుకుంటాడు. తన ముత్తాత భీష్మాచార్యుడు కూడా కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను తన సవతి తమ్ముళ్ల కోసం ఇలాగే తీసుకుని వచ్చాడని దుర్యోధనుడు అనంతరం తను చేసిన పనిని సమర్థించుకుంటాడు.
నిలువెత్తు అహంకారం, అధికారం కోసం ఎంతకైనా తెగించే తత్వం, ఆస్తి కోసం బంధువులను సైతం చంపే క్రూరత్వం.. ఈ లక్షణాలు మూర్తీభవించిన వాడు దుర్యోధనుడు. కానీ, అతని భార్యగా భానుమతి గురించి చాలా తక్కువ వివరాలు ప్రస్తావనలో ఉన్నాయి. ఆమెది భర్తకు పూర్తికి విరుధ్ధమైన మనస్తత్వమని, సున్నిత మనస్కురాలని అంటారు. భానుమతి, దుర్యోధనులకు ఇద్దరు సంతానం. కొడుకు లక్ష్మణ కుమారుడు కాగా, కుమార్తె లక్ష్మణ. మహాభారత యుద్ధంలో లక్ష్మణ కుమారుడు అర్జునుడి కుమారుడైన అభిమన్యుడి చేతిలో మరణిస్తాడు. దుర్యోధనుడి కుమార్తె లక్ష్మణను కృష్ణుడి కుమారుడు సాంబుడు అపహరించి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడనే కథ ప్రచారంలో ఉంది. కాగా, లక్ష్మణ కుమారుడి గురించి మరికొన్ని వివరాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. దాని ప్రకారం.. బలరాముడి కుమార్తె అయిన శశిరేఖను లక్ష్మణ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయిస్తారు. కానీ, అప్పటికే శశిరేఖ అర్జునుడి కుమారుడైన అభిమన్యుడిని ప్రేమిస్తుంది. దాంతో అభిమన్యుడు, ఘటోత్కచుని సాయంతో పెద్దలు నిర్ణయించిన పెళ్లిని చెడగొట్టి శశిరేఖను వివాహం చేసుకుంటాడు. ఇదే కథ ‘శశిరేఖా పరిణయం’ పేరుతో తెలుగు నాట విశేష ప్రాచుర్యంలో ఉంది.

Review సుకుమారి భానుమతి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top