స్వర్ణకూపం

ఒక పల్లెలో విక్రముడనే పేద కుర్రవాడు ఉండేవాడు. తన ఊళ్లో తనకు గడిచే ఎత్తు కనబడక, ఒక పట్నం వెళ్లాడు. బజారు మొనలో నిలబడి, కనిపించిన వారినల్లా ‘ఏమండీ! మీకు నౌఖరు కావాలా?’ అని అడుగుతుండే వాడు.
‘మాకు అక్కర్లేదంటే, మాకు అక్కర్లేద’ని వాళ్ల దారిన వాళ్లు పోయేవారు.

పొద్దుగుంకే సమయానికి తళతళ మెరిసిపోతున్న జలతారు దుస్తులు వేసుకుని ఒక వర్తకుడు వచ్చాడు. దుస్తులు చూస్తే బాగా ధనవంతుడిలాగా ఉన్నాడు. ముఖం చూస్తే మాత్రం గుడ్లగూబలాగా ఉండటం చేత, విక్రముడికి ఆ వర్తకుడితో మాట్లాడబుద్ధి కాలేదు.
ఆ వర్తకుడే విక్రముడిని పలకరించి ‘ఒరే అబ్బీ! నాకొక నౌఖరు కావాలి. రోజూ పది రూపాయల జీతం ఇస్తాను. వస్తావా?’ అని అడిగాడు. ఇష్టం లేకపోయినా విక్రముడు ఆ వర్తకుడి వెంట వెళ్లాడు.
వర్తకుడు ఓడరేవుకి వచ్చి, తన ఓడలో విక్రముడిని కూచోబెట్టుకుని, ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ఇల్లు చాలా విచిత్రమైనది. అది సముద్రంలో ఒక పెద్ద కొండ వారన ఉండే చాలా గొప్ప భవనం. గోడలన్నీ బంగారపువి. వాసాలన్నీ వెండివి. పెంకులన్నీ భమిడివి. విక్రముడు ఆశ్చర్యంతో ఆ వర్తకుడి వెనకాలే భవనంలోకి ప్రవేశించాడు. వాళ్లకు పదహారేళ్ల బాలిక ఎదురైంది. ఆ అమ్మాయి శరీరఛాయ బంగారపు కాంతిని మించి ఉంది.
ఆ అమ్మాయి అందం చూసి విక్రముడు విస్తుపోయాడు. అన్నట్టు విక్రముడు కూడా చాలా అందమైన వాడూ, బలమైన వాడూను. అతడిని చూసేసరికి ఆ అమ్మాయికి కూడా అలాగే అనిపించింది. అతన్ని చూడగానే ఆమెకు జాలీ, విచారము కలిగాయి. ఆ సంగతి గుడ్లగూడ వర్తకుడు కనిపెట్టలేదు కానీ, విక్రముడు మాత్రం కనిపెట్టాడు. అయినా ఆవిడ జాలికి కారణం మటుకు ఊహించలేకపోయాడు.
గుడ్లగూబయ్య విక్రముడికి ఆ రాత్రి భోజనం పెట్టించి, ‘అబ్బీ! పెందరాళే నిద్రపో. మనం తెల్లవారుజామునే లేచి ఒకచోటకు వెళ్లాలి’ అని పడుకోవడానికి ఒక గది చూపించాడు. గుడ్లగూబయ్య తన గదికి పోవడంతోనే అంతకుముందు విక్రముడికి కనిపించిన బాలిక చడీచప్పుడు లేకుండా మెల్లిగా అతని వద్దకు వచ్చి, అతని చేతిలో కాగితం చుట్టి ఉన్న ఒక గాజుబుడ్డిని పెట్టి, ఒక్క మాటైనా మాట్లాడకుండా వెళ్లిపోయింది. విక్రముడు ఆశ్చర్యపోతూ ఆ కాగితం విప్పి చూసుకునే సరికి, అందులో, ‘నీకేమైనా ఆపద మూడితే ఈ గాజుబుడ్డిని బద్దలుగొట్టు’ అని రాసి ఉంది. ఎందుకైనా మంచిదని ఆ బుడ్డిని మొలలో దోపుకొని, విక్రముడు నిద్రకు ఉపక్రమించాడు.
తెల్లవారుజామునే గుడ్లగూబయ్య వచ్చి విక్రముడిని లేపి తనతో రమ్మన్నాడు. ఒక గుర్రం మీద కొన్ని గోనెసంచులు వేసి విక్రముడిని దాని కళ్లెం పట్టుకుని తన వెనకాలే నడిపించుకురమ్మని ఆజ్ఞాపించాడు. వాళ్లిద్దరూ ఆ గుర్రంతో కొండ దారమ్మటే శిఖరం ఎక్కి వెళ్లారు. వెళ్లగా వెళ్లగా పర్వతం కొసన ఒక తాడిచెట్టంత ఎత్తున నిలువునా ఒక నున్నటి పలకరాయి అడ్డు వచ్చింది. ఆ శి•రం నాలుగు వైపులా అది విస్తరించుకుని ఉంది.‘నలు చదరపు రాతి బోషాణంలా ఉన్న ఈ శిఖరంపైకి ఎక్కితే అక్కడ బంగారపు కణికలుండే గొయ్యి కనిపిస్తుంది. వాటి కోసమే మనం ఇంత దూరం ఇక్కడికి వచ్చాం’ అన్నాడు గుడ్లగూబయ్య.
ఇలా అంటూ శ్రమ తీరడానికని తెచ్చిన షర్బత్తు పెద్దసీసాను విక్రముడికి ఇచ్చి, చిన్న సీసా తను తీసుకుని తాగేశాడు. విక్రముడు వాడి ఔదార్యానికి మెచ్చుకుంటూ ఆ సీసాడు షర్బత్తునూ రెండు గుటకల్లో తాగేశాడు. తాగీ తాగడంతోనే అతడికి కళ్లు మూతలు పడిపోయి, నిద్ర ముంచుకొచ్చింది.
గుడ్లగూబయ్య వెంటనే ఒక సంచీలో నుంచి పెద్ద తోలు తిత్తి ఒకటి తీసి నిద్రపోతున్న విక్రముడిని ఆ తిత్తిలో దూర్చి, అతడి పక్కలో పొడుగాటి కాడకు అతికి ఉన్న ఒక ఇనుపరేకును కూడా పెట్టి కట్టేశాడు. ఆ తిత్తిని అక్కడ అలాగే వదిలేసి, వాడు గుర్రాన్ని తీసుకుని కొంచెం దూరంగా పోయి నిలబడ్డాడు. గూబయ్య అలా వెళ్లాడో లేదో కొండ కొన నుంచి ఇనప ముక్కులూ, ఉక్కు రెక్కలూ గల కాకులు దిగి వచ్చి, విక్రముడితో సహా ఆ తోలుతిత్తిని పైకి ఎత్తుకెళ్లి, ఆ బంగారపు గోతిలో పడేశాయి. పడవేసి ఆ కాకులు తమ ఇనపముక్కులతో ఆ తిత్తిని పొడవసాగాయి.
లోపల ఉన్న విక్రముడికి మత్తు వదిలి, ‘ఈ కాకులేమిటి? ఈ తిత్తి ఏమిటి?’ అనుకుంటూ బయటకు ఊడిపడ్డాడు. తన పక్కనే తగిలిన ఇనపరేకును దొరకబుచ్చుకుని, ఆ కాకులను చెండాడాడు.
విక్రముడు లేచి నిలబడి ఆయాసం తీర్చుకుంటుండగా కింద నుంచి కేక వినబడింది.

‘మళ్లీ కాకులు చుట్టుముట్టకుండా ఆ ఇనపరేకుతో బంగారు కణికలు ఎత్తి కింద పొయ్యి’ అని అరిచాడు గుడ్లగూబయ్య.
వెంటనే విక్రముడు ఇనపచేటతో ఆ కణికల్ని ఎత్తి, ధారకట్టి కిందికి పోశాడు. గూబయ్య కణికల్ని సంచీలలో నింపుకుని, ‘ఇంక చాలు’ అని కేక వేసి, సంచులు గుర్రం మీదకెక్కించి, మెల్లిగా తిరుగుదారి పట్టాడు.
విక్రముడు తను రాకుండానే వెళ్లిపోతున్న గూబయ్యను చూసి, ‘ఏమయ్యోయ్‍! నా మాటేమిటి?’ అని అరిచాడు.

గూబయ్య వికారంగా నవ్వుతూ, ‘నీ మాటా? ఆ గోతిలోనే మనుషుల ఎముకల గూళ్లు కనబడతాయి. లెక్కపెట్టి చూడు. తొంభై తొమ్మిది ఉంటాయి. నువ్వు నూరో వాడివి’ అంటూ ఇంక వెనక్కి తిరిగి చూడక వెళ్లిపోయాడు.
‘ఎంత దుర్మార్గుడు? ఇందుకేనా వీడు నాకు రోజూ పది రూపాయల జీతం ఇస్తానన్నాడు’ అనుకుని విక్రముడు దిక్కులు చూసేసరికి యములాళ్లకు మల్లే చుట్టూ కాకులు కనబడ్డాయి. ‘రెండు మూడు రోజులయ్యేసరికి ఉపవాసాలతో నాకు ఓపిక తగ్గిపోతుంది. అప్పుడింక ఈ కాకులతో పోట్లాడలేక వీటికి బలైపోతాను కాబోలు’ అని అధైర్యపడ్డాడు.
అయినా, గుండె నిబ్బరం చేసుకుని, ఉక్కకు ఆగలేక చొక్కా విప్పుకోబోతుంటే మొలలో ఉన్న గాజుబుడ్డి చేతికి తగిలింది. వెంటనే అతనికి బాలామణి రాసిన చీటీ సంగతి జ్ఞాపకం వచ్చి, గాజుబుడ్డిని బద్దలకొట్టాడు.
పెద్ద చప్పుడుతో అది బద్దలై, అందులోంచి భయంకరమైన భూతం ఒకటి బయటపడి విక్రముడి ఎదుట నిలబడింది.
‘అరే మానవుడా! మునీశ్వరుడు కోపగించి నన్నీ బుడ్డిలో బంధించాడు. వేలకొద్దీ సంవత్సరాల నుంచి నేను ఇందులో ఉండిపోయాను. నీ ధర్మమా అంటూ బయటపడ్డాను. ఇక క్షణమైనా ఆగను. నీకు ఉపకారం చేసిపోతా. ఏమైనా కోరుకో!’ అంది భూతం.
‘ఈ మృత్యుకూపంలో నుంచి నన్ను రక్షించు’ అన్నాడు విక్రముడు.

మరుక్షణంలో అతడు మొదట గుడ్లగూబయ్యతో తారసపడిన బజారులో ఉన్నాడు.

విక్రముడు ధైర్యం తెచ్చుకుని గడ్డం, మీసాలూ అమ్మే ఒక దుకాణంలో ఒక జత కొని మారువేషంతో తిరగసాగాడు.
కొన్నాళ్లయ్యేసరికి గుడ్లగూబయ్య ఆ బజారుకు వచ్చి, మళ్లీ నౌకరు కోసం చూస్తున్నాడు. మాయవేషంలో ఉన్న విక్రముడే మళ్లీ నౌకరుగా కుదిరాడు. గుడ్లగూబయ్య విక్రముడిని పోల్చుకోలేదు. ఇదివరకు మల్లేనే గూబయ్యతో విక్రముడు ఓడలో వెళ్లి, బంగారు భవనం చేరుకున్నాడు. ఇదివరకు మల్లేనే తెల్లవారుజామున వాళ్లిద్దరూ కొండ శిఖరం మీదకు పయనమయ్యారు.
ఈమాటు విక్రముడు సీసాలలోని షర్బత్తును యుక్తిగా తారుమారు చేసి మత్తుమందున్న షర్బత్తును గూబయ్య చేత తాగించి, వాడు నిద్రలో పడ్డంతోనే తోలు తిత్తిలో దూర్చి పడేశాడు. కాకులు గూబయ్యను ఎత్తుకుపోయి ఇనపముక్కులతో పొడుస్తూ ఉండగా గూబయ్యకు మెలకువ వచ్చి ‘బాబోయ్‍’ అన్నాడు. కింద నుంచి విక్రముడు తన మాయగడ్డం, మీసం తీసి గూబయ్య మీద పడేటట్టు విసిరి, ‘బాబోయ్‍, అమ్మోయ్‍ అంటూ ఆలస్యం చేయక బంగారపు కణికలు ఎత్తి కిందకు పొయ్‍’ అని ఆజ్ఞాపించాడు. గూబయ్య కుక్కిన పేనులా నోరెత్తక, విక్రముడు ‘చాలు’ అనేదాకా కణికలు ఎత్తిపోస్తూనే ఉన్నాడు. విక్రముడు తన దారిన పోబోతుంటే, పై నుంచి గూబయ్య ‘రక్షించు.. రక్షించు’ అని కేకలు పెట్టాడు.
విక్రముడు ‘నిన్ను రక్షించడం నాతరం కాదు. ఇంతకీ నువ్వు కిందకు వచ్చి చేసేదేముందిలే. అక్కడే ఉండు రాజా! నీకు కాకుల చేత భోజనం పంపిస్తానులే. నాకు కావాల్సినప్పుడల్లా బంగారు కణికలు తవ్వి కిందపోద్దువి గాని’ అంటూ వెళ్లి బంగారు భవనంలో తనకు తారసపడిన బాలికను చేరుకున్నాడు.
గుడ్లగూబయ్య అలా తొంభై తొమ్మిది మందిని తన స్వార్థానికి బలిచేసి బంగారు కణికలు లెక్కకు మిక్కిలిగా సంపాదించాడు. చివరకు అత్యాశతో తను తీసిన గోతిలో తానే పడి అనుభవించాడు.
విక్రముడు అతడి బంగారు భవంతిని స్వాధీనం చేసుకుని, అందులో ఉంటూ తన మేలు కోరిన అమ్మాయిని వివాహం చేసుకుని, ఉన్నదాంట్లో దానధర్మాలు చేస్తూ సుఖంగా బతకసాగాడు.

Review స్వర్ణకూపం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top